ఏఐతో పట్టణ పాలన!
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:24 AM
పట్టణ ప్రాంతాల్లో రోజువారీగా తలెత్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పురపాలక శాఖ ఇకపై కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించుకోనుంది.
ప్రజలకు మెరుగైన సేవలుఅందించేందుకు పురపాలక శాఖ సన్నద్ధం
పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఒకే వేదిక
ఖమ్మం కేంద్రంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
26 మున్సిపాలిటీలఅనుసంధానానికి టెండర్లు
ఎన్‌ఐయూఎం సహకారం
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో రోజువారీగా తలెత్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పురపాలక శాఖ ఇకపై కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించుకోనుంది. ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తోంది. ఏఐ, డేటా విశ్లేషణ, డిజిటల్ పర్యవేక్షణఆధారంగా పట్టణాల నిర్వహణను సమర్థంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు పట్టణాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రహదారులు, మురుగునీటి నిర్వహణ, ప్రజా ఫిర్యాదులను వేర్వేరు విభాగాలు పరిష్కరిస్తున్నాయి. అయితే ఆయా విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఇకపై ఈ తరహా సమస్యలన్నింటికీ ఒకే వేదిక నుంచి పరిష్కారం చూపేందుకు మున్సిపాలిటీల్లో ఏఐని అమలు చేసేందుకు పురపాలక శాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా ముగిసింది. త్వరలోనే ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది. మొదటి విడతగా రాష్ట్రంలోని 26 మున్సిపాలిటీల్లో ఏఐ ఆధారిత సేవలు అందించనున్నారు. ఇందుకోసం ఆయా మున్సిపాలిటీలను అనుసంధానిస్తూ ఏఐ ఆధారిత సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐయూఎం), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్‌ఐయూఏ) సహకరిస్తున్నాయి.
ఖమ్మం కేంద్రంగా కమాండ్ కంట్రోల్ సెంటర్..
ఖమ్మం- వరంగల్- కరీంనగర్ పట్టణ కారిడార్‌లోని 26 పట్టణ స్థానిక సంస్థలను అనుసంధానించే ఏఐ ఆధారిత సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాజెక్టును ఖమ్మం కేంద్రంగా అమలు చేసేందుకు పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, 23 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో ఏఐతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), జియోగ్రాఫిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్), క్లౌడ్ సాంకేతికత, సైబర్ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టణాల నుంచి సేకరించే సమాచారాన్ని కేంద్రీకృత వేదికపై విశ్లేషించి అధికారులకు సందేశాలు పంపడం ద్వారా సమస్యలకు వేగంగా పరిష్కారం చూపాలనేది ప్రభుత్వ ఆలోచన. ఉదాహరణకు ఏదైనా ఒక ప్రాంతంలో చెత్త కుప్పలు పేరుకుపోయినట్లు కెమెరాల ద్వారా సమాచారం అందితే.. సంబంధిత విభాగానికి నేరుగా సమాచారం వెళుతుంది. తాగునీటి సరఫరాలో అంతరాయాలు, లీకేజీలు, రహదారులపై ట్రాఫిక్ రద్దీ, వీధి దీపాల నిర్వహణ, పౌరుల ఫిర్యాదుల పరిష్కారంలో సాంకేతికత ఉపయోగపడుతుంది. దీంతోపాటు జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా వార్డుల వారీగా సమస్యలను గుర్తించడం, ఆస్తుల వివరాలను అనుసంధానించడం, వివిధ విభాగాల పనితీరును డ్యాష్‌బోర్డుల ద్వారా పరిశీలించేందుకు వీలవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ విభాగాలు, పోలీసు, అగ్నిమాపక శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు కూడా ఇలాంటి కేంద్రాలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
ఎన్‌ఐయూఎం, ఎన్‌ఐయూఏ సంస్థల పాత్ర కీలకం
పట్టణ ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమస్యల పరిష్కారంలో ఎన్‌ఐయూఎం, ఎన్‌ఐయూఏ సంస్థల పాత్ర కీలకంగా మారింది. ఈ రెండు వేర్వేరు సంస్థలైనా.. ప్రాజెక్టు టెండర్లు పిలిచింది మాత్రం ఎన్‌ఐయూఏ. అయితే.. ఏఐ ఆధారిత కమాండ్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే పట్టణాల్లో అన్ని సమస్యలకు ఒకేసారి పరిష్కారం దొరకదని, గుర్తించిన సమస్యలను ఎంత వేగంగా పరిష్కరిస్తున్నామన్న దానిపైనే ఏఐ ఫలితాలు ఆధారపడి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కెమెరాల ద్వారా సేకరించే సమాచార గోప్యత, వ్యక్తుల వ్యక్తిగత వివరాల రక్షణ, సైబర్ దాడుల నుంచి వ్యవస్థలకు ఉండే భద్రత కూడా ముఖ్యమేనని అంటున్నారు.
26 మున్సిపాలిటీలు ఇవే...
ఖమ్మం కేంద్రంగా ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు.. ఖమ్మం జిల్లా పరిధిలోని ఏదులాపురం, కల్లూరు, మధిర, సత్తుపల్లి, వైరా, సూర్యాపేట జిల్లా పరిధిలోని హూజూర్‌నగర్, కోదాడ, నేరేడుచర్ల, సూర్యాపేట, తిరుమలగిరి, జనగామ జిల్లా పరిధిలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్ పరిధిలోని డోర్నకల్, కేసముద్రం, మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, హనుమకొండ పరిధిలోని పరకాల, గ్రేటర్ వరంగల్ పరిధిలో కాజీపేట, కాశీబుగ్గ, వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట, కరీంనగర్ పరిధిలోని చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటుకు సెప్టెంబరు 26న ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో అమల్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?
భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!