మోదీ అయినా.. కేడీ అయినా.. భయపడం
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:04 AM
ఢిల్లీలో ఉన్న మోదీకైనా, ఫామ్‌హౌస్‌లో ఉన్న కేడీకైనా భయపడేది లేదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధికి ఎవరైనా తలవంచాల్సిందేనన్నారు.
మా అభివృద్ధికి మోదీ, కేసీఆర్ తలవంచాల్సిందే
సంక్రాంతి తర్వాత ప్రజాబలంతో సునామీ సృష్టిస్తాం
దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు.. ప్రజలకు తిరిగి ఇచ్చేస్తా
బియ్యం ధరలపై భయమొద్దు.. ఏడాదికి సరిపడా నిల్వలు
కేటీఆర్ గడ్డం పెంచుకుంటే రేవంత్‌రెడ్డి కాలేడు
2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణా జలాలు
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం
కొడంగల్‌లో రైతు ఆత్మీయ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్య తీరుస్తా
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
‘ఢిల్లీలో ఉన్న మోదీకైనా, ఫామ్‌హౌస్‌లో ఉన్న కేడీకైనా భయపడేది లేదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధికి ఎవరైనా తలవంచాల్సిందేనన్నారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం ఉంటే ఢిల్లీని సైతం ఎదిరించి నిలబడతామని, ప్రధాని మోదీ అయినా, ప్రతిపక్ష నేత కేసీఆర్ అయినా అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గబోమని చెప్పారు. సంక్రాంతి తరువాత ప్రజాబలంతో సునామీ సృష్టిస్తామని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కొడంగల్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా సోమవారం కొడంగల్ నివాసం నుంచి బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి.. దారిలో పోలెపల్లి ఎల్లమ్మను దర్శించుకున్నారు. అక్కడి నుంచి లగచర్ల చేరుకుని ఇండస్ట్రియల్‌కారిడార్‌లో నిర్మిస్తున్న ఎకో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వేలాది మందితో కలిసి హకీంపేట బహిరంగ సభ వరకు పాదయాత్ర నిర్వహించారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన రైతు ఆత్మీయ సభలో మాట్లాడుతూ.. దేవుడు తనకు జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని అవకాశాలు ఇచ్చాడని, ఇక ప్రజలకు తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. తెలంగాణను నంబర్‌వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టేందుకు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానని, సీఎం అయిన తరువాత ఒక్క రోజూ సెలవు తీసుకోలేదని చెప్పారు.
కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం..
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని, అయితే ఈ సమస్యను కలిసికట్టుగా ఎదుర్కొందామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సాధారణంగా కరువు వస్తే ఆహార ధాన్యాలు, తాగునీటి కొరత ఏర్పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ప్రధానంగా నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని అన్నారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బియ్యానికి కొదవ లేదని, 12 నెలలకు సరిపడా బియ్యాన్ని ఖజానాలో దాచిపెట్టామని తెలిపారు. ఈ ఒక్క సీజన్‌లో వడ్లు పండించకపోయినా ఏడాదికి సరిపడా సన్న బియ్యం ఫ్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. ప్రజలు బియ్యం ధరలు పెరుగుతాయని భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సంక్రాంతి తర్వాత కొడంగల్ నుంచి ప్రజాబలం కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి కరువును ఎదుర్కొనే కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా నిలబెట్టాలనుకున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆనాడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ‘‘ధనిక రాష్ట్రం, మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఏడో తారీకు వచ్చినా ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఎందుకని అడిగితే.. పదేళ్లలో కేసీఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు అధికారులు చెప్పారు. నెత్తిమీద అప్పు.. చేతిలో చిప్ప పెట్టి అయ్యగారు పోయి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఇప్పుడే గాడిలో పెడుతున్నాం. 5లక్షల మంది ఉద్యోగులకు మొదటి తారీకున జీతాలు ఇస్తున్నాం. మిగతా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 5వ తేదీన ఇస్తున్నాం’’ అని సీఎం వివరించారు. నిజాం పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత ఎంతో మంది నాయకులు తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినా పాలమూరు వలసలు ఆగలేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడితే పాలమూరు రైతుల కష్టాలు తీరుతాయని, వలసలు ఆగుతాయని భావించి 2009 ఎన్నికల్లో కేసీఆర్‌కు మద్దతిచ్చామని తెలిపారు. ఉద్యమం దెబ్బతినకూడదని విఠల్‌రావును పక్కనపెట్టి కేసీఆర్‌ను పార్లమెంటుకు పంపించామని చెప్పారు. తెలంగాణ సాధన కోసం కనిపించిన ప్రతి దేవుడినీ మొక్కుకున్నామని, రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పాలమూరు జిల్లాకు ప్రాధాన్యత ఇస్తారని ప్రజలు ఆశించారని అన్నారు. అయితే తనను ఆదరించిన పాలమూరు ప్రజల కష్టాలను కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు.
పది జన్మలెత్తినా రేవంత్‌రెడ్డివి కాలేవ్
కేటీఆర్ తనను అనుకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, గడ్డం పెంచుకున్నంత మాత్రాన నాయకత్వ లక్షణాలు రావని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘కేటీఆర్.. నీకు గడ్డం రావవడానికి 50 ఏళ్లు పట్టింది.. బుద్ది రావడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. మోకాళ్ల దాకా కాళ్లకు అడ్డం పడే విధంగా గడ్డం పెంచుకున్నా, పది జన్మలు ఎత్తినా.. ఎప్పటికీ నువ్వు రేవంత్ రెడ్డివి కాలేవు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. కొడంగల్‌కు నీళ్లు వస్తే కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ‘‘కొడంగల్ బాగుపడతుందని గోల చేస్తున్నారు. మీ అయ్య సొమ్ము లేదా మీ సొమ్ము ఏమన్నా గుంజుకున్నామా? లేకపోతే మీ బ్యాంకులో ఉన్న సొమ్ము అడిగామా? మా కష్టమే కదా ఇది? మా భూములే కదా? మా హకీంపేట, మా పోలేపల్లి, ఈర్లపల్లి, లగచర్ల ప్రజలు ఇచ్చినా మా భూములే కదా? మా భూముల్లో పరిశ్రమలు పెట్టుకుంటే మీకెందుకు బాధ?’’ అని ప్రశ్నించారు. కేటీఆర్ ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు ఆపే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు అడ్డుపడినా ఇక్కడ ప్రారంభించిన రూ.10 వేల కోట్ల పనులు పూర్తి చేస్తామని, 2028 డిసెంబరు నాటికి కృష్ణా జలాలు తీసుకొచ్చి కొడంగల్ భూముల్లో పచ్చని పంటలు పండించే బాధ్యత తనదని ప్రకటించారు. హైదరాబాద్ నుంచి కొడంగల్‌కు గంటలో చేరుకునేలా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, దానికి ఇరువైపులా పది వేల ఎకరాల్లో పారిశ్రామిక వాడలు నిర్మిస్తున్నామని, అందులో కొడంగల్‌లోనే 3వేల ఎకరాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
మీడియా మిత్రుల ఇళ్లస్థలాల సమస్య తనకు తెలుసునని, దానిని పరిష్కరించే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఇళ్ల పట్టాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, అయినప్పటికీ ఏదో ఒక మార్గంలో వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు, రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
పాదయాత్రగా బహిరంగ సభకు..
కొడంగల్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం కొడంగల్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో పోలెపల్లికి చేరుకున్నారు. పోలెపల్లి శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం లగచర్ల భారీ బహిరంగ సభకు పాదయాత్రగా బయలుదేరారు. సీఎంతో పాటు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ...ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో కొడంగల్ అభివృద్ధికి మరింత ముందుకు సాగుతున్నామని అన్నారు. నియోజకవర్గంలో రూ.9,053 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు.
సీఎం విజనరీతో కొడంగల్‌లో వెలుగులు: భట్టి
ప్రతిపక్షాల అబద్దాలు నమ్మొద్దు: తుమ్మల
తరతరాలుగా వెనుకబడి ఉన్నపాలమూరు ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హకీంపేట సభలో కొనియాడారు. తరతరాలుగా వెనకబాటుకు గురైన కొడంగల్ నియోజకవర్గంలో.. సీఎం విజనరీతో ఇప్పుడు వెలుగులు కనిపిస్తున్నాయన్నారు. ‘‘కొడంగల్ ప్రజలు అదృష్టవంతులు. ఈ ప్రాంతంలో ఒక మహా అద్భుతం జరుగుతోంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం ఎంతో ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించి, దృడసంకల్పంతో వాటిని ముందుకు తీసుకువెళుతున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కేవలం గంటలో కొడంగల్‌కు చేరుకునేలా రహదారి నిర్మాణం చేపడుతున్నారని, ఆ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. ఇక.. అధికారం కోల్పోయిన వారు, అధికారంలోకి రావాలని చూస్తున్నవారు ప్రజలను అబద్దాలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వారి మాటలు నమ్మొద్దని.. వాస్తవాలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కరువును ఎదుర్కొనేందుకు రైతులు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. ఈ కరువు కాంగ్రెస్ తెస్తోందని.. సీఎం రేవంత్‌రెడ్డి తెస్తున్నారని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తుమ్మల మండిపడ్డారు.
మళ్లీ రేవంతే సీఎం
కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం: మహేశ్ గౌడ్
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుచుకోవడం ఖాయమని.. రేవంత్ రెడ్డే మళ్లీ సీఎం అవుతారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. హకీంపేటలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఫ్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు.. కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు చూస్తే మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందన్నారు. మరెవరైనా అధికారం కోసం ఆశపడితే వారి ఆశలు అడియాసలేనన్నారు. ‘‘ఈ రాష్ట్రాన్ని దోచుకున్నవారు దాచుకున్నవారు సోషల్ మీడియా వేదికగా ఇంకేదో ఆశలు పెట్టుకుంటున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే మాట కూడా ఈ సందర్భంగా చెబుతున్నా’’నన్నారు. కాగా.. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన విజయవంతమైంది. మూడు రోజులపాటు కొడంగల్‌లో గడిపిన సీఎం రూ.10వేల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సోమవారం ఆయన వేలాదిమందితో లగచర్లలో నిర్వహించిన పాదయాత్రలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం హకీంపేటలో జరిగిన బహిరంగ సభకు 50వేల మందికిపైగా జనం తరలి వచ్చారు. ఈ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్‌ను నింపింది. కాగా.. మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, పరిపాలన యంత్రాంగమంతా కొడంగల్‌లోనే ఉండడంతో మూడు రోజులపాటు పండుగ వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి 4 లక్షల మంది.. ప్రధాని మోదీకీ ఆహ్వానం!
ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో యూపీ పట్టణం లోనీ