Share News

CM Revanth Reddy Calls for Full Congress Majority: మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:11 AM

గడిచిన రెండేళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన మనం.. రేపటి కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయి మెజారిటీ సాధించాలి. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలి’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు......

CM Revanth Reddy Calls for Full Congress Majority: మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

  • పుర పోరులోనూ పూర్తి మెజారిటీ రావాలి

  • మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజా ప్రతినిధులుగా ఉండాలి

  • ఈ విషయాన్ని చెబితే ప్రజలూ మనల్ని ఆశీర్వదిస్తారు

  • అధికారంలో ఉన్నాం కాబట్టే మనమాట వింటున్నారు

  • లేదంటే ఫుట్‌బాల్‌ ఆట చూసేందుకు పాస్‌ కూడా రాదు

  • కార్యకర్తలను గెలిపించడానికి ఇల్లిల్లూ తిరుగుతా

  • జీరామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గ్రామసభల్లో తీర్మానాలు.. ఈనెల 20 నుంచి 30 దాకా నిర్వహణ

  • ఫిబ్రవరి 3 నుంచి రోజుకో ఉమ్మడి జిల్లాలో సభ

  • ములుగు సభకు సోనియా లేదంటే రాహుల్‌, ఖర్గే, ప్రియాంక.. టీపీసీసీ విస్తృతస్థాయి భేటీలో రేవంత్‌

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘‘గడిచిన రెండేళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన మనం.. రేపటి కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయి మెజారిటీ సాధించాలి. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలి’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే ఎనిమిదేళ్లూ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉంటుందని, రాష్ట్రంలోని ఏ గల్లీలో అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. స్థానిక సంస్థలపై పట్టు ఉంటేనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిధులిచ్చి గల్లీలను అభివృద్ధి చేయగలుగుతారని, ఆ నిధులు మంజూరు కావాలంటే ప్రభుత్వంతో సమన్వయం చేసేవారు.. మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయించుకునేవారు స్థానిక ప్రతినిధులుగా ఉండాలని స్పష్టం చేశారు. ఇలా ప్రభుత్వం, మంత్రులతో సమన్వయం చేసుకుని నిధులు మంజూరు చేయించుకునే వారిని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లుగా ఎన్నుకుంటే వారు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పారు. పట్టణ ప్రాంతాల పేదలు, ప్రజలకు ఈ విషయాలను వివరిస్తే వారూ మంచి మనసుతో ఆశీర్వదిస్తారని నిర్దేశించారు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ మేరకు సూచన చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.


ప్రధానంగా మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ ఆస్తులు, ప్రాణాలను పణంగా పెట్టి, కేసులనూ ఎదుర్కొని 2023లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు వారి కోసం పూర్తిస్థాయి సమయం ఇచ్చి పని చేస్తున్నాం. సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 66 శాతం సీట్లను గెలుచుకుని మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. బీఆర్‌ఎస్‌ 27 శాతం, బీజేపీ 6 శాతం సాధించాయి. ఆ రెండు పార్టీలూ కలిసి 33 శాతం మాత్రమే గెలుచుకున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మెజారిటీ సాధించి అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలి’’ అని పిలుపునిచ్చారు. గడిచిన రెండేళ్లుగా సమస్యల పరిష్కారం, నిధుల కోసం ఒక్క బీఆర్‌ఎస్‌ నాయకుడు కూడా తన వద్దకు రాలేదని, సమస్యలపై చర్చించేందుకు వాళ్లు శాసనసభకూ రావట్లేదని తప్పుబట్టారు. వాళ్లకు రాజకీయాలు, పదవులు కావాలి తప్పితే ప్రాంతాల అభివృద్ధి పట్టదని విమర్శించారు. ఇక్కడ వేదికపై ఉన్న చాలామంది మంత్రులు పార్టీ లైన్లో కష్టపడి పనిచేసి ఈ స్థాయికి వచ్చారని, సీతక్క కష్టపడి మంత్రి స్థాయికి వచ్చారు కాబట్టే.. ఇష్టదైవం సమ్మక్క, సారలమ్మ జాతరకు, వెయ్యేళ్లకు సరిపడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకుని తీసుకెళ్లగలిగారని వివరించారు. కష్టపడిన వారు ఎప్పుడూ నష్టపోరని ఉద్బోధించారు.

జో జీతా.. వోహీ సికందర్‌

ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఎన్ని చెప్పినా ఎవరూ వినబోరని, జో జీతా వోహీ సికందర్‌ అని, ఇవాళ ప్రభుత్వం వచ్చింది కాబట్టే మన మాట వింటున్నారని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ‘‘సర్పంచ్‌ ఎన్నికలకు సీఎం ఎందుకు తిరుగుతున్నాడని కొందరు మాట్లాడుతున్నారు. కార్యకర్తల కష్టంతోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. నేనూ సీఎం అయ్యాను. పార్టీ నన్ను సీఎంను చేసింది కాబట్టే దునియా నన్ను చూస్తోంది. నేను ఫుట్‌బాల్‌ ఆడినా చూసింది. అదే పార్టీ నన్ను సీఎం చేయకుంటే ఫుట్‌బాల్‌ ఆట చూసేందుకు నాకు పాస్‌ కూడా దొరికి ఉండేది కాదు’’ అని వ్యాఖ్యానించారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలను గెలిపించడానికి గల్లీగల్లీ కాదు.. ఇల్లిల్లూ తిరగడానికీ తాను సిద్ధమని ప్రకటించారు. నేతలంతా పార్టీ లైన్‌లోనే వెళ్లాలని, ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్‌ ఇస్తే వారిని గెలిపించడానికి కృషి చేయాలని నిర్దేశించారు. గెలిపించడానికి ప్రయత్నం చేయని వారికి గాంధీభవన్‌లో గుర్తింపు ఉండబోదని హెచ్చరించారు. ఇప్పుడు రాహుల్‌ నాయకత్వం దేశానికి అవసరమని, ఆయనకు అండగా నిలబడదామని, మోదీని ఓడించి రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు సిద్ధం అవుదామని పిలుపునిచ్చారు.


మన్‌రేగాను సమాధి చేసే కుట్ర

మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంతో (మన్‌రేగా) 140 కోట్ల మంది జనాభాలో 80 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని, చట్ట సభల్లో బలం ఉందని పథకం పేరు మార్చడంతోపాటు శాశ్వతంగా సమాధి చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంచే ఆలోచనతో యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, పథకం ప్రారంభం, అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదికగా మారాయని గుర్తు చేశారు. ఈ పథకంతో గ్రామాల్లో వలసలు ఆగాయని, పనికి తగిన వేతనాన్ని డిమాండ్‌ చేసే స్థితికి వ్యవసాయ కూలీలు చేరుకున్నారని చెప్పారు. ‘‘ఈ పథకాన్ని రద్దు చేసే కుట్ర బీజేపీ చేస్తోంది. అప్పుడు గ్రామాల్లో ఉన్న పేదలు పట్టణాలకు వలస వస్తారు. అంబానీ, అదానీలకు తక్కువ వేతనానికే కూలీలు దొరుకుతారు. కార్పొరేట్‌ కంపెనీల్లో తక్కువ వేతనాలకు, వెట్టి చాకిరీకి కూలీలు దొరికేందుకే ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే కుట్ర జరుగుతోంది. ఇది కార్పొరేట్‌ కంపెనీల కుట్ర. దీన్ని అమలు చేస్తున్నది మోదీ ప్రభుత్వం’’ అని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి పేద, కాంగ్రెస్‌ కార్యకర్తపై ఉందన్నారు. ఆనాడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కొట్లాడిన రాహుల్‌గాంధీ విజయం సాధించారని, రైతులకు మోదీతో క్షమాపణలూ చెప్పించారని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీ రామ్‌ జీ బిల్లులో వికసిత్‌ భారత్‌ లేదని, సంక్షోభ భారత్‌ను సృష్టిస్తున్నారని విమర్శించారు. పథకాన్ని పునరుద్ధరించే వరకు కొట్లాడదామని, పేదలకు క్షమాపణ చెప్పే వరకూ మోదీని వదిలే సమస్యే లేదని అన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనేనన్నారు. అసెంబ్లీ తరహాలోనే ఈనెల 20 నుంచి 30 వరకు పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించాలన్నారు. ఉపాధి హామీ పథకం అమలవుతున్న 15 గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కో సెగ్మెంట్‌కు ఒక్కో మంత్రి ఇన్‌చార్జి బాధ్యత తీసుకుని గ్రామసభలు ఆమోదించిన తీర్మానాలను సేకరించాలన్నారు. జిల్లా నుంచి జాతీయస్థాయి వరకు ఉన్న నాయకులు ఒక్కొక్కరు ఒక్కో మండలం బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమం అమలయ్యేలా చూడాలన్నారు. తానూ ఒక మండలం బాధ్యత తీసుకుంటానన్నారు. సేకరించిన తీర్మానాలను లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్‌ సభాపక్ష నేతలు రాహుల్‌, మల్లికార్జున ఖర్గేలకు అందించే బాధ్యతను ఎంపీలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1న కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు నిరసన తెలపాలన్నారు.


సామ్రాజ్యవాదుల కంటే ప్రమాదకరం : భట్టి

సామ్రాజ్యవాదుల కంటే బీజేపీ ప్రమాదకారి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పేదల కోసం కొత్త చట్టాలను తీసుకురాక పోగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన చట్టాలను రద్దు చేస్తోందని, చివరికి, దేశ స్వాతంత్ర్యాన్నీ రద్దు చేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. జీ రామ్‌ జీ చట్టం రద్దు కోసం పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. వ్యవసాయ సీజన్లో 60 రోజులపాటు కొత్త చట్టంలో పనులకు అవకాశం లేదని, దీంతో, పేదలు పట్టణాలకు వలస పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఉపాధి చట్టం రాకముందు రూ.40 ఉన్న రోజు కూలీ.. ఒక్కసారిగా రూ.100కు పెరిగిందని గుర్తు చేశారు. కొత్త చట్టం అమలుతో యజమానులు ఎంత కూలీ ఇస్తే అంత తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్త చట్టంలో ఉన్న లోపాలను వివరించారు. ఉపాధి హామీ చట్టం గొప్పతనాన్ని, కొత్త చట్టంతో నష్టాన్ని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో 5 వేల చొప్పున కరపత్రాలను పంపిణీ చేయాలని నేతలకు పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ సూచించారు.

ఉమ్మడి జిల్లాల వారీగా సభలు

ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌ చెప్పారు. ఫిబ్రవరి 3న మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొదటి సభ నిర్వహిస్తామని, రోజుకో జిల్లాలో లక్ష మందితో ఈ సభలు ఉంటాయని తెలిపారు. వీటి నిర్వహణ బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులు తీసుకుంటారని, సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి పొంగులేటి తీసుకుంటారని చెప్పారు. అన్ని జిల్లాల సభల్లోనూ తాను పాల్గొంటానన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క జిల్లా ములుగులో సభకు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానిస్తామని, ఆరోగ్యం సహకరించక ఆమె రాని పక్షంలో ఖర్గే, రాహుల్‌, ప్రియాంకలను ఆహ్వానిస్తామని వివరించారు.

Updated Date - Jan 09 , 2026 | 07:06 AM