Share News

నకిలీ డీఎస్పీగా అవతారం.. రూ.1.20 కోట్ల మోసం..

ABN , Publish Date - Aug 24 , 2026 | 04:38 PM

హైదరాబాద్‌లో నకిలీ డీఎస్పీగా అవతారమెత్తి అధిక లాభాల పేరుతో భారీ మోసాలకు పాల్పడిన కేటుగాడిని సీసీఎస్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

నకిలీ డీఎస్పీగా అవతారం.. రూ.1.20 కోట్ల మోసం..
Fake DSP Hyderabad

హైదరాబాద్‌, ఆగస్టు 24: నగరంలో నకిలీ డీఎస్పీగా అవతారమెత్తి అమాయకులను మోసం చేస్తున్న కేవీపీ రాజు అలియాస్ డీఎస్పీ రాజును హైదరాబాద్ సీసీఎస్‌ ఈఓడబ్ల్యూ బృందం అరెస్ట్ చేసింది. తిరుపతి డీఎస్పీ పేరును ఉపయోగించుకుంటూ తనకు ఉన్నతస్థాయి పరిచయాలు ఉన్నాయని నమ్మిస్తూ పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బోగస్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించి బాధితులను తన వలలోకి లాగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో ఓ బాధితుడి నుంచి ఏకంగా రూ.1.20 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ పలువురిని ఇదే తరహాలో మోసం చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. నకిలీ హోదాలు, అధికారుల పేర్లు ఉపయోగించుకుని బాధితుల్లో నమ్మకం కలిగించి డబ్బులు దండుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 2021 నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న కేవీపీ రాజును ఎట్టకేలకు సీసీఎస్‌ ఈఓడబ్ల్యూ అధికారులు అరెస్ట్ చేశారు.


కేవీపీ రాజు అలియాస్ డీఎస్పీ రాజుపై ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నకిలీ డీఎస్పీగా తనను తాను పరిచయం చేసుకుంటూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ద్వారా మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా, అతడి మోసాల వెనుక మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలోనూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అరెస్ట్ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండి..

వెలిగొండ నిర్మాణంతో.. నిర్వాసితుల జీవితాల్లో వెలుగు: లంక దినకర్

ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మా దేశం ముక్కలవుతుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు

Updated Date - Aug 24 , 2026 | 04:42 PM