Share News

ఎస్సీ, ఎస్టీ పేదలకు ఇళ్ల స్థలాలు

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:43 AM

రాష్ట్రంలో నివాస భూమి లేని ఎస్సీ, ఎస్టీ పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ పేదలకు ఇళ్ల స్థలాలు
battivikramarka

  • భూసేకరణ ప్రతిపాదనలు ఇవ్వండి: భట్టి

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నివాస భూమి లేని ఎస్సీ, ఎస్టీ పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందుకోసం అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులపై ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి సచివాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి మరింత ఊతమిచ్చేలా సబ్‌ప్లాన్‌ నిధులను సమర్థంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. వారి జీవన ప్రమాణాలు పెరిగేలా నిధుల వినియోగం ఉండాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్యుత్‌, గృహ నిర్మాణం, సామాజిక మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు వంటి కీలక రంగాల్లో అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. వ్యవసాయ భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు రైతు భరోసా, సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పథకాల నిబంధనలు అంగీకరించకపోతే.. వాటిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సూచించారు. ఎస్సీ రైతులకు ప్రయోజనం చేకూర్చే మరిన్ని ప్రత్యేక పథకాల రూపకల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ తన పరిధిలోని పథకాల కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎంత మేర ప్రయోజనాలు చేకూర్చాయనే వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. భూసేకరణకు జిల్లాల్లో 1,300 ఎకరాల ఖాళీ భూమి అందుబాటులో ఉందని అధికారులు వివరించగా... దానిని అవసరాలకు అనుగుణంగా వినియోగించే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన స్థలాలను అర్హులైన కుటుంబాలకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 04:43 AM