నియంత్రణలో ఖర్చులు తగ్గిన మూలధన వ్యయం
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:12 AM
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధిస్తోందని అధికారులు తెలిపారు. ఖర్చులు నియంత్రణలోనే ఉన్నాయని, అయితే.. మూల ధన వ్యయం కొంత మేరకు తగ్గుముఖం పట్టిందన్నారు.
రాష్ట్రంలో ద్రవ్యోల్బణం సాధారణం
ఆర్థిక వ్యవస్థపై అధికారుల వెల్లడి
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధిస్తోందని అధికారులు తెలిపారు. ఖర్చులు నియంత్రణలోనే ఉన్నాయని, అయితే.. మూల ధన వ్యయం కొంత మేరకు తగ్గుముఖం పట్టిందన్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సెక్రటరీలు, హెచ్‌ఓడీలు, మంత్రుల సమావేశంలో అధికారులు పలు కీలక విషయాలను వెల్లడించారు. 2021-22 నుంచి 2023-24 వరకు ఏపీ ఆర్థిక వృద్ధి జాతీయ సగటు కంటే వెనుకబడిందని, అనంతరం 2024 నుంచి రాష్ట్రం బలంగా పుంజుకుందని వివరించారు. అధికారులు తెలిపిన మరిన్ని వివరాలు.. 2025-26లో జాతీయ వృద్ధిరేటు 7.4శాతం ఉండగా, ఏపీ 9.9 శాతం వృద్ధితో దేశ సగటును అధిగమించింది. 2026 జూన్ నాటి గణాంకాలు పరిశీలిస్తే పన్ను ఆదాయం 18.2 శాతం పెరిగి రూ.8,608 కోట్లకు, పన్నేతర ఆదాయం 17.7 శాతం వృద్ధితో రూ.535 కోట్లకు పెరిగింది. రెవెన్యూ వ్యయం గత ఏడాదితో పోలిస్తే 8 శాతం తగ్గి రూ.22,464 కోట్లుగా నమోదైంది. మొత్తం ద్రవ్యోల్బణం పట్టణ ప్రాంతాల్లో 4.61 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.09 శాతం నమోదైంది. ద్రవ్యోల్బణం ప్రస్తుతం సాధారణంగానే ఉంది. కానీ, పెరుగుతున్న ధరలు.. గృహ వినియోగం, వ్యాపార ఖర్చులపై ప్రభావం చూపకుండా చూసేందుకు దీనిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే మొత్తం రుణాలు 137.6 శాతం మేర వృద్ధి చెందాయి. ప్రాధాన్య రంగాల రుణాలు 66.58 శాతం, వ్యవసాయ రుణాలు 44.66 శాతం బలంగా కొనసాగుతున్నాయి. మొత్తం రుణాల్లో ఎంఎస్ఎంఈ రుణాల వాటా 15.19శాతం. చిన్న వ్యాపారాలకు ఇది ఉపయోగపడుతోంది. క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 1:54 వద్ద స్థిరంగా ఉంది. డ్వాక్రా రుణాల్లో గత ఏడాదితో పోలిస్తే రూ.640.5 కోట్ల నికర తగ్గుదల నమోదైంది. సకాలంలో తిరిగి చెల్లించడంలో విఫలమవడం వల్లే ఇలా జరిగిందని అధికారులు తెలిపారు.