CM Revanth Reddy: బీఆర్‌ఎస్ నాయకుల కళ్లలో..కడుపులో విషం
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:57 AM
మూసీలో కాలుష్యం కంటే బీఆర్‌ఎస్ నేతల కడుపులోనే ఎక్కువ విషం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మూసీ కాలుష్యమే ప్రమాదకరం అనుకుంటున్నామని, కానీ..
మూసీ పునరుజ్జీవంపై చర్చ జరగొద్దని, నిజాలు ప్రజలకు తెలియొద్దన్నది వారి ఉద్దేశం. వారి కడుపు నిండా విషం.. వాళ్ల కళ్లలోకి చూడండి. ఆ విషపు కళ్లతో మొత్తం కాలి బూడిదయ్యేటట్లు చూస్తున్నారు. అయినా ఆ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి.
- సీఎం రేవంత్‌రెడ్డి
మూసీ కాలుష్యం కంటే అదే ప్రమాదకరం
ఫార్మా కంపెనీల వ్యర్థాలతో మూసీ కాలుష్యం.. మహిళలు గర్భం దాల్చలేని దుస్థితి ఏర్పడింది
మూసీ ప్రక్షాళన చేయాలో, వద్దో చెప్పాలి.. డీపీఆర్ సిద్ధమయ్యాక శాసనసభలో పెడతాం
మూసీని నైట్ ఎకానమీగా మారుస్తాం.. బాపూఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం
నార్సింగ్‌లో శివాలయం, మసీదు, సిక్‌చావ్‌నీలో గురుద్వారా, ఉప్పల్‌లో మెదక్ లాంటి చర్చి కడ్తం
గండిపేటకు 20 టీఎంసీల గోదావరి జలాలు తరలిస్తాం.. 365 రోజులూ మూసీలో మంచినీళ్లు
లక్షలు, కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు
రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ బద్నాం.. మూసీ పునరుజ్జీవంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మూసీలో కాలుష్యం కంటే బీఆర్‌ఎస్ నేతల కడుపులోనే ఎక్కువ విషం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మూసీ కాలుష్యమే ప్రమాదకరం అనుకుంటున్నామని, కానీ.. వారి కడుపులో ఉన్న విషం మూసీ కన్నా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. విషం కక్కుతున్నారని ఆక్షేపించారు. గొప్ప ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని, ఇది నాలుగు నదుల అనుసంధానం అవుతుందని తెలిపారు. ఇందుకు ప్రపంచ స్థాయి కన్సల్టెన్సీల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని, సింగపూర్‌కు చెందిన మూడు కంపెనీలకు బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకనామీగా మారుస్తామన్నారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ అని, ఇండస్ట్రీకి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. బాధ్యత నెరవేరుస్తున్న తనను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘మూసీ పునరుజ్జీవంపై చర్చ జరగొద్దని, నిజాలు ప్రజలకు తెలియొద్దన్నది వారి ఉద్దేశం. కడుపు నిండా విషం.. వాళ్ల కళ్లలో చూడండి. కళ్లకు గనుక శక్తి ఉంటే, ఆ విషపు కళ్లతో చూస్తే.. మొత్తం కాలి బూడిదయ్యేటట్లు చూస్తున్నారు. ఆ విషాన్ని కప్పిపుచ్చడానికి అద్దాలు పెట్టుకున్నారు. అయినా ఆ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి’’ అని బీఆర్‌ఎస్ సభ్యులనుద్దేశించి సీఎం రేవంత్ అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ‘‘మూసీ ప్రక్షాళన చేయాలా? వద్దా? ఒక్క మాటలో చెప్పండి. ఆపై తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు.
నిర్వాసితులందరినీ ఆదుకుంటాం..
నగరమంతా రాత్రి 9గంటలకు నిద్రపోతే.. ఆ సమయం నుంచి ఉదయం 6 గంటల దాకా మూసీ పరివాహకంలో నైట్ ఎకానమీని రివైవల్ చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఈ ప్రాజెక్టులో భూములు/ఇళ్లు కోల్పోయే ప్రతి వారికీ నష్టపరిహారం చెల్లిస్తామని, బ్రహ్మాండమైన కాలనీలు కట్టిస్తామని చెప్పారు. దిక్కులేనోళ్లే మూసీ పక్కన ఇళ్లు కట్టుకుంటారని, మూసీలో ఉన్న దోమలు, అక్కడి వాతావరణం, శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారా? ఏ పేదలైనా ఉండాలనుకుంటారా? అని అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో మంచి ఇళ్లు కట్టించి.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తాము చెబుతుంటే.. అలా వద్దని, పేదలు అక్కడే ఉండాలని చెబుతున్నారని తప్పుబట్టారు. ఇప్పుడు అడ్డంగా పడుకుంటామని అంటున్నవారు వర్షాలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్లి ఎందుకు పడుకోలేదని ప్రశ్నించారు. ‘‘రానున్న ఐదేళ్లలో హైదరాబాద్ నగరంలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటుంటే.. రూ.1.5 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చేశారని, రేవంత్‌రెడ్డి రూ.25 వేల కోట్లు కమీషన్ తీసుకున్నాడని అంటున్నారు. ఎంతసేపూ వాళ్లలాగే మేం ఉంటామని అనుకుంటున్నారు. కాంట్రాక్టులు ఇచ్చుడు, కమీషన్లు కొట్టుడు, లిఫ్టులు పెట్టుడు, ఇళ్లలో కనకవర్షం కురిపించుకునుడు.. జన్వాడ, మొయినాబాద్‌లో ఫామ్‌హౌ్‌సలు కట్టుకొనుడు.. ఇంతకుమించి మీరు చేసిందేముంది? మా గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది?’’ అంటూ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
డీపీఆర్ వచ్చేదాకా అంచనా వ్యయం చెప్పలేం..
డీపీఆర్‌ను కన్సల్టెంట్ ఇచ్చేదాకా అంచనా వ్యయం చెప్పలేమని సీఎం రేవంత్ అన్నారు. ఎందుక ంటే తాము 80 వేల పుస్తకాలు చదవలేదని, అంత నాలెడ్జ్ తమకు లేదని. అలా దొంగతనాలు చేయలేమని వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా మంచిరేవుల వద్ద ఉన్న 850 ఏళ్ల కిందటి కాకతీయుల నాటి శివాలయాన్ని మళ్లీ నిర్మిస్తామని చెప్పారు. ఆ పక్కనే మక్కా మసీదు ఉన్నచోట అంతర్జాతీయ స్థాయిలో మసీదు కడతామని, సిక్ చావనీ వద్ద గురుద్వారా, ఉప్పల్‌లో మెదక్ లాంటి చర్చి కడతామని అన్నారు. అంతర్జాతీయ స్థాయి వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేస్తామని వీటిన్నింటికీ ప్రణాళికలు చేస్తున్నామని ప్రకటించారు. ఇంకో ఏడాదిపాటు కష్టపడితే మరింత కొలిక్కి వస్తుందని, ఆ తర్వాత మొత్తం డీపీఆర్ సిద్ధమవుతుందని వెల్లడించారు. డీపీఆర్ చేతికి వచ్చాక శాసనసభలో పెడతామని, అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. ‘‘మూసా, ఈసీ, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరగాల్సిన సమయం వచ్చింది. గాంధీ సరోవర్ కోసం 200 ఎకరాల భూమిని కేంద్రాన్ని అడిగాం. 55 ఎకరాలు తక్షణమే ఇస్తామని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. మరో 50 ఎకరాలు ఇచ్చేందుకు రక్షణ శాఖ అధికారుల కమిటీని పంపించారు. ఆ కమిటీ పరిశీలన తర్వాత భూముల కేటాయింపు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య పెట్టుకుంటున్నది మీలాగా కేసుల నుంచి తప్పించుకోవడానికి కాదు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిరావాలి’’ అని సీఎం అన్నారు.
ఎమ్మెల్యేలందరికీ పీపీటీ ఇస్తాం..
మూసీ పునరుజ్జీవ పథకం విషయంలో ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో ఉందని, ఇందులో ఎలాంటి రహస్యం లేదని రేవంత్ తెలిపారు. ‘‘మీ సూచనలు, సలహాలు ఇవ్వడి. డీపీఆర్ సిద్ధమయ్యాక సీఎం కార్యాలయంలో ఎమ్మెల్యేలందరినీ పిలిచి.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. మన నగరాన్ని మన మే అభివృద్ధి చేద్దాం. సంస్కృతిని, నదులను కాపాడుకోవడం, పెట్టుబడులను ఆకర్షించడం ప్రభుత్వ కార్యక్రమంగా ఉంది. కావాలంటే సూచనలు ఇవ్వడానికి కడుపులో విషాన్ని కొంత తగ్గించుకోండి. మందు లేకపోతే... వీళ్లందరినీ వికారాబాద్ తీసుకెళ్లి... బాగు చేయిద్దాం’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ జరుగుతుందని, 55 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో 75 శాతానికి పట్టణ జనాభా పెరగనుందన్నారు. రాష్ట్ర జనాభా 3.78 కోట్లుగా ఉంటే.. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.34 కోట్ల జనాభా నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచమంతా నగరాల విస్తరణ జరుగుతోందని, రానున్న రోజుల్లో ఔటర్ లోపల రాష్ట్రంలోని మూడో వంతు జనాభా నివాసం ఉంటుందని అన్నారు.
ఫామ్‌హౌ్‌సల డ్రైనేజీలు కూడా గండిపేటలోకే!
వారసత్వంగా వచ్చిన జల వనరులను కాపాడుకోకుండా నాలాల కబ్జాలకు పాల్పడ్డారని సీఎం ఆరోపించారు. వాటిపై ఫామ్‌హౌ్‌సలు కట్టి వాటి నుంచి వచ్చే మురికి నీటినీ ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లలోకి వదులుతున్నారని తెలిపారు. లక్షలాది మంది తాగే మంచినీటిని కలుషితం చేస్తే క్షమించేది లేదని హెచ్చరించారు. ‘‘జన్వాడలో, మొయినాబాద్‌లో ఫామ్‌హౌ్‌సలు కట్టుకున్న ఆగర్భ శ్రీమంతులు నాపై సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సోషల్ మీడియా ద్వారా బద్‌నాం చేశారు. మంచి సంకల్పంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్ని విమర్శలు వచ్చినా ఆక్రమణల్ని తొలగిస్తూ ముందుకు సాగుతుంది’’ అని రేవంత్ అన్నారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మాణంతో సుమారు 60 వేల కుటుంబాలను తరలించారని గుర్తు చేశారు. యూపీలో గంగానది ప్రక్షాళన చేశారని, ఢిల్లీ ఎన్నికల్లో యమునా నది ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అందరికంటే ముందుగా నిజాం నవాబు కూడా మూసీ రివర్ ఫ్రంట్‌ను వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేశారని, ప్రపంచ దేశాలతో పోటీపడేలా హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. కానీ, నిజాం చేసిన అభివృద్ధిని గత పాలకులు కాలగర్భంలో కలిపేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని మురికి కాలువలు, శవాలు, జంతువుల కళేబరాలు, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే విష కాలుష్యాన్ని మూసీలో కలపడంతో రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలు శిక్ష అనుభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అందుకే మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
వికారాబాద్ నుంచి మూసీ దాకా సర్వే చేయించాలి: అక్బరుద్దీన్
మూసీ కాలుష్యంలో భాగ ంగా వికారాబాద్ నుంచి మూసీ దాకా సర్వే చేయించాలని మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. ప్రపంచంలో 21వ అత్యంత కలుషిత నదిగా మూసీ ఉందన్నారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు కట్టిన ప్పుడు వాటి సామర్థ్యం ఎంత, ప్రస్తుతం ఎంత మేర తగ్గిందనేది అధ్యయనం చేయించాలని, ఆయా జలాశయాల సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మూసీ ఒక నది లాగా కాకుండా కాలుష్యకాసారంలా మారిందన్నారు. ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, సిటీ కాలేజీ భవనాలను కూడా మరమ్మతులు చేయాలని సూచించారు.
20 టీఎంసీల గోదావరి జలాలు తరలిస్తాం
గండిపేట పైభాగంలో వికారాబాద్ వరకు మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సీఎం చెప్పారు. వీటికి 20 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తామని, 15 టీఎంసీలతో హైదరాబాద్ నగర దాహార్తిని తీరుస్తామని తెలిపారు. 5 టీఎంసీల నీటిని గండిపేటలో వదిలి శాశ్వతంగా సమస్యను పరిష్కరించబోతున్నామని వెల్లడించారు. రూ.7 వేల కోట్ల వ్యయంతో గోదావరి జలాలను మూసీ-ఈసీ నదులకు తరలిస్తామని, మూడు నదుల సంగమంలా అభివృద్ధి చేస్తామని అన్నారు. రానున్న రెండేళ్లలోపే గోదావరి జలాలు గండిపేటకు వస్తాయన్నారు. మార్చి 31 నాటికి గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు టెండర్లు ఖరారు చేసి మొదటి దశ మూసీ ఫ్రంట్ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. మొదటి దశకు ఏడీబీ బ్యాంకు రూ.4,100 కోట్ల రుణం ఇవ్వటానికి ముందుకొచ్చిందని, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. దీంతో ఔటర్ రింగు రోడ్డుకు వెళ్లే దూరం తగ్గుతుందన్నారు. నార్సింగి, బాపూఘాట్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, చాదర్‌ఘాట్, నాగోల్.. ఇలా అవసరమున్న చోట్ల జంక్షన్లు, ఎక్కేందుకు, దిగేందుకు ప్రతి సర్కిల్‌లో ట్రంపెట్స్ ఏర్పాటుచేసి కారిడార్ నిర్మిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మీరాలం చెరువును కూడా రూ.450 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ..
మూసీ పునరుజ్జీవ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతుంటే.. రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మారాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ అని, ఇండస్ట్రీకి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. నగరంలో రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయని, తద్వారా పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే రియల్ ఎస్టేట్ విస్తరించాలన్నారు. గతంలో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, పి.జనార్దన్‌రెడ్డి.. నాటి ప్రధాని పీవీ నర్సింహారావును హైదరాబాద్‌కు పిలిపించి హైటెక్ సిటీకి పునాదిరాయి వేయించారని పేర్కొన్నారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు, వాజపేయి హయాంలో హైటెక్ సిటీని పూర్తిచేశారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.