Share News

మధ్యంతర బెయిల్‌కు నో

ABN , Publish Date - May 16 , 2026 | 05:21 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు హైకోర్టులో ఎలాంటి తక్షణ ఊరట లభించలేదు. మైనర్‌ బాలికను లైంగికంగా వేధించినట్లు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసులో అరెస్ట్‌ .....

మధ్యంతర బెయిల్‌కు నో

  • బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురు

  • ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం

  • పిటిషన్‌పై అర్ధరాత్రి దాకా వాదోపవాదాలు

  • 12 గంటలకు తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం

  • అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని భగీరథ్‌ న్యాయవాది విజ్ఞప్తి.. తోసిపుచ్చిన కోర్టు

  • బాధితురాలు మైనరే.. దర్యాప్తులో తెల్సింది

  • ప్రస్తుతం ఆమె వయసు 17 ఏళ్ల 3 నెలలే..

  • పుట్టిన తేదీ, పదో తరగతి సర్టిఫికెట్లను సమర్పించిన పీపీ పల్లె నాగేశ్వర్‌రావు

  • సోషల్‌ మీడియాలో నాపై ఆరోపణలా ?

  • జస్టిస్‌ టి.మాధవీదేవి అభ్యంతరం

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు హైకోర్టులో ఎలాంటి తక్షణ ఊరట లభించలేదు. మైనర్‌ బాలికను లైంగికంగా వేధించినట్లు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసులో అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించడానికి హైకోర్టు నిరాకరించింది. బండి భగీరథ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేస్తున్నామని, ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ఈ నెల 21న (గురువారం) ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వెలువరిస్తామని తెలిపింది. కనీసం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో తీర్పు ఇచ్చేవరకు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని, పోలీసులకు అన్నివిధాలా సహకరించేందుకు సిద్ధమని భగీరథ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ దశలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బండి భగీరథ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ టి.మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టి తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు పిటిషనర్‌ భగీరథ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది, వైసీపీ ఎంపీ ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు కొనసాగించారు. ‘వాస్తవానికి బాలిక తల్లిదండ్రులు అన్నిరకాలుగా న్యాయసలహా తీసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో న్యాయనిపుణల సలహా మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో పెనెట్రేటివ్‌ సెక్సువల్‌ అసాల్ట్‌కు సంబంధించిన ఘటనలు, ఆ సెక్షన్‌ పెట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏవీ లేవు. ఆ తర్వాత దురుద్దేశంతో పోలీసులు పోక్సోలోని పెనెట్రేటివ్‌ సెక్సువల్‌ అసాల్ట్‌ సెక్షన్‌ను కొత్తగా చేర్చారు. వారిద్దరూ కలిసి తిరిగారు. వారు కలిసి ఉంటున్నట్లు.. రిలేషన్‌లో ఉంటున్నట్లు తల్లిదండ్రులకు తెలుసు. గతేడాది జరిగిన ఘటనలకు చాలా ఆలస్యంగా ఇప్పుడు ఫిర్యాదు చేశారు. పిటిషనర్‌ తండ్రి బండి సంజయ్‌ కేంద్ర మంత్రి కాబట్టి కేసును నీరుగాస్తున్నారంటున్నారు. అసలు రాష్ట్రంలో అధికారంలో ప్రత్యర్థి పార్టీ ఉంది. శాంతిభద్రతలు, పోలీసు రాష్ర్టానికి సంబంధించిన అంశాలు. బాలిక తండ్రి చాలా ప్రభావవంతమైన వ్యక్తి. ఆయనతో పోలీసులు కుమ్మక్కై ఉండొచ్చు. రాష్ట్రంలో అధికారంలో లేని బండి సంజయ్‌ ఎలా ప్రభావం చూపగలరు? మొదట బెయిల్‌ వచ్చే చిన్న సెక్షన్లు ఉన్న ఎఫ్‌ఐఆర్‌లో కావాలనే పెద్ద సెక్షన్లు చేర్చారు. ఈ పరిస్థితుల్లో పిటిషనర్‌ ముందస్తు బెయిల్‌కు అర్హుడు. అరెస్ట్‌ చేస్తే పిటిషనర్‌కు తిరిగి పూడ్చుకోలేని విధంగా నష్టం జరుగుతుంది’ అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తరఫున స్టేట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు వాదించారు. ‘ బాధితురాలు మైనర్‌ కాదు.. మేజర్‌ అన్న వాదనలో వాస్తవం లేదు. ఆమె పుట్టిన తేదీ ధ్రువీకరణ, పదో తరగతి మార్కుల మెమోను సీల్డ్‌ కవర్‌లో కోర్టు వారికి అందజేశాం. బాధితురాలు 2008లో పుట్టింది. ఈరోజు నాటికి ఆమె వయస్సు 17 సంవత్సరాల 3 నెలలు. దర్యాప్తు అధికారులు సమగ్ర వివరాలు సేకరించారు. బాధితురాలు స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాతే నేరంలో అసలు తీవ్ర ఎంత ఉందో తెలిసింది. అందుకే పెనెట్రేటివ్‌ సెక్సువల్‌ అసాల్ట్‌ సెక్షన్‌ చేర్చాం. ఎఫ్‌ఐఆర్‌ అనేది కేవలం ప్రాథమిక పత్రం మాత్రమే. అది ఎన్‌సైక్లోపీడియా కాదు.. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి.


ఇంత తీవ్రమైన కేసులో ముందస్తు బెయిల్‌, అరెస్ట్‌ నుంచి రక్షణ ఇవ్వరాదు’ అని పల్లె నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. బాధితురాలి తరఫున సీనియర్‌ న్యాయవాది పప్పు నాగేశ్వర్‌రావు వాదిస్తూ, ‘‘బండి భగీరథ్‌ మరో నలుగురు అమ్మాయిలను వేధించాడు. త్వరలో వాళ్లు కూడా బయటకు వస్తారు.. కేసును తప్పుదోవ పట్టించేందుకు బండి సంజయ్‌ తన అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారు. సంగప్ప అనే వ్యక్తి ద్వారా మధ్యవర్తిత్వం చేశారు. జనవరి 1న ఫాంహౌజ్‌లో బాధితురాలు నిద్రలేచేసరికి ఒంటిపై దుస్తులు లేవు. ఆమెకు పిటిషనర్‌ మద్యం తాగించాడు. పోక్సో కేసులో ఆలస్యం జరిగిందనే విషయానికి ప్రాధాన్యం లేదు. కరీంనగర్‌లో కౌంటర్‌ కేసు పెట్టే వరకు ఇక్కడి పోలీసులు వేచిచూశారు. ముఖ్యమంత్రి కేసును పర్యవేక్షించిన తర్వాతే పోలీసులు కదిలారు. భగీరథ్‌ మైనర్‌ను శారీరకంగా యూజ్‌ చేసుకున్నాడు. అతడిపై గతంలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. అతడేం మొదటిసారి నేరస్తుడు కాదు’’ అని పేర్కొన్నారు. అన్ని వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది. కాగా, సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయడంపై జస్టిస్‌ టి.మాధవీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తకు పదవులు ఆఫర్‌ చేశారంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని, ఇలాంటి వాటికి తాను భయపడనని అన్నారు.

Updated Date - May 16 , 2026 | 05:39 AM