డిండికి నీటిపై రచ్చ వద్దు
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:48 AM
డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని ఎక్కడి నుంచి తరలించాలన్న అంశంపై కాంగ్రెస్ నేతలు ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండు జిల్లాల్లో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే.. పాలమూరు, నల్లగొండ నేతల అభిప్రాయం
ఉత్తమ్‌తో మండలి చైర్మన్ గుత్తా, జానారెడ్డి, జూపల్లి, పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని ఎక్కడి నుంచి తరలించాలన్న అంశంపై కాంగ్రెస్ నేతలు ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలన్న ప్రతిపాదనను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏదుల నుంచే డిండికి నీరు ఇవ్వాలని నల్లగొండ జిల్లా నేతలు కోరుతున్నారు. దీనిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో రెండు జిల్లాల నేతలు గురువారం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. వీరిలో పాలమూరు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, నల్లగొండ జిల్లాకు చెందిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, కొందరు ఎమ్మెలేలు ఉన్నారు. ఏదుల నుంచి డిండికి నీటిని తరలించే అంశంపై సుమారు గంటన్నరపాటు చర్చించారు. ఈ సందర్భంగా రెండు జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, ‘‘రచ్చ రచ్చ వద్దు. ఇది రెండు జిల్లాల విషయం. రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఏ జిల్లాకూ నష్టం జరగకూడదు. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి రాకూడదు’’ అని అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. డిండి ప్రాజెక్టుకు నీరు ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఏదుల నుంచి నీటిని తీసుకుంటే పాలమూరు ఆయకట్టుకు ఇబ్బంది అవుతుందన్నారు. అవసరమైతే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే విషయం ఆలోచించాలన్నారు.
ఏ జిల్లా వాటా ఆ జిల్లాకే..!
పాలమూరు నేతల ప్రతిపాదనపై నల్లగొండ జిల్లా నాయకులు స్పందిస్తూ, ‘‘ఇప్పటికే ఏపీతో శ్రీశైలం నుంచి నీటి పంచాయితీ నడుస్తోంది. మరోవైపు కొత్త ప్రాజెక్టు కట్టాలంటే రూ.12వేల కోట్ల దాకా ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ప్రాజెక్టు పూర్తవడానికి ఆరేడు ఏళ్లు పడుతుంది. పైగా, ఉమ్మడి రాష్ట్రంలోగానీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గానీ ఏదుల నుంచే డిండికి నీటిని తరలించాలని ప్రతిపాదించాయి. ఇటీవలి క్యాబినెట్ భేటీలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. కృష్ణా నీటిలో పాలమూరు జిల్లా వాటా పూర్తయ్యాకే నల్లగొండ జిల్లా వాటా ఉంటుంది’’ అని పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో ఈ విషయాలను శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సమీక్షలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ చెప్పినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?
భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!