హోటల్‌లో రాహుల్ బొమ్మకు బిర్యానీ!
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:05 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట ఇచ్చి తప్పారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ మీడియా సెల్ కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద నిర్వహించిన నిరసన తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది
నిరుద్యోగులకిచ్చిన హామీ అమలు చేయలేదంటూ బీఆర్‌ఎస్ నిరసన
ఆర్టీసీ క్రాస్‌రోడ్డు బావర్చీ వద్ద కిశాంక్ ఆధ్వర్యంలో నిర్వహణ
అక్కడికి కాంగ్రెస్ ఎంపీ అనిల్ రావడంతో ఇరు వర్గాల వాగ్వాదం
ఫర్నిచర్ ధ్వంసం.. పార్టీల శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు
పోలీస్ స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదు
చిక్కడపల్లి, హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట ఇచ్చి తప్పారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ మీడియా సెల్ కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద నిర్వహించిన నిరసన తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. 2023 నవంబరు 25న రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి హామీ ఇచ్చారని.. వారితో కలిసి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద బావర్చీలో డిన్నర్ చేశారని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని రాహుల్ విస్మరించారని నిరసిస్తూ క్రిశాంక్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నేతలు గురువారం రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బావర్చీ హోటల్‌కు వచ్చారు. అక్కడ డిన్నర్ ఏర్పాటు చేసి రాహుల్ బొమ్మకు బిర్యానీ పెట్టారు. ఇది తెలిసి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు ఆ హోటల్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది తోపులాటకు దారితీసింది. ఒకానొకదశలో ఇరు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో హోటల్‌లోని ఫర్నిచర్ ధ్వంసమైంది. చిక్కడపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలను చెదరగొట్టారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేతలు మధుసూదన్, విక్కీ, వెంకట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని బీఆర్‌ఎస్ నేతలపై ఫిర్యాదు చేశారు. లోక్‌సభ విపక్షనేత రాహుల్‌ను బీఆర్‌ఎస్ నేతలు అవమానించడం సరికాదని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిదన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచిందని ఆరోపిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70వేల ఉద్యోగాలిచ్చిందని తెలిపారు. కాగా హోటల్‌లో తాము శాంతియుతంగా నిరసన చేస్తుండగా కాంగ్రెస్ నేతలు వచ్చి దాడి చేశారంటూ బీఆర్‌ఎస్ యువనేత ముఠా జైసింహా ఆధ్వర్యంలో నే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం: కేటీఆర్
ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు బీఆర్‌ఎస్ యువ నాయకులపై దాడులకు పాల్పడ్డారని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, అహంకారానికి నిదర్శనం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిశాంక్‌తో పాటు ముఠా జైసింహా, జగన్ పాటిమీది, దినేశ్ చౌదరి, విష్ణువర్దన్ రెడ్డి, హరీశ్ రెడ్డిలపై దాడి జరిగిందని, ఇది దారుణమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్వయంగా రాజ్యసభ సభ్యుడే దాడికి నాయకత్వం వహించి, తన అనుచరులతో దాడులు చేయించారని, ఇది దుర్మార్గమని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్