రూ.4 వేల లంచం కేసు.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు 9 నెలల నిరీక్షణ
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:11 AM
లంచం మొత్తం కేవలం రూ.4 వేలు. కానీ, ఆ ఆరోపణలపై కేసు నమోదు చేసేందుకు సీబీఐకి ఏకంగా 9 నెలల సమయం పట్టింది! తెలంగాణలో సీబీఐకి ‘జనరల్ కన్సెంట్’ (సాధారణ అనుమతి)లేకపోవడం వల్ల కేసుల నమోదు ప్రక్రియ ఎంత ఆలస్యమవుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): లంచం మొత్తం కేవలం రూ.4 వేలు. కానీ, ఆ ఆరోపణలపై కేసు నమోదు చేసేందుకు సీబీఐకి ఏకంగా 9 నెలల సమయం పట్టింది! తెలంగాణలో సీబీఐకి ‘జనరల్ కన్సెంట్’ (సాధారణ అనుమతి)లేకపోవడం వల్ల కేసుల నమోదు ప్రక్రియ ఎంత ఆలస్యమవుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు గతేడాది హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆయన పేరిట రెండు పాన్ కార్డులు ఉండటంతో బ్యాంకు లోన్‌ను రిజెక్ట్ చేసింది. దీంతో ఆ కార్డుల్లో ఒకదాన్ని రద్దు చేసేందుకు సదరు ఉపాధ్యాయుడు మాదాపూర్ ఆదాయపు పన్నుశాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి అధికారి రంజిత్ కుమార్ ఆ దరఖాస్తును కావాలనే పెండింగ్‌లో పెట్టారు. ఆ తర్వాత ఫోన్ చేసి, ఆన్‌లైన్‌లో రూ.4,000 పంపిస్తేనే పని జరుగుతుందని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉపాధ్యాయుడు ఆ మొత్తాన్ని యూపీఐ ద్వారా పంపినప్పటికీ, అవినీతిపై పోరాడాలనే ఉద్దేశంతో గతేడాది అక్టోబర్ 31న సీబీఐకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
కేసు నమోదుకు ఆపసోపాలు..
బాధితుడు పంపిన ఆన్‌లైన డబ్బులు ‘కబితా సిన్హా’ అనే మహిళ ఖాతాలోకి వెళ్లినట్లు తేలింది. ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ అధికారులు, ఆమె ఐటీ అధికారి రంజిత్ కుమార్ భార్యేనని నిర్ధారించుకున్నారు. పలువురి నుంచి కూడా ఆమె ఖాతాలోకి ఆన్‌లైన్ పేమెంట్లు వచ్చినట్లు గుర్తించారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన రంజిత్, ఆయన భార్యపై కేసు నమోదు చేయడానికి అనుమతి కోరుతూ గత నవంబర్‌లో సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వివిధ స్థాయిలు దాటుకుని ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 3న జీవో 55 ద్వారా అనుమతి ఇచ్చింది. ఆపై కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) నుంచి జూలై 29న గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరుసటిరోజే సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగలిగారు. ఫిర్యాదు వచ్చిన నాటి నుంచి ఎఫ్‌ఐఆర్ నమోదుకే 9 నెలలు పట్టడం గమనార్హం. 2022 ఆగస్టులో సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో, రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి సీబీఐ ఆపసోపాలు పడాల్సి వస్తోంది. లంచం డిమాండ్ చేసిన వెంటనే దాడులు జరిపి ఉచ్చు బిగిస్తేనే సాక్ష్యాలు బలంగా ఉంటాయని, ఇలా అనుమతుల పేరిట నెలల తరబడి సమయం వృథా అయితే అవినీతిపై పోరాటమే బలహీనపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఆ బాలికపై ఏ కేసు నమోదు చేయట్లేదు: ఢిల్లీ పోలీసులు