CM Revanth Reddy: పంచాయితీల కంటే పరిష్కారాలకే మొగ్గు..
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:36 AM
తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను. వివాదం కావాలా పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటా....
చర్చలతో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే సమస్యలు పరిష్కరించుకోవడానికి రెడీ
ఏపీ అడుగు ముందుకేస్తే మేం పదడుగులు వేస్తాం.. పరస్పర సహకారంతో ముందుకెళ్దాం.. ఉమ్మడి ఏపీలోని అనుమతులకు నో చెప్పొద్దు
తెలంగాణ పోర్టు కనెక్టివిటీకి ఏపీ సహకరించాలి: రేవంత్‌రెడ్డి.. రావిర్యాలలో సుజెన్ ఫార్మా మెడికేర్ యూనిట్ ప్రారంభం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
‘‘తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను. వివాదం కావాలా?, పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటా. వివాదాల కంటే శాశ్వత పరిష్కారాలకే మొగ్గు చూపుతా’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాల నేపఽఽథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. కృష్ణా నదిపై ఆయా ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అనుమతులకు ఇప్పుడు అడ్డంకులు పెట్టవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ‘‘పాలమూరు - రంగారెడ్డితోపాటు కల్వకుర్తి, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయి. ఇప్పుడు వీటికి అభ్యంతరాలు చెప్పవద్దు. ఈ అడ్డంకులతో పర్యావరణ, సీడబ్ల్యూసీ నుంచి సమస్యలు తలెత్తుతున్నాయి. రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోంది. మాకు సహకరించండి’’ అని కోరారు.
తాము వివాదం కోరుకోవడం లేదని, పరిష్కారమే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలు కాదని.. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలని, చర్చల ద్వారా సమస్యలకు సంపూర్ణ పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై ఆంధ్రప్రదేశ్‌తోపాటు పొరుగు రాష్ట్రాలతో చర్చలకు మేం సిద్ధం. ఈ విషయంలో ఆంరఽధప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేస్తే.. తెలంగాణ పది అడుగులు ముందుకేస్తుంది. నీళ్ల వివాదాల ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన మాకు లేదు. వివాదాలు చేయవద్దు. చర్చలు ఒక్కటే పరిష్కారం. న్యాయస్థానాలు లేదా ఇతరుల వద్ద పంచాయితీల కంటే మనమే కూర్చొని మన సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుందాం. రాజకీయాలకతీతంగా ఈ సమస్య పరిష్కారానికి అందరూ సహకరించాలి’’ అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. నీటి సమస్యలను పరిష్కరించేందుకే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తెలిపారు.
పోర్టు కనెక్టివిటీ అవసరం
రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోకపోతే సమస్యలు పరిష్కారం కావని, పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయని సీఎం రేవంత్ తెలిపారు. ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలతో వివాదాలు కోరుకోవడం లేదని, పరస్పర సహకారమే కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో పోర్టు కనెక్టివిటీ లేని ఏకైక పెద్ద రాష్ట్రం తెలంగాణనేనని, తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ అవసరమని, సముద్ర మార్గంతో అనుసంధానం కావాలంటే ఆంధ్రప్రదేశ్ సహకారం తప్పనిసరని చెప్పారు. అందుకే, మచిలీపట్నం పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 12 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే, దానికి సమాంతరంగా రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సహకారం కోరుతున్నామన్నారు. ‘‘ఈ కనెక్టివిటీ రెండు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. అయితే, పక్క రాష్ట్రం సహకారం, సయోధ్య లేకుండా ఇవన్నీ జరగవు. అందుకే ఇచ్చి పుచ్చుకునే ధోరణి అవసరం. ఈ విషయంలో సంపూర్ణంగా మేం ముందుకు వస్తాం’’ అని సీఎం స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి హైదరాబాద్ సహకారం కూడా అవసరమేనన్నారు. హైదరాబాద్‌లో డేటా సెంటర్లు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, వాటికి విద్యుత్తుతోపాటు నీరు కూడా అవసరమేనని, కృష్ణా జలాలను తరలించాలన్నా.. పొరుగు వారితో పరస్పర సహకారం అవసరమని వివరించారు. భవిష్యత్తు అంతా ప్యూచర్ సిటీదేనని, ఇక్కడ భూముల ధరలు భవిష్యత్తులో అనేక రెట్లు పెరుగుతాయని, అందువల్ల ఈ ప్రాంత ప్రజలెవరూ భూములు అమ్ముకోవద్దన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం రాష్ట్రంలో ఉందని, పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. పెట్టుబడులు పెట్టే వారిని ప్రోత్సహించేందుకే ఈ కంపెనీ ప్రారంభోత్సవానికి తాను వచ్చినట్లు తెలిపారు.
విద్యా రంగానికి సరికొత్త పాలసీ
రాష్ట్రాభివృద్ధికి పారిశ్రామిక, విద్యుత్, పర్యాటక, దేవాదాయ, వైద్య రంగాల్లో ప్రభుత్వం పాలసీలు తీసుకొచ్చిందని, వాటిని సరళీకరించడమే కాకుండా విద్యా రంగంలోనూ సరికొత్త పాలసీని ప్రకటించబోతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీతోపాటు పెట్టుబడుల ఆకర్షణకు పారదర్శక ప్రణాళికలు రూపొందించామన్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి ప్రముఖుడు ఈ ప్రాంతానికి ఎంపీగా ఉండడం అదృష్టమని, పార్టీలకతీతంగా ఆయనతోపాటు అనేక మంది ప్రభుత్వ పాలసీలకు, ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నారని కొనియాడారు.
ప్రైవేటులోనే జీతాలెక్కువ
‘‘ప్రైవేటు రంగంలోనే జీతాలు అధికంగా ఉంటున్నాయి. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేటులో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇప్పటి వరకు మేం 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ఇంకా 30 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు. అందుకే, యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందుకు ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలి’’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, టీజీఐఐసీ ఎండీ శశాంక, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.