Share News

సమ్మక్కసాగర్‌ డీపీఆర్‌ వెనక్కి

ABN , Publish Date - Nov 10 , 2026 | 04:14 AM

సమ్మక్క సాగర్‌ (తుపాకుల గూడెం) ప్రాజెక్టు సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) వెనక్కి పంపింది

సమ్మక్కసాగర్‌ డీపీఆర్‌ వెనక్కి
sammakka sagar

  • పూర్తి ఆయకట్టు వివరాలను అందించకపోవడమే కారణం

  • ఎన్‌వోసీ కోసం ముమ్మరంగా సంప్రదింపులు చేస్తున్న ప్రభుత్వం

  • మూడుసార్లు ఛత్తీస్ గఢ్‌ సీఎంతో మంత్రి ఉత్తమ్‌ భేటీ

  • దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి

  • డిండి, కాళేశ్వరం అదనపు టీఎంసీపై నేడు సీఎం సమీక్ష

హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సమ్మక్క సాగర్‌ (తుపాకుల గూడెం) ప్రాజెక్టు సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) వెనక్కి పంపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల శాఖ సమర్పించిన సీడీవో (సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌) సర్టిఫికెట్‌పై సీడబ్ల్య్యూసీ అభ్యంతరం తెలిపింది. ప్రాజెక్టును అప్రైజల్‌ (సాంకేతిక, ఆర్థిక పరిశీలన)లో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించింది. ప్రాజెక్టుల కింద ఏ మేరకు భూములకు సాగునీరు అందిస్తున్నారనే వివరాలను ధ్రువీకరించకపోవడం తదితర కారణాలతో దేశవ్యాప్తంగా పలు నీటిపారుదల ప్రాజెక్టుల డీపీఆర్‌లను సీడబ్ల్యూసీ వెనక్కి పంపుతూ నిర్ణయం తీసుకుంది. సమ్మక్కసాగర్‌ విషయానికి వస్తే.. 2011లో 10ు కమాండ్‌ ఏరియాను మాత్రమే ధ్రువీకరించి, ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను దాఖలు చేశారు. కానీ, డీపీఆర్‌లను పరిశీలించాలంటే విధిగా వందశాతం కమాండ్‌ ఏరియా సర్వే చేసి, ధ్రువీకరించాల్సిందే అని సీడబ్ల్యూసీ గుర్తు చేసింది. అవసరమైన మార్పులు చేసి, నిబంధనలకు అనుగుణంగా సవరించిన డీపీఆర్‌ను మళ్లీ సమర్పించాలని తెలంగాణ నీటిపారుదల శాఖను ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబరు 15న సీడబ్ల్యూసీ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకూ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. నీటిపారుదల ప్రాజెక్టుల డీపీఆర్‌ల తయారీలో కీలక మార్పులు చేసింది. ప్రాజెక్టు కమాండ్‌ ఏరియాలో చివరి రైతు పొలం వరకు నీటిని చేరవేసే వ్యవస్థను అంచనా వేయడానికి 100 శాతం ప్రాంతంలో సమగ్ర సర్వే నిర్వహించాలని స్పష్టం చేసింది.


ప్రధాన కాలువతోపాటు బ్రాంచ్‌ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు సహా కాలువల వ్యవస్థలు, నిర్మాణాలపై 100 శాతం పరిశీలన జరపాలని నిర్దేశించింది. ఈ నిబంధనలకు అనుగుణంగా సర్వే నిర్వహించనందున సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు ప్రతిపాదనను అప్రైజల్‌ ప్రక్రియ నుంచి తొలగిస్తున్నట్లు సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. సీడబ్ల్యూసీ 2010లో జారీ చేసిన డీపీఆర్‌ తయారీ మార్గదర్శకాలతోపాటు అక్టోబరు 15న జారీ చేసిన తాజా సూచనలను అనుసరించి సవరించిన డీపీఆర్‌ను ఈ-పీఏఎంఎస్‌ (ఈ-ప్యామ్‌) పోర్టల్‌ ద్వారా తిరిగి సమర్పించాలని సూచించింది. డీపీఆర్‌ తయారీలో డ్రోన్లు, లైడార్‌ (లైట్‌ డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌), డీజీపీఎస్/ఆర్టీకే-జీపీఎస్‌, హెచ్‌ఆర్‌ఎస్ఐ, జీఐఎస్‌, హైరిజల్యూషన్‌ డిజిటల్‌ ఎలివేషన్‌ వెడల్స్‌ వంటి ఆధునిక సర్వే సాంకేతికతలను వినియోగించాలని సీడబ్ల్యూసీ సూచించింది. కాలువల అలైన్‌మెంట్‌, భూసేకరణ అవసరాలు, ఇప్పటికే ఉన్న లేదా ప్రతిపాదిత మౌలిక వసతులతో తలెత్తే సమస్యలను గుర్తించేందుకు పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ పోర్టల్‌లోని సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. డిజైన్లు, డ్రాయింగ్‌లతోపాటు సీడీవో ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. కేంద్ర నిధులతో చేపట్టే ప్రాజెక్టుల్లో ఆమోదించిన వ్యయాన్ని మించి పెరిగే అదనపు భారాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కూడా మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతోనే కట్టుకుంటోంది. రూ.9257 కోట్లతో చేపట్టిన ఈ బ్యారేజీలో 95 శాతం మేర పనులు పూరయ్యాయి. ఈ బ్యారేజీలో నీటిని నిల్వ చేసి.. బ్యాక్‌వాటర్‌ను దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోయడం ద్వారా పూర్వ ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు నీరందించాలనేది ప్రభుత్వ లక్ష్యం


ఎన్‌వోసీ కోసం..

సమ్మక్కసాగర్‌ డీపీఆర్‌కు సీడబ్ల్యూసీలోని అంతరాష్ట్ర విభాగం తప్ప.. అన్ని డైరెక్టరేట్లూ ఇప్పటికే క్లియరెన్స్‌లు ఇచ్చాయి. ముంపునకు సంబంధించి ఛత్తీస్ గఢ్‌ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకుంటే ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్‌లు ఇస్తామని సీడబ్ల్యూసీ ఇదివరకే చెప్పింది. 2023 డిసెంబరులో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు అనుమతులపై దృష్టి పెట్టింది. ఒకసారి స్వయంగా నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఛత్తీస్ గఢ్‌కు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయిని కలుసుకొని ఎన్‌వోసీపై చర్చించారు. తర్వాత హైదరాబాద్‌, న్యూఢిల్లీలో కూడా ఆయనతో చర్చలు జరిపారు. పలు దఫాలు ఫోన్‌లో కూడా ఆయనతో సంప్రదింపులు జరిపారు. మరోవైపు.. ముంపు అధ్యయనానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చింది. ఆ అధ్యయన నివేదిక వచ్చాక ముంపుపై అంచనాలు రూపొందించి.. భూములకు గరిష్ఠ పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఛత్తీస్ గఢ్‌ హామీ కూడా ఇచ్చింది. మరోవైపు.. సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో పలుమార్లు భేటీ అయి వినతిపత్రాలు సమర్పించారు. ఈ క్రమంలో డీపీఆర్‌ను వెనక్కి పంపించడం కలకలం రేపింది.


ఇదీ సమస్య..

ఈ బ్యారేజీకి అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం 2021 సెప్టెంబరులో డీపీఆర్‌ దాఖలు చేయగా.. దీనిపై అభ్యంతరాలు/అభిప్రాయాలు తెలియజేయాలని కోరుతూ సీడబ్ల్యూసీ ఈ డీపీఆర్‌ను కు పంపించింది. తెలంగాణ విజ్ఞప్తితో అధికారులు బ్యారేజీని 2023 సెప్టెంబరు 6 నుంచి 9దాకా పరిశీలించారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటినిల్వ 83 మీటర్లు కాగా... అక్కడిదాకా ముంపునకు గురయ్యే భములకే పరిహారం చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే గరిష్ఠ వరద 2022 జూలై 17, 19వ తేదీల్లో 88 మీటర్ల దాకా రికార్డయిందని.. ఆ మేరకు ముంపునకు గురయ్యే భూములకు కూడా పరిహారం చెల్లించాల్సిందేనని గతంలో పట్టుబట్టింది. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర సర్కారు ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిపుణులతో అధ్యయనం చేయించింది. బ్యారేజీ వద్ద 87 మీటర్ల గరిష్ఠ వరదతో బీజాపూర్‌ జిల్లాలోని పోటరు, కౌటరు, తుర్లగడ, గంగారం, కంబాలపేట, సీతానగరంలో 100 ఎకరాలు ముంపునకు గురయ్యే ముప్పు ఉందని ఆ అధ్యయనంలో తేలింది.

ఇవి కూడా చదవండి..

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి 4 లక్షల మంది.. ప్రధాని మోదీకీ ఆహ్వానం!

ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో యూపీ పట్టణం లోనీ

Updated Date - Nov 10 , 2026 | 04:14 AM