Share News

కాంగ్రెస్ హైకమాండ్ ముందు జీవన్ రెడ్డి ఆవేదన

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:02 PM

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో భేటీ అయ్యారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగిన టికెట్ల కేటాయింపుపై జీవన్ రెడ్డి గణంకాలతో సహా హైకమాండ్‌‌కు వివరించారు.

కాంగ్రెస్ హైకమాండ్ ముందు జీవన్ రెడ్డి ఆవేదన
Senior Congress leader Jivan Reddy met party high command

జగిత్యాల/హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పదవుల కేటాయింపుపై ఆయన తన గళాన్ని విప్పారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లతో భేటీ అయిన జీవన్ రెడ్డి, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.. కానీ!

జీవన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. 'నేను ఎప్పుడూ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తనే. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. అయితే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన వారికే పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని ఆయన పేర్కొన్నారు. తన ఆలోచనలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని హైకమాండ్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగిన టికెట్ల కేటాయింపుపై జీవన్ రెడ్డి గణంకాలతో సహా హైకమాండ్‌‌కు వివరించారు.


గెలుపు గుర్రాల లెక్కలతో ఆవేదన..స్ట్రైక్ రేట్:

స్ట్రైక్ రేట్: తనకు కేటాయించిన 16 బీ-ఫారమ్ లలో 9 మందిని గెలిపించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఎంపీ సంజయ్ కుమార్ పక్కన పెట్టిన 9 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారని, అంటే వారు బలమైన అభ్యర్థులని ఆయన వాదించారు. సంజయ్‌కి 34 బీ-ఫారమ్ లు ఇస్తే కేవలం 14 మంది మాత్రమే గెలిచారని, తన వర్గం వారికి టికెట్లు రాకుండా పక్కన పెట్టడం వల్లే నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అనుచరుల డిమాండ్: రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందే!

జీవన్ రెడ్డి మద్దతుదారులు కూడా ఏఐసీసీ సెక్రటరీ ముందు తమ వాదనను గట్టిగా వినిపించారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడిని విమర్శించడం సరికాదన్నారు. జీవన రెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించి, రానున్న రాజ్యసభ స్థానాన్ని జీవన్ రెడ్డికి కేటాయించాలని అనుచరులు, మద్దతుదారులు డిమాండ్ చేశారు. చైర్మన్ పదవుల కేటాయింపులో జీవన్ రెడ్డి వర్గానికి సముచిత స్థానం కల్పించాలని వారు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్

ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్

Updated Date - Feb 15 , 2026 | 04:30 PM