సూపర్ ఎల్‌నినో వచ్చినా విద్యుత్ కొరత రావొద్దు
ABN , Publish Date - Oct 23 , 2026 | 06:21 AM
ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.
జెన్‌కో ప్లాంట్లలో రోజుకు 140 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయాలి
యాదాద్రి ప్లాంటులో 2 యూనిట్లకు కోల్ ఇండియా నుంచి బొగ్గు
సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సూపర్ ఎల్‌నినో వచ్చినా సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. వ్యవసాయ, గృహ అవసరాలను సమర్థంగా తీర్చేందుకు జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రోజుకు 140 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్దేశించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, బకాయిలు తదితర అంశాలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క గురువారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం రోజువారీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సగటున 91 మిలియన్ యూనిట్లకు చేరిందని, ఈ నెల 16న ఒక్కరోజులో 118 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేశామని జెన్‌కో సీఎండీ ఎస్.హరీశ్ వివరించారు. దీన్ని రోజుకు 140 మిలియన్ యూనిట్లకు పెంచాలని భట్టి సూచించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లకు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కోల్ ఇండియా బొగ్గు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వచ్చే నెల నుంచి బొగ్గు సరఫరా అవుతుందని తెలిపారు. యాదాద్రి విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఐదో యూనిట్‌ను ఈ నెల 20న గ్రిడ్‌కు అనుసంధానించామని అధికారులు తెలిపారు. మిగిలిన సాంకేతిక, నిర్వహణాపరమైన సమస్యలను పరిష్కరించి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాల్లోకి త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు.
బకాయిల చెల్లింపునకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్
రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల విద్యుత్ బకాయిల చెల్లింపునకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానం అమలు చేయాలని భట్టి ఆదేశించారు. బకాయిల చెల్లింపును సులభతరం చేసి, వినియోగదారులకు ప్రయోజనం కలిగించేలా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా అర్హత కలిగిన పరిశ్రమలకు బకాయిల చెల్లింపుల్లో కొంతమేర వెసులుబాటు లభించడంతో పాటు, విద్యుత్ పంపిణీ సంస్థలకు దీర్ఘకాలిక బకాయిల వసూళ్లకు అవకాశం కలుగుతుందన్నారు. అలాగే సింగరేణి, జెన్‌కో, ట్రాన్స్‌కో తదితర సంస్థలకు వివిధ విభాగాల నుంచి రావాల్సిన బకాయిల వసూలుకు చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, జెన్‌కో సీఎండీ హరీశ్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, రైతు డిస్కమ్ సీఎండీ జితేష్ వి.పాటిల్, సింగరేణి డైరెక్టర్ గౌతం పొట్రు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?
భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!