Share News

Barse Deva Interview: నాకు నేనుగా లొంగిపోలేదు: పీఎల్‌జీఏ చీఫ్ బర్సే దేవా

ABN , Publish Date - Jan 06 , 2026 | 08:02 PM

ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సే దేవా పలు కీలక విషయాలను వెల్లడించారు. హిడ్మాతో తనకు సన్నిహత సంబంధాలున్నాయన్న ఆయన.. తమకు లొంగిపోవాలనే ఆలోచన ఏనాడూ రాలేదన్నారు.

Barse Deva Interview: నాకు నేనుగా లొంగిపోలేదు: పీఎల్‌జీఏ చీఫ్ బర్సే దేవా
Moist Barse Deva

హైదరాబాద్, జనవరి 06: కేంద్రం విధించిన షరతులతో మావోయిస్టు పార్టీ అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) చీఫ్ బెర్సే సుక్కా అలియాస్ బర్సే దేవా(Barse Deva) ఇటీవల లొంగిపోయారు. అయితే.. తనకు తానుగా పోలీసులకు లొంగిపోలేదని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బర్సే దేవా. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు.


'నాకు నేనుగా తెలంగాణా పోలీసుల ముందు లొంగిపోలేదు. ఒక పనిమీద బయటకు వెళుతుంటే.. పోలీసులు పట్టుకున్నారు. దీంతో లొంగిపోవాల్సి వచ్చింది. పార్టీ‌లో దేవ్ జీ(Dev Ji), గణపతి(Ganapati) ఎక్కడ ఉన్నారో నాకు సమాచారం లేదు. ఏ ప్రాంతంలో ఉన్నారో తెలియదు. నాకు వారి ముఖ పరిచయం కూడా లేదు. నేను పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నాకు నేను వచ్చేశాను. గతేడాది అక్టోబర్‌లో హిడ్మా(Hidma)తో కలిసే ఉన్నాను. చాలాకాలం పాటు నేను హిడ్మాతో కలిసి పనిచేశాను. కానీ.. నాకు, హిడ్మాకు లొంగిపోవాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. అసలు ఆ విషయమై మేమిద్దరం ఎప్పుడూ చర్చించలేదు' అని బర్సే దేవా చెప్పుకొచ్చారు.


అయితే.. మావోయిస్టు పార్టీ ఈ మధ్య ఉనికి కోల్పోయిందని తాను భావించానని దేవా తెలిపారు. టవర్ వెపన్స్, హెలికాప్టర్ షాట్ వెపన్స్‌ను పోలీసుల నుంచే తీసుకెళ్లామని ఆయన చెప్పారు. తాను ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆలోచించలేదన్నారు. అడవుల్లో ఉన్న మరికొందరు మావోయిస్టులపై తాను ఎలాంటి కామెంట్స్ చేయనని ఆయన వ్యాఖ్యానించారు. 'మావోయిస్టు పార్టీలోకి నన్ను ఎవరూ తీసుకెళ్లలేదు. నాకు నేనే వెళ్లాను. హిడ్మా.. నా పక్క విలేజ్ కాబట్టి బాగా పరిచయం ఉంది. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వాల వద్ద ఉన్న టెక్నాలజీ మావోయిస్టుల వద్ద లేదు' అని చెప్పుకొచ్చారు బర్సే దేవా.


కేంద్రం విధించిన గడువు సమీపిస్తుండటంతో బర్సే సుక్కా సహా సుమారు 20 మంది మావోయిస్టులు గత శనివారం.. రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. వీరు అత్యంత అధునాతమైన 48 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. దళ నిర్వహణ కోసం మావోయిస్టు పార్టీ అప్పగించిన రూ.20 లక్షల నగదును ప్రభుత్వానికి స్వాధీనం చేశారు దేవా. పీఎల్‌జీఏ చీఫ్‌ హిడ్మా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన తర్వాత.. ఆ బాధ్యతను దేవా చేపట్టారు.


ఇవీ చదవండి:

హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్.. అందుకేనా?

కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యమేమీ లేదు: మల్‌రెడ్డి రంగారెడ్డి

Updated Date - Jan 06 , 2026 | 08:16 PM