బ్లాక్‌మెయిలింగ్ రాజకీయ సమితి
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:40 AM
బీఆర్‌ఎస్ చేసేవన్నీ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీని ఇక నుంచి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయ సమితి అని పిలుస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు...
బీఆర్‌ఎస్‌ను ఇకనుంచి ఇలాగే పిలుస్తాం.. ఫోన్లు ట్యాప్ చేసి.. వ్యాపారులను బెదిరించారు
ఆ పార్టీ ఖాతాలోకి 1500 కోట్లు ఎలా?.. జిల్లాల రద్దు.. కొత్త జిల్లాలు ఏర్పాటు ఉండవు
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును అరెస్ట్ చేసేవరకు కిషన్‌రెడ్డి.. కల్వకుంట్ల కిషన్‌రావే
సోనియా, రాహుల్‌ను వేధిస్తున్న మోదీ, ఈడీ.. ఆ ముగ్గుర్ని ఎందుకు విచారించడం లేదు?
కేసీఆర్, మోదీని చూసి ఓటేసి మోసపోవద్దు.. సింగరేణి బోర్డుపై బీఆర్‌ఎ్‌సది దుష్పచారం
కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయం.. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు
కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలు.. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
సీఎంతో మంత్రులు భట్టి, పొంగులేటి భేటీ.. మునిసిపల్ ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ
వరంగల్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్ చేసేవన్నీ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీని ఇక నుంచి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయ సమితి అని పిలుస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారుల నుంచి మొదలుకొని అందరి ఫోన్లనూ ట్యాప్ చేశారని, అందులోని సమాచారం ఆధారంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ట్యాపింగ్ రికార్డుల్లో వ్యాపారుల మాటలు విని.. వారిని బెదిరించి భూములను రాయించుకున్నారని, తక్కువ ధరకు కొట్టేశారని తెలిపారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్వయంగా ఈ విషయం చెప్పారన్నారు. బీఆర్‌ఎస్ అకౌంట్‌లోని రూ.1500 కోట్లు ఎవడబ్బ సొమ్ము అని ప్రశ్నించారు. కేసీఆర్ పాపాలు ఊరికే పోవని, పాపాల ఊబిలో బీఆర్‌ఎస్ కూరుకుపోతుందని ధ్వజమెత్తారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ’ప్రజాపాలన- ప్రగతి బాట‘ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్‌ఎస్, బీజేపీ వేరు కాదని, ఒకే నాణానికి బొమ్మ, బొరుసు లాంటివని అన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలను రద్దు చేస్తామంటూ కొందరు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అపోహలు సృష్టిస్లూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ జిల్లానూ రద్దు చేయబోమని, కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఉండదని స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాతో సహా ఏ ఒక్క జిల్లా ఎక్కడికీ పోదన్నారు. ఎప్పుడైనా జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోవాలనుకుంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి, శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తరువాతే ఆలోచన చేస్తామని ప్రకటించారు.
నేను అందరివాడిని..
తనను ఏ సామాజికవర్గం వారు ఆ సామాజికవర్గం బిడ్డగా చూసుకోవడం సంతోషంగా ఉందని, తాను అందరివాడినని సీఎం రేవంత్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. కేసీఆర్‌కు దత్తపుత్రుడిగా, కల్వకుంట్ల కిషన్‌రావుగా మారారని, కేసీఆర్‌ను అరెస్ట్ చేయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ‘‘అరెస్ట్ చేయడానికి నేనేమైనా సీఎంనా? అని కిషన్‌రెడ్డి అంటున్నారు. అయితే.. రూ.వేల కోట్ల ఆస్తులను దానం చేసిన మోతీలాల్ నెహ్రూ, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల వారసత్వం నుంచి వచ్చిన సోనియా, రాహుల్‌గాంధీలను నకిలీ కేసులతో సీబీఐ, ఈడీ.. ఢిల్లీ గల్లీలో తిప్పి ఇబ్బందులకు గురిచేయడం లేదా? గాంధీ కుటుంబానికి మానసిక క్షోభ కలిగించిన వారికి ఉసురు తగులుతుంది. గాంధీ కుటుంబపై ఈడీ, సీబీఐ ఉపయోగిస్తున్నప్పుడు.. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఎవరు అడ్డుపడుతున్నారు? కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును అరెస్టు చేసేవరకు కిషన్‌రెడ్డిని కల్వకుంట్ల కిషన్‌రావు అనే పిలుస్తాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్ల పాలనలో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎందుకు కట్టించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి మాత్రం టీవీలు, పేపర్లు, రూ.వేల కోట్ల వ్యాపారాలు వచ్చాయని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే రూ.22,500 కోట్లతో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మూడు, నాలుగు వేల కోట్లు ఖర్చయినా.. వెనుకాడకుండా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరం తదితర పుణ్యక్షేత్రాల్నింటినీ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
కేసీఆర్, మోదీని చూసి మోసపోవద్దు..
మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్, మోదీ బొమ్మలను చూసి ఓట్లేసి మోసపోవద్దని రేవంత్‌రెడ్డి అన్నారు. కాలనీల్లో డ్రైనేజీ వద్దకు మోదీ వస్తారా? ఫాంహౌ్‌సలో ఉండే కేసీఆర్ వస్తారా? అని ప్రశ్నించారు. సమస్యను పట్టించుకునే స్థానిక ఎమ్మెల్యేను, తెలంగాణ సీఎంను చూసి ఓట్లేయాలని కోరారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి భూపాలపల్లికి బైపాస్ రోడ్డు తీసుకురాలేదని, ప్రధాని మోదీ ఏనాడూ భూపాలపల్లికి రాలేదని గుర్తు చేశారు. మునిసిపల్ శాఖ తన వద్దే ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు లేకపోయినా.. రెండేళ్లలో రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లుకు రూ.17,442 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. సింగరేణి కార్మికుల వల్లనే ప్రజా ప్రభుత్వం కొనసాగుతోందని చెప్పారు. సింగరేణి కార్మికుల విషయంలో, మెడికల్ బోర్డు విషయంలో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తూ విషం చిమ్ముతున్నారని సీఎం ఆరోపించారు. ఇలాంటి వారిని మోకాళ్లపై కూర్చోబెడుతామన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం చేసే ఏ పనీ తమ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. 217 మంది డిస్మిస్ కార్మికులు ఉన్నారని, వారికి న్యాయం చేయడంపై ఆలోచిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

