ముప్పు చీకట్లు తరిమేద్దామా.. పొదుపు పొద్దుతో!
ABN , Publish Date - Oct 23 , 2026 | 03:52 AM
నీరే ప్రాణం.. బొట్టు బొట్టునూ ఆదా చేద్దాం! ఈ మాట ఏళ్ల నుంచీ వింటూనే ఉన్నాం!!
ఎల్‌నినో నుంచి బయటపడేందుకు స్వీయ నియంత్రణే మందు
ఇంట్లో నీరు, విద్యుత్తు ఆదా చేద్దాం
సాగులో బిందుసేద్యానికీ ప్రాధాన్యమివ్వాలి
పరిశ్రమల్లోనూ పొదుపు చర్యలు అనివార్యం
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నీరే ప్రాణం.. బొట్టు బొట్టునూ ఆదా చేద్దాం! ఈ మాట ఏళ్ల నుంచీ వింటూనే ఉన్నాం!! ఎల్‌నినో రక్కసి విరుచుకుపడటంతో ఈ మాటను ఎప్పటిలాగే అలా వినేసి ఊరుకుంటే బకెట్ నీళ్ల కోసం కూడా విలవిల్లాడాల్సిన దుర్భత స్థితి రావొచ్చు! పారే సెలయేళ్లు, నిండుగా చెరువులు.. పచ్చని పొలాలతో ఉండాల్సిన అక్టోబరు నెలలో మే నెల మాదిరి ఎండలు మండిపోతున్నాయి. కుళాయి నీళ్లు మునుపటి మాదిరిగా వస్తాయన్న గ్యారెంటీ లేదు. అందుకే ఇంటి అవసరాలు, సాగు అవసరాలకు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అనివార్యం ఏర్పడింది. ప్రాజెక్టులు వెలవెలబోతుండటంతో విద్యుత్తుకూ కటకట నెలకొంది. ఫలితంగా కరెంట్ వినియోగం పరంగానూ పొదుపు తప్పనిసరిగా మారింది. మొత్తంగా ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సగటు మధ్య తరగతి జీవి నెలవారీ ఇంటి ఖర్చులను ముందుగానే కాగితమ్మీద రాసుకొని.. పైసా తేడా రాకుండా నెలంతా ఎలానైతే జాగ్రత్త పడతాడో అలాగే భవిష్యత్తు భద్రత కోసం నీరు, విద్యుత్తు పరంగానూ లెక్కలు వేసుకొని పక్కాగా పాటిస్తే ముప్పును కొంతమేర అధిగమించొచ్చు. ఇందుకు తొలుత ఇంటిపెద్దే చొరవ తీసుకోవాలి!
సెల్‌ఫోన్, టీవీని పిల్లలు అదేపనిగా చూడటంపై ఎలానైతే ఆంక్షలు విధిస్తామో.. నీరు, విద్యుత్తు వినియోగంపైనా జాగ్రత్తలు నూరిపోయాల్సిన అవసరం ఉంది. బ్రష్ చేసుకునేప్పుడు, ముఖం కడుక్కునేప్పుడు అలా కుళాయి నీళ్లను వదిలేసే అలవాటు ఉంటే గనక మానుకోవాలి. మగ్గుతో నీళ్లు తీసుకొని వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. షవర్ స్నానం అలవాటు ఉంటే తక్షణమే మానేసి బకెట్ నీళ్లతో కానిచ్చేస్తే బెటరు! ఆ రకంగా ఇంట్లో ఎవరికి వారు స్వీయనియంత్రణ పాటిస్తే నీరు, విద్యుత్తు కొరత తీరుతుంది.. ఖర్ఛూ మిగులుతుంది!
ఇంట్లో నీటిని ఇలా పొదుపు చేద్దాం
కుళాయి అదేపనిగా తెరవడం మానుకోవాలి. వంటిట్లో ఇది మరీ ముఖ్యం. బకెట్‌లో నీళ్లు నింపుకొని.. మగ్గుతో తీసుకుంటూ పాత్రలు కడుక్కోవాలి. బట్టలు ఉతుక్కోవాలి. వాషింగ్ మెషిన్ సామర్థ్యం మేరకు బట్టలు పూర్తిగా వేస్తే తక్కువ నీరు అవసరపడుతుంది. కూరగాయలు కడిగిన నీళ్లను పారబోయకుండా మొక్కలకు పోయొచ్చు. బట్టలు ఉతికిన నీళ్లను టాయిలెట్ ఫ్లష్ అవసరాలకు వాడుకోవాలి.
ట్యాప్ లీకేజీలు ఉంటే రిపేర్ చేయించుకోవాలి.
వాటర్ ప్యూరిఫయర్ల వాడకం బాగా పెరిగిపోయింది. నీరు శుద్ధి జరిగే క్రమంలో కొంత నీరు వృథాగా పోతుంది. ఆ నీటిని అలా సింక్‌లో వదిలివేయకుండా పాత్రల్లో నింపుకొంటే ఇతర అవసరాలకు వాడుకోవొచ్చు.
బైక్‌లు, కార్లను పైప్ నీళ్లతో శుభ్రం చేస్తే వాటర్ వృథా అవుతుంది. అవసరపడినన్ని నీళ్లను బకెట్‌తో వాడుకుంటే పావు వంతు నీళ్లతో పని కానిచ్చేయొచ్చు.
ఇంట్లో బోరు ఉంటే ఆ పక్కన చక్కగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి. వర్షం పడినప్పుడు ఇంటి పైకప్పుపై నీరును ప్రత్యేకమైన పైపు ద్వారా అందులోకి వెళ్లేలా చేస్తే భూగర్భజలాలు పెరుగుతాయి.
సాగులో బిందు సేద్యానికి ప్రాధాన్యమివ్వాలి. పంట వేర్ల వద్దకు నేరుగా నీటిని అందించే సాగు పద్ధతుల ద్వారా వృథానీటిని తగ్గించవచ్చు.
స్పింకర్ల పద్ధతితో కొన్ని పంటల్లో సాగునీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
నేల తేమను పరిశీలించి.. పంట ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి సమయాన్ని నిర్ణయించాలి. అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి
తక్కువ నీటిని వినియోగించే పంటలను ప్రొత్సహించాలి. స్థానిక వాతావరణం.. నేల స్వభావం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి.
పొలాల్లో మల్చింగ్ పద్ధతిని అమలు చేయాలి. పంట అవశేషాలు, తగిన సేంద్రియ పదార్థాలతో నేలను కప్పడం వల్ల తేమ త్వరగా ఆవిరి కాకుండా ఉంటుంది.
నీటి లభ్యతకు అనుగుణంగా సాగు ప్రణాళికలు ఉండాలి. వర్షపాత అంచనాలు, జలాశయాలు, చెరువుల్లో నిల్వలు, భూగర్భజలాల లభ్యతను దృష్టిలో ఉంచుకొని సాగుపై నిర్ణయం తీసుకోవాలి.
పరిశ్రమల్లో నీటి పొదుపు
ప్రతి పరిశ్రమల ఎంత నీటిని వినియోగిస్తోంది? ఎంత అవసరం ఉంది? అనేదానిపై నీటి ఆడిట్‌ను అమలు చేయాలి.
వాడిని నీటిని శుద్ధి చేసి పునర్వినియోగం చేసే విధానాలను పరిశ్రమలు అవలంభించాలి. శుద్ధి చేసిన నీటిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కూలింగ్, ఫ్లోరింగ్, ఉద్యానవనాల అవసరాలకు వినియోగించాలి.
కూలింగ్ వ్యవస్థలో నీటి నష్టాలను నిలువరించాలి. సాధ్యమైన చోట నీటి పునర్వినియోగ వ్యవస్థలను, సమర్ధవంతమైన కూలింగ్ టెక్నాలజీలను అమలు చేయాలి.
పైపుల లీకేజీలను నిరంతరం పర్యవేక్షించాలి. సెన్సర్లు, మీటర్లు, ఆటోమేటిక్ అలర్ట్‌ల ద్వారా నీటి నష్టాన్ని గుర్తించే విధానాలు పాటించాలి
తక్కువ నీటితో పని చేసే సాంకేతికతను ప్రొత్సహించాలి. ఉత్పత్తి ప్రక్రియలను సమీక్షించి నీటి వినియోగం తగ్గించే పరికరాలు తీసుకురావాలి.
పరిశ్రమలకు కాలుష్య నియంత్రణపై ఆంక్షలు ఉన్నట్లుగానే నీటి వినియోగ లక్ష్యాలనూ నిర్ణయించాలి. ఉత్పత్తి ఆధారంగా ప్రతి పరిశ్రమకు ఎంత నీరు అవసరం? ఏటా ఆ నీటి వినియోగ పరిమితిని ఎలా తగ్గించాలి? అనే దానిపై లక్ష్యాలు నిర్ణయించాలి.
విదేశాల నుంచి కొంత నేర్చుకుందాం
చాలా దేశాల్లో నీటి వనరుల వినియోగం మీద ఉత్తమ విధానాలు అమల్లో ఉన్నాయి. 1948లో జెరూసలేం నీటి కొరతను ఎదుర్కొన్న రోజుల్లో ఒక వ్యక్తి రోజుకు 10 లీటర్ల నీటిని మాత్రమే వినియోగించాలనే షరతులు ఉండేవి. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో జలవనరుల పునరుద్ధరణ జరిగాక రోజుకు 165 లీటర్ల ఒక వ్యక్తి వినియోగించేందుకు అనుమతించింది. ఈ దేశంలో బిందు సేద్యం ద్వారా అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ఇక పట్టణ మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణద్వారా వచ్చే నీటిని పునర్వినియోగం కింద పరిశ్రమల అవసరాలకు సరఫరా చేస్తోంది ఆస్ట్రేలియా. ఈ దేశంలో వర్షపాతం చాలా ప్రాంతాల్లో అస్థిరంగా ఉంటుంది. దీంతో నీటి వనరులపై ప్రణాళికాబద్ధంగా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నెదర్లాండ్స్‌లో ఎల్‌నినో తీవ్రత నేపథ్యంలో జూలైలో నీటి వనరుల వినియోగంపై పరిమితులు విధించింది. వ్యవసాయం, తాగునీరు, భూగర్భజలాల వినియోగం మీద ఆంక్షలు విధించింది. వర్షపు నీటిని నిల్వ చేయడం, దాన్ని అవసరమైనప్పుడు ఆయా ప్రాంతాలకు సరఫరా చేసే వ్యవస్థను అభివృద్ధి చేశారు.
విద్యుత్తును ఇలా పొదుపు చేద్దాం
ఏసీని 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచితే వినియోగం తగ్గుతుంది. ఫిల్టర్లను శుభ్రంగా ఉంచుతూ ఏసీని సరైన ఉష్ణోగ్రతల్లో పెడితే విద్యుత్తు ఆదా అవుతుంది. టీవీలు, చార్జర్లు, కంప్యూటర్లు అవసరం లేనప్పుడు పూర్తిగా ఆపేయడం ద్వారా ఆదా చేయొచ్చు.
ఫ్రిజ్‌ను వినియోగించే క్రమంలో తలుపులు ఎక్కువసేపు తెరవకుండా చూసుకోవాలి. ఫ్రిజ్ వెనుక భాగంలో గాలి ప్రసరణకు తగినంత స్థలం ఇవ్వడం ద్వారా నిర్వహణ మెరుగవుతోంది.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) స్టార్ లేబుల్ ఉన్న పరికరాలను ఎంచుకోవాలి. దీని ద్వారా వార్షిక విద్యుత్తు వినియోగం బాగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
సాగులో సమర్థవంతమైన పంపుసెట్ల వినియోగంతో అవసరానికి సరిపోయే సామర్ధ్యం ఉన్న పంపులను ఉపయోగించుకోవాలి. నీటి లభ్యత, భూగర్భజలాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సౌర విద్యుత్తు పంపులు వినియోగించాలి.
పరిశ్రమల్లో ఏ యంత్రం ఎంత విద్యుత్తు వినియోగిస్తుందో తెలుసుకునేందుకు ఎనర్జీ ఆడిట్ పరికరాలు వాడాలి. పట్టణ ప్రాంతాల్లో స్మార్ట్ స్ట్రీట్ లైట్లు, టైమర్లు, కాంతి సెన్సర్లు ఉపయోగించాలి. ప్రభుత్వ భవనాల్లో విద్యుత్తు ఆడిట్ పరికరాలు వాడాలి.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?
భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!