ఖమ్మం జిల్లా మధిరలో అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
ABN , Publish Date - May 24 , 2026 | 08:18 PM
ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం విస్తృతంగా పర్యటించారు.
ఖమ్మం, మే 24: జిల్లాలోని మధిర నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గ పరిధిలో శరవేగంగా జరుగుతున్న పలు ప్రతిష్ఠాత్మక అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన ఆయన.. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీపడకుండా నిర్దేశిత గడువులోగా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా మధిర పట్టణ సమీపంలో వైరా నదిపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం స్వయంగా పరిశీలించారు.

వర్షాకాలంలో వచ్చే వరద ముప్పు నుంచి మధిర పట్టణ ప్రజలను, లోతట్టు ప్రాంతాలను కాపాడేందుకు ఈ రక్షణ గోడ నిర్మాణం అత్యంత కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు భట్టి విక్రమార్క. ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన.. వర్షాలు ప్రారంభమయ్యేలోపే పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అనంతరం మధిర శివాలయం సమీపంలో రూ.7 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన వైకుంఠధామం సుందరీకరణ పనులను పరిశీలించారు.
ఆధునిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడేలా జరుగుతున్న ఈ పనుల డిజైన్లను ఉప ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలించారు. తుదిశ్వాస విడిచిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలికేలా.. అన్నిరకాల మౌలిక సదుపాయాలతో ఈ వైకుంఠధామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. మధిర నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జీతం పెంచమంటే గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చిన సంస్థ.. తెరిచి చూస్తే..
ఇది మనకు అవమానం.. తిరిగొచ్చేయండి! ఎన్నారైలకు శ్రీధర్ వెంబు పిలుపు