వందేమాతరం చరిత్ర తెలుసుకోవాలి.. సోనియాపై బండి సంజయ్ ఫైర్
ABN , Publish Date - Aug 17 , 2026 | 09:12 PM
వందేమాతరం గీతాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వందేమాతరం గీతం చరిత్ర, ప్రాధాన్యతను కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు.
హైదరాబాద్, ఆగస్టు 17: వందేమాతరం గీతాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వందేమాతరం చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తిని నింపిన గీతం వందేమాతరమని, ఈ గీతాన్ని విని అప్పట్లో బ్రిటీష్ వారు భయపడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడు వందేమాతరం పూర్తి గీతాన్ని చూసి కాంగ్రెస్ వణుకుతోందని విమర్శించారు. దేశం మారితే సరిపోదని.. దేశ విలువలు, సంస్కృతి, వేల ఏళ్ల చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని, ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ విమర్శించారు. వందేమాతరాన్ని కాంగ్రెస్ అవమానించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
నీట్ వ్యవహారంలో దోషులను అరెస్ట్ చేసి విచారణ జరిపారని, మళ్లీ పరీక్ష నిర్వహించి ఫలితాలను కూడా వెల్లడించారని బండి సంజయ్ తెలిపారు. విద్యార్థుల్లో విపక్షాలు విషబీజాలు నాటుతున్నాయని ఆరోపించారు. విపక్షాల మాటల్లోని అంతరార్థాన్ని యువత అర్థం చేసుకోవాలని, వాస్తవాలను గ్రహించకపోతే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కావని స్పష్టం చేసిన ఆయన.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. గతంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారం పంచుకున్నాయని, ఇప్పుడు కూడా లోపాయికారీ ఒప్పందం కొనసాగుతోందని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ అవినీతి కేసులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అడ్రస్ లేకుండా పోయాయని, తెలంగాణలో బీజేపీ సింగిల్‌గా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పులు తీరాలన్నా, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
టెస్టుల్లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన రవీంద్ర జడేజా
టెస్టు సిరీస్: తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం