Share News

సురేఖను తప్పించండి!

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:04 AM

మంత్రి కొండా సురేఖకు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందేనని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే పార్టీ సీనియర్‌ నేత చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని సూచించింది.

సురేఖను తప్పించండి!

  • మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయండి

  • చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించండి

  • క్రమశిక్షణ ఉంటేనే పార్టీని, సర్కార్‌ను గౌరవిస్తారు

  • కొండా సురేఖకు వివాదాలు ఇదే తొలిసారి కాదు

  • చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చినా వనపర్తి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు

  • సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే

  • పీసీసీ అధ్యక్షుడికి క్రమశిక్షణ కమిటీ నివేదిక

  • దానిని మీనాక్షి నటరాజన్‌కు పంపిన మహేశ్‌గౌడ్‌

  • తమ సూచనలూ జోడించి ఖర్గే, వేణుగోపాల్‌కు..

  • నివేదిక సమర్పించనున్న మీనాక్షి, పీసీసీ చీఫ్‌

  • అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోపే చర్యలు!

  • మంత్రివర్గం నుంచి తొలగించడమా..

  • పునర్వ్యవస్థీకరించి తప్పించడమా అన్నదానిపై చర్చ

  • ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్‌లో తేలే అవకాశం

  • ఒకటి, రెండు రోజుల్లోనే అధిష్ఠానం చర్యలు!

  • ‘వరంగల్‌ తూర్పు’లో పోలీసుల అలర్ట్‌

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖకు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందేనని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే పార్టీ సీనియర్‌ నేత చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని సూచించింది. ఈ మేరకు కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై సమగ్ర నివేదికలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవి, కన్వీనర్‌ శ్యామ్‌ మోహన్‌ మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌కు సమర్పించారు.


వారు ఇచ్చిన నివేదికల కాపీలను మహేశ్‌గౌడ్‌.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపించారు. ఆ నివేదికలకు మీనాక్షి, మహేశ్‌గౌడ్‌ తమ సూచనల్నీ జోడించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు పంపనున్నారు. కాగా.. కొండా సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులు కావడం ఇదే మొదటిసారి కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడోసారి అని క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సినీ నటుడు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులపై కొండా సురేఖ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లిందని తన నివేదికలో కమిటీ గుర్తు చేసింది. అలాగే గతంలో ఓ బెదిరింపు కేసుకు సంబంధించి కొండా సురేఖ ఓఎస్డీని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వెళితే.. వారిని అడ్డుకోవడమే కాకుండా ఆ సందర్భంగా సురేఖ కూతురు సుస్మితా పటేల్‌.. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్నీ ప్రస్తావించింది. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డికి కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారని పేర్కొంది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిపై, ఆయన సోదరులపై సుస్మితా పటేల్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. దానికి వివరణ ఇవ్వాల్సిందిగా కొండా సురేఖకు షోకాజ్‌ నోటీసులు పంపినట్లు తెలిపింది. అయితే సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, తనకు సంబంధం లేని అంశంపై వివరణ కోరడం సరికాదంటూ సురేఖ వివరణ ఇచ్చారని పేర్కొంది. క్యాబినెట్‌ మంత్రి అయివుండీ.. సీఎం రేవంత్‌రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను సురేఖ కనీసం ఖండించలేదని తెలిపింది.


ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు..

మంత్రి కొండా సురేఖ వైఖరి.. సీఎం రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ఉందంటూ మెజారిటీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. పార్టీ లైన్‌ తప్పినవారు కొండా సురేఖ సహా ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారని తెలిపింది. గతంలో జరిగిన ఘటనల్ని, తాజా అంశాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత.. కొండా సురేఖ పార్టీ క్రమశిక్షణను తప్పి వ్యవహరించినట్లుగా నిర్ణయానికి వచ్చామని కమిటీ పేర్కొంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీ నేతలు, కార్యకర్తలకు బలమైన సంకేతాన్ని ఇవ్వాలని సూచించింది. పార్టీలో ముఖ్య నాయకులకు క్రమశిక్షణ ఉంటేనే పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలు గౌరవిస్తారని అభిప్రాయపడింది. అలాగే పార్టీ సీనియర్‌ నేత చిన్నారెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకపోయినా.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి, ప్రజావాణి బాధ్యతలను ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం గౌరవించిందని క్రమశిక్షణ కమిటీ గుర్తు చేసింది. కానీ, ఆయన వనపర్తి నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్రమశిక్షణను ఉల్లంఘించారని తెలిపింది. ఈ నేపథ్యంలో చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి, ప్రజావాణి బాధ్యతల నుంచి తప్పించాలని సూచించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్‌కు సమగ్ర నివేదికలను ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ.. దాని ప్రతులను ఏఐసీసీకీ పంపింది.


అసెంబ్లీ సమావేశాలలోపే నిర్ణయం..?

కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీకి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌, ఇతర ముఖ్యనాయకులను అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడి ఒక నిర్ణయానికి రావచ్చునని చెబుతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు బలమైన సంకేతం ఇవ్వడం కోసం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించడమా? లేక అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి.. మార్పులు, చేర్పుల్లో భాగంగా తప్పించడమా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే కొండా సురేఖపై అధిష్ఠానం నిర్ణయం.. సీఎం ఢిల్లీ టూర్‌ తర్వాతనే ఉండొచ్చునన్న అభిప్రాయం గాంధీభవన్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో అధిష్ఠానం ఇక వేచి చూడదని, ఒకటి రెండు రోజుల్లో కొండా సురేఖను తప్పించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి సూచించనుందని పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. మరోవైపు ఈ అంశంలో సీనియర్‌ నేత నేతృత్వంలో ఒక కమిటీ వేయించాలన్న ప్రయత్నాలూ కొందరు చేస్తున్నట్లు తెలుస్తోంది.


పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రాధాన్యమైనది: మల్లు రవి

కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రాధాన్యమైన అంశమని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవి అన్నారు. క్రమశిక్షణ ఉంటేనే పార్టీని, ప్రభుత్వాన్ని గౌరవిస్తారని, పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణా కమిటీ సమగ్ర నివేదికను సమర్పించిన అనంతరం మల్లు రవి మీడియా సమావేశంలో మాట్లాడారు. క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణ, గతంలో జరిగిన అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించామని చెప్పారు. కాంగ్రెస్‌ హై కమాండ్‌ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు. నివేదికలో ఏముందో చెబితే తనకు నోటీసులు వస్తాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Updated Date - Aug 26 , 2026 | 05:06 AM