మిత్రబంధానికే పట్టం
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:32 AM
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డిల అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది.
పెద్దల సభకు అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డి.. సీఎం రేవంత్ అభీష్టానికే అధిష్ఠానం ఓటు
మరో స్థానానికి అభిషేక్ మను సింఘ్వీ
తెలంగాణ నుంచి అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డిల అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. రేసులో పలువురి పేర్లు, పలు అంశాలపై చర్చ జరిగినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి అభీష్టానికే అగ్ర నాయకత్వం మొగ్గు చూపింది. తెలంగాణలో కేఆర్ సురేశ్‌రెడ్డి(బీఆర్‌ఎస్), అభిషేక్ మను సింఘ్వీ(కాంగ్రెస్) రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. ఆ రెండు స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు గురువారంతో గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఒక అభ్యర్థిగా సింఘ్వీ ముందే ఖరారవగా.. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆయనకు తమిళనాడు కోటాలో అవకాశం కల్పించాలని, తెలంగాణ వారికే రెండు స్థానాలు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరింది. కానీ, తమిళనాడులో రాజకీయ సమీకరణాలు కుదరకపోవడంతో సింఘ్వీని తెలంగాణ నుంచే మరోసారి రాజ్యసభకు పంపాలని అధినాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్ నేతలు రాజ్యసభ కోసం పోటీ పడ్డారు. 16 మంది అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి పంపారు. అందులో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించిన తర్వాత ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. బుధవారం ఢిల్లీలో రాహుల్, ఖర్గే, వేణుగోపాల్‌లతో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భేటీ కావాల్సి ఉండగా.. ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లోనే చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మహేశ్‌గౌడ్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం అమిత్ షాతో కీలక సమావేశం ఉండడంతో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం రాహుల్, ఖర్గే, వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్, మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో అభ్యర్థులపై చర్చించారు. ఒక స్థానానికి అభిషేక్ సింఘ్వీని ఖరారు చేయగా.. మరో స్థానానికి వేం నరేందర్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, దమ్మాటి సాంబయ్య పేర్లపై చర్చ జరిగింది. అంతిమంగా రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో వేం నరేందర్‌రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కావడం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి వెన్నంటి ఉండడం ఆయనకు కలిసొచ్చిన అంశమని పార్టీ వర్గాలు తెలిపాయి. సింఘ్వీ, నరేందర్‌రెడ్డిలు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
అభిషేక్ సింఘ్వీతో టీపీసీసీ చీఫ్ భేటీ
హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాజ్యసభ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీని మహేశ్ గౌడ్ తాజ్ కృష్ణ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. భట్టి కుమారుడి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు సింఘ్వీ సతీసమేతంగా విచ్చేశారు. ఈ క్రమంలోనే మహేశ్‌గౌడ్ సింఘ్వీని కలిసి.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
మిత్రుడికే దక్కింది..
సీఎం రేవంత్‌రెడ్డి మిత్రబంధానికి పట్టం కట్టారు. వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నరేందర్‌రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత ఆ స్థానం రిజర్వ్ కావడంతో 2010లో వరంగల్ వెస్ట్ నుంచి బరిలోకి దిగారు. అక్కడ ఓటమిపాలైనా వరంగల్ రాజకీయాల్లో పట్టు సాధించారు. జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందారు. నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. అనంతరం మారిన రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్‌తోపాటు టీడీపీని వీడి 2017లో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి రేవంత్‌కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మకస్థుడిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వా త సీఎం సలహాదారుగా నియమితులయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా వదులుకొని పార్టీ అభివృద్ధి కోసమే నరేందర్‌రెడ్డి పనిచేశారని.. ఆయన పనితీరును గుర్తించిన అధిష్ఠానం రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి వేం నరేందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్?
తెలంగాణలో 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 66, బీఆర్‌ఎస్‌కు 37, మజ్లి్‌సకు 7, బీజేపీకి 8, సీపీఐకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అయితే, బీఆర్‌ఎస్‌కు మజ్లిస్ సహా ఇతర ఏ పార్టీలు మద్దతునిచ్చే పరిస్థితి లేదు. ఉన్న 37 మంది ఎమ్మెల్యేల్లోనూ పదిమంది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. ఇక మిగిలింది 27 మంది మాత్రమే. రాజ్యసభ బరిలో నిలిస్తే వారైనా బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేస్తారా? అంటే.. అనుమానమే! ఆ 27 ఓట్లు కూడా పడకపోతే పార్టీ మరింత బలహీన పడే అవకాశం ఉంటుందని అంతర్గతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో పరాజయంతో పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. ఈ క్రమంలో రాజ్యసభ బరిలో నిలిచి పార్టీ క్యాడర్‌ను మరింత సందిగ్ధంలో పడేయడం ఎందుకనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది.