Share News

ఎయిర్‌టెల్ టవర్లలో భారీ చోరీ.. తొమ్మిది మంది అరెస్ట్

ABN , Publish Date - Nov 14 , 2026 | 08:10 PM

ఎయిర్‌టెల్ టవర్లను లక్ష్యంగా చేసుకుని రేడియో రిమోట్ యూనిట్లు సహా విలువైన పరికరాలను చోరీ చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎయిర్‌టెల్ టవర్లలో భారీ చోరీ.. తొమ్మిది మంది అరెస్ట్
Airtel Tower Theft

నల్లగొండ, నవంబరు 14: ఎయిర్‌టెల్ టవర్లను లక్ష్యంగా చేసుకుని రేడియో రిమోట్ యూనిట్లు (RRU) సహా విలువైన పరికరాలను చోరీ చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.1.62 కోట్ల విలువైన టెలికాం పరికరాలను ఈ ముఠా దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీల వెనుక ఉన్నది బయట వ్యక్తులు కాదు.. అదే కంపెనీలో పనిచేస్తున్న సైట్ ఇంజనీర్లు, ఇతర సిబ్బంది కావడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.

ఉద్యోగ బాధ్యతలను ఆసరాగా చేసుకుని టవర్లలోని ఖరీదైన పరికరాలపై కన్నేసిన నిందితులు.. జల్సాలకు అలవాటు పడి ఈ అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. పక్కా ప్రణాళికతో టవర్లలోని విలువైన సామగ్రిని చోరీ చేస్తూ కంపెనీకి భారీ నష్టం కలిగించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. చివరకు ఈ చోరీల వెనుక పనిచేస్తున్న తొమ్మిది మందిని గుర్తించి అరెస్ట్ చేశారు.


నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, వాహనాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.25 లక్షల విలువైన మూడు కార్లు, రూ.15 లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులుగా ఉంటూ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయల విలువైన పరికరాలను కొల్లగొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.


ఈ వార్తలనూ చదవండి:

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్

ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..

Updated Date - Nov 14 , 2026 | 09:41 PM