గంట ఎక్కువ పని చేయండి!
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:02 AM
ఉద్యోగుల విశ్వాసమే తమ బలం అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఒక గంట అదనంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎగ్గొట్టే వాళ్లతో పన్నులు కట్టించండి.. ముఖ్యమంత్రి సీట్లో మీ సోదరుడున్నాడు
మీ కష్టాల్లో ప్రభుత్వం తోడుంటుంది.. కలిసి రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలబెడదాం
నన్ను రేవంతన్న అంటేనే సంతోషం.. పీఆర్సీ త్వరలో అమలు చేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు.. ఉద్యోగుల బీమా పథకం ప్రారంభం
హైదరాబాద్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల విశ్వాసమే తమ బలం అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఒక గంట అదనంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, అందరం కలిసి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గురువారం ఆయన ఉద్యోగుల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉద్యోగులకు బీమా రక్షణ గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి తన వద్దకు వచ్చి చెప్పినపుడు సాధ్యమవుతుందని నమ్మలేదన్నారు. సింగరేణిలో తొలుత అమలు చేద్దామని ఆయన సూచించారని, కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.1.20 కోట్ల వరకు బీమా వస్తుందని చెప్పారని వెల్లడించారు. కార్మికుడు, ప్రభుత్వం పైసా చెల్లించకుండా ఈ పథకం ఎలా సాధ్యం అవుతుందని తాను ప్రశ్నించానన్నారు. భట్టి ఉద్యోగుల వేతనాల లావాదేవీలు నిర్వహించే బ్యాంకర్లతో మాట్లాడి ఇందుకు ఒప్పించారని చెప్పారు. 45 మంది సింగరేణి కార్మికులు మృతి చెందితే ప్రతి కుటుంబానికి రూ.కోటి పైగా చెక్కులు అందాయని తెలిపారు. మధ్య తరగతి కుటుంబాలది ఇంట్లో కష్టాలను బయటకు చెప్పుకోలేమని మనస్తత్వమని, ఎవరేమనుకుంటే మనకెందుకులే అని బరితెగించి వీధుల్లో తిరగలేరని వ్యాఖ్యానించారు. తానూ అక్కడి నుంచే వచ్చానని, చెప్పుకోలేని బాధ, తీర్చలేని సమస్య ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్న కుటుంబానికి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

బతికున్నప్పుడు ఉన్న బంధుత్వాలు చితికి పోయినప్పుడు నిలబడవని అన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే యజమాని కాబట్టి వాళ్ల కష్టసమయంలో ఆదుకోవాల్సిన బాధ్యతను గుర్తించి, 16 బ్యాంకులను ఒప్పించి ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. తన గురించి తాను ఒక సందర్భంలో గుంపు మేస్ర్తీగా చెప్పుకున్నందుకు అవహేళన చేస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తాను గుంపు మేస్ర్తీనేనని, ఈ గుంపే తన బలమని, ఈ గుంపే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతుందని చెప్పారు. తాము దొరలమని, గడీలు ఉన్నాయని కొందరు చెప్పుకుంటారని, తనకు అలాంటి పోకడలు లేవని అన్నారు. ఎవరైనా తనను రేవంతన్నా అని పిలిస్తేనే తనకు ఇష్టమని ముఖ్యమంత్రి అన్నారు. సీఎం అయిన కొత్తలో ఉద్యోగులు తనను అన్నా అని పిలుస్తుంటే అధికారులు వచ్చి సార్ అని పిలవమని చెప్పే ప్రయత్నం చేశారని, మరోసారి అలా చేస్తే ముందు నీ ఉద్యోగం పోతుందని అధికారిని హెచ్చరించానని తెలిపారు. తన రాజకీయ జీవితంలోనూ జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ప్రజలు ప్రేమతో రేవంతన్న అని పిలిస్తేనే ఇష్టంగా ఉండేదన్నారు. అన్న అనేది శాశ్వతం అని, పదవులు వస్తాయి, పోతాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్లో 50 శాతం పాతవారే గెలిచారని, నిర్ణయాలు తీసుకునే 17 మందే మారారని చెప్పారు.
పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం
తెలంగాణను పాలించిన గత పాలకులు పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యోగులకు మొదటి తేదీ జీతాలు ఇవ్వని పరిస్థితి ఉండేదని ప్రస్తావించారు. సకాలంలో వేతనాలు అందక రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. 2024 జనవరి 1 నుంచి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు వేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోగానే విడతలవారీగా ఉద్యోగులకు జీతాలిస్తే వారితో పని చేయించుకోలేనని సీఎ్‌సకు స్పష్టం చేశానన్నారు. కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం వల్ల మూడేళ్ల కిందటి పదవీ విరమణ ప్రయోజనాల మొత్తాల భారం నెలకు వెయ్యి కోట్లు అవుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల విషయంలో తమ ఉద్దేశాల్లో తేడా లేదని, అమల్లో తేడా ఉంటే కూర్చొని పరిష్కరించుకుందామని సూచించారు. ఉద్యోగులు, తాము వేరు అన్న భావన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. పీఆర్సీ కూడా త్వరలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఖఛ్చితమైన ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతీ ఉద్యోగి రోజుకు ఒక గంట అదనంగా పని చేసి పన్నులు కట్టని అక్రమార్కులను కట్టడి చేస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని సూచించారు. పెంచిన ఆదాయాన్ని ఉద్యోగులు, ప్రజల కోసమే ఖర్చు చేస్తామన్నారు. కాంగ్రెస్ రెండోసారి అధికారానికి వస్తే అది కూడా ఉద్యోగులు బాగా పని చేయడం వల్లనే సాధ్యమవుతుందని చెప్పారు. తాను రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి వెళ్తుంటే వెళ్లొద్దని విపక్ష నేతలు రోడ్లు ఎక్కుతున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రిజినల్ రింగ్ రోడ్డు రాష్ట్రానికి ఎంతో అవసరం అన్నారు. గత పదేళ్లలో ఈ పనులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చేద్దామంటే కాళ్లలో కట్టెలు పెడుతూ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఫామ్ హోస్‌లో ఉన్న వాళ్లకు మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణతో పని లేదని. అందుకే వాళ్లు అడ్డుకుంటున్నారని అన్నారు. గతంలో రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం గచ్చీబౌలి ఎయిర్‌పోర్టు మెట్రో ప్రతిపాదించారని, దాన్ని నిలిపేసి, సామాన్యుల కోసం పాతబస్తీ నుంచి ప్లాన్ చేశానని చెప్పారు.