అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి షాక్.. బినామీ ఆస్తుల అటాచ్
ABN , Publish Date - Nov 06 , 2026 | 09:30 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ భీమ్ రెడ్డికి ఐటీ శాఖ అధికారులు మరో షాక్ ఇచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 6: నగరంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందినవిగా భావిస్తున్న బినామీ ఆస్తులపై కీలక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు రూ.59.4 లక్షల విలువైన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని ముత్తంగి బృందావన్ గార్డెన్స్‌లో 200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు ఇళ్లను గుర్తించి జప్తు చేశారు. రికార్డుల్లో ఒక్కో ఇంటి విలువ రూ.14.2 లక్షలుగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇళ్లను జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జి.కల్యాణ్ బాబు 2023 జూలైలో ఇంద్రకిరణ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఐటీ విచారణలో వెల్లడైంది. అనంతరం ఎలాంటి నగదు చెల్లింపులు జరగకుండానే ఇళ్లను ఇంద్రకిరణ్ పేరుతో బదిలీ చేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఇంద్రకిరణ్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ ఆస్తుల వెనుక అసలు లబ్ధిదారుడు డీఎస్పీ భీమ్ రెడ్డేనని అధికారులు గుర్తించినట్లు సమాచారం.
బినామీ భూములు, ఇన్నోవా క్రిస్టా స్వాధీనం..
ఇళ్లతో పాటు ఇతర బినామీ ఆస్తులపైనా ఐటీ అధికారులు విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి పరిధిలో హోంగార్డ్ లక్ష్మణ్ నాయక్ పేరుతో ఉన్న వ్యవసాయ భూముల వెనుక కూడా భీమ్ రెడ్డే అసలు లబ్ధిదారుడిగా ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో మొత్తం 3.20 ఎకరాల వ్యవసాయ భూములను తాత్కాలికంగా జప్తు చేశారు. మరోవైపు యాపిల్ ఎంటర్‌ప్రైజెస్ యజమాని అలూరి సురేష్ నుంచి సుమారు రూ.22 లక్షల విలువైన టయోటా ఇన్నోవా క్రిస్టా కారును భీమ్ రెడ్డి పొందినట్లు విచారణలో గుర్తించారు. పలు సివిల్ వివాదాల్లో అనుకూలంగా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా ఈ కారును ఇచ్చినట్లు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఆధారాలను పరిశీలించిన ఐటీ శాఖ అధికారులు కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గుర్తించి జప్తు చేసిన ఆస్తుల విలువ అధికారిక రికార్డుల ప్రకారం రూ.59.4 లక్షలుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్లో వాటి విలువ కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని ఆస్తులు, లావాదేవీలపై ఐటీ శాఖ విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ