స్టూడెంట్ రేవంత్!
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:17 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చి ఉంటాయి కావొచ్చు! కారణం.. ఆయన మళ్లీ కాలేజీ విద్యార్థిగా మారారు....
పుస్తకాలు చేతబట్టి హార్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు..
‘21వ శతాబ్దంలో నాయకత్వం’ అంశంపై కోర్సు
30వ తేదీ దాకా క్లాసులు.. తొలి రోజు హాజరైన సీఎం
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా తరగతులు
హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోనున్న తొలి సీఎంగా రికార్డు.. 2న రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చి ఉంటాయి కావొచ్చు! కారణం.. ఆయన మళ్లీ కాలేజీ విద్యార్థిగా మారారు. అదీ అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్టూడెంట్‌గా! చక్కగా మెడలో ఐడీ కార్డు వేసుకొని.. పుస్తకాలు చేతబట్టి సోమవారం పొద్దుపొద్దున్నే భారీగా కురుస్తున్న మంచు మధ్య వణికించే చలిలో హార్వర్డ్ పరిధిలోని మసాచుసెట్స్‌లోని కెనడీ స్కూల్‌కు వెళ్లారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పట్లో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా మూడేళ్లపాటు హైదరాబాద్ జేఎన్‌టీయూలో తరగతులకు హాజరైన రేవంత్, ఇప్పుడు సీఎం హోదాలో రోజుల వ్యవధిలోనే హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేయనున్నారు. ఆ కొన్ని రోజుల్లోనే క్లాసులు విని.. హోంవర్కులు రాసి, అసైన్‌మెంట్‌లు పూర్తిచేసి.. వాటిని క్లాసులో సమర్పించి ప్రఖ్యాత వర్సిటీ నుంచి సర్టిఫికెట్ అందుకోనున్నారు. వర్సిటీ నిర్వహించే ‘‘లీడర్‌షిప్ 21- సెంచరీ’’ అనే కోర్సుకు సంబంధించి కెనడీ స్కూల్ ప్రాంగణంలో క్లాసులు సోమవారం మొదలయ్యాయి. ఈ క్లాసులు 30వ తేదీ వరకు జరుగుతాయి. ఈ కోర్సు కోసం ఐదు ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరందరితో కలిసి సోమవారం మొదలైన క్లాసులకు రేవంత్ హాజరయ్యారు. సీఎం పదవిలో కొనసాగుతూ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఒక కోర్సు సర్టిఫికెట్ అందుకున్న సీఎంగా రేవంత్ రికార్డు సృష్టించనున్నారు. తొలిరోజు పరిచయ కార్యక్రమాల అనంతరం కోర్సులో భాగంగా ‘‘అఽధికార విశ్లేషణ.. నాయకత్వం’’ అంశంపై తొలిసెషన్ ప్రారంభమైంది. ఉదయం ఏడింటికే మొదలైన తరగతులు సాయంత్రం ఆరింటిదాకా కొనసాగాయి. కేస్ అనాలసిస్ సహా వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్‌వర్క్ వంటి కార్యక్రమాల్లో ప్రతినిధులు పాల్గొన్నారు. కోర్సులో భాగంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాలనుంచి కేస్ స్టడీలను విశ్లేషించి, పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు. ఆ తర్వాతే కోర్సు ముగుస్తుంది. ఆపై.. యూనివర్శిటీ నుంచి సీఎం రేవంత్ సర్టిఫికెట్ పొందనున్నారు. అనంతరం ఆయన అమెరికా నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఫిబ్రవరి 2న ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. కాగా క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలి? అనిశ్చిత పరిస్థితులను, అనుకోని మార్పులను ఎలా ఎదుర్కోవాలి? సంబంధించిన అంశాలు కోర్సులో ఉంటాయి. ఇది రాజకీయ నాయకులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, కార్పొరేట్ కంపెనీల సీఈవోలు, డైరెక్టర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు ఉపయుక్తంగా ఉంటుంది.
హార్వర్డ్ విశేషాలు..
హార్వర్డ్ యూనివర్శిటీ పరిధిలోని ప్రైవేటు ఐవీ లీగ్ పరిశోధన విశ్వవిద్యాలయం మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జిలో ఉంది. దీనిని 1607లో స్థాపించారు. అంటే దాదాపు 418 ఏళ్ల చరిత్ర కలిగిన యూనివర్శిటీ ఇది. గత వందేళ్లలో దాదాపు 75 సార్లు ప్రపంచంలో నంబర్‌వన్ విశ్వవిద్యాలయంగా నిలిచింది. దీని పరిధిలో 14 కళాశాలలున్నాయి. బిజినెస్ (హెచ్‌బీఎ్‌స), లా (హచ్‌ఎల్‌ఎ్‌స), మెడికల్, గవర్నమెంట్, థియాలజీ శాస్త్రాలకు విడి విడిగా కళాశాలలు ఉన్నాయి. కాగా కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను 1936లో స్థాపించగా, 1966లో అధ్యక్షుడు కెనడీ పేరును పెట్టారు. స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో దాదాపు 100కు పైగా దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. కాగా ప్రస్తుతం బోస్టన్‌లో భారీ మంచు తుపాను (ఫెర్న్) కారణంగా రెండు అడుగులకు పైగా మంచు కురిసినట్లు సమాచారం. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీలకు పడిపోయాయి.