పోలీస్ అధికారిగా శివధర్ రెడ్డి సేవలు వెలకట్టలేనివి: సీవీ ఆనంద్
ABN , Publish Date - Apr 30 , 2026 | 10:03 AM
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ మే 1న బాధ్యతలు చేపట్టనున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ మే 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఈ రోజు(గురువారం) పదవీ విరమణ పొందుతున్న శివధర్ రెడ్డి సేవలను కొనియాడుతూ, పోలీస్ శాఖ భవిష్యత్తు కార్యాచరణపై తన దిశానిర్దేశాన్ని స్పష్టం చేశారు. 32 ఏళ్లుగా పోలీస్ అధికారిగా శివధర్ రెడ్డి అందించిన సేవలు వెలకట్టలేనివని ఆనంద్ ప్రశంసించారు. శివధర్ రెడ్డి పనితీరును తాను ఎంతో సమీపంగా గమనించానని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నూతన డీజీపీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘శివధర్ రెడ్డి.. సమైక్య రాష్ట్రంలో నక్సలిజం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తూ ఎన్నో సవాళ్లను అధిగమించారు. మావోయిస్టులు పెద్దఎత్తున లొంగిపోయేలా చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఆపరేషన్ అమలులో ఆయన సాధించిన విజయం, భారీగా ఆయుధాల సీజ్ వంటివి రాష్ట్ర భద్రతకు దోహదపడ్డాయి. పోలీస్ కుటుంబాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు’ అని అన్నారు.
రాష్ట్రంలో నేడు ట్రాఫిక్ సమస్యలు, నార్కోటిక్ డ్రగ్స్, సైబర్ నేరాలు ప్రధాన సవాళ్లుగా మారాయని ఆనంద్ చెప్పుకొచ్చారు. జనాభా పెరుగుదల, పట్టణీకరణ వేగంగా జరుగుతున్న తరుణంలో పోలీసులు అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రేహౌండ్స్, ఎస్ఐబీ(SIB), సైబర్ సెక్యూరిటీ బ్యూరోల పనితీరును మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. 2016 నుంచి తనతో కలిసి పనిచేసిన అధికారుల అనుభవాన్ని కలుపుకుని, పూర్తి బాధ్యతతో టీమ్ వర్క్‌గా ముందుకు వెళ్తామని సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కాపాడటంలో పోలీస్ శాఖ బాధ్యత ఎంతో ఉందని, అందరం కలిసికట్టుగా శాంతిభద్రతలను కాపాడదామని నూతన డీజీపీ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..