Sada Bainama Applications: సాదాబైనామాకు అఫిడవిట్ అక్కర్లేదు
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:19 AM
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రధాన ఆటంకంగా ఉన్న ‘అఫిడవిట్’ నిబంధనను తొలగించేందుకు సీసీఎల్‌ఏ సన్నద్ధమవుతోంది...
నేడో, రేపో ఉత్తర్వులు ఇవ్వనున్న సీసీఎల్‌ఏ
మార్గదర్శకాలను సవరించేందుకు కసరత్తు
పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలిగినట్లే
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్ర జ్యోతి): సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రధాన ఆటంకంగా ఉన్న ‘అఫిడవిట్’ నిబంధనను తొలగించేందుకు సీసీఎల్‌ఏ సన్నద్ధమవుతోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లోనే పూర్తి స్పష్టతతో ఉత్తర్వులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేసి ప్రకటన జారీ చేయనుంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 6, సబ్ సెక్షన్ 1 ప్రకారం సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి అధికారాలు కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబరు 10న రెవెన్యూ శాఖ జీవో నంబరు 106ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, భూభారతి చట్టంలో పేర్కొనని మూడు అంశాలను మార్గదర్శకాల్లో చేర్చడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. ఇందులో అత్యంత కీలకమైనది భూమి విక్రయించిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన. విక్రయదారుడి నుంచి అఫిడవిట్ తేవాలని ఒత్తిడి తెస్తే.. కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్లు తయారు చేసే ప్రమాదం ఉంటుందని, దీని వల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందనే చర్చ జరిగింది.
విక్రయదారు మరణించినా, లేదా వారసులు ఎవరనే దానిపై వివాదాలున్నా అఫిడవిట్ సేకరించడం కష్టమవుతుందన్న వాదన వినిపించింది. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు అఫిడవిట్ అడిగితే ఎవరూ అంగీకరించరని, సానుకూలత తక్కువ ఉంటుందని, అఫిడవిట్‌ను తప్పనిసరి చేస్తే మధ్యవర్తులు అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. నిర్దేశిత మొత్తాన్ని తనకు ఇవ్వలేదంటూ విక్రయదారుడు అడ్డం తిరిగితే.. న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదన్న చర్చ జరిగింది. మార్గదర్శకాల నుంచి అఫిడవిట్ నిబంధనను తొలగించాలన్న డిమాండ్ వ్యక్తమైంది. ఈ మేరకు గత అక్టోబరులో అఫిడవిట్ ఆవశ్యకతపై రెవెన్యూశాఖ న్యాయసలహా కోరింది. దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ అఫిడవిట్ తప్పని సరి కాదని, మార్గదర్శకాల నుంచి ఆ నిబంధనను మినహాయించుకోవచ్చని స్పష్టం చేశారు. ఏజీ నుంచి సానుకూల స్పందన రావడంతో అఫిడవిట్‌ను మినహాయిస్తూ మార్గాదర్శకాలను సవరించేందుకు సీసీఎల్‌ఏ సన్నద్ధమవుతోంది.
పరిష్కారం అరకొరగానే ఉంది..
సాదాబైనామాకు సంబంధించి 9,00,880 దరఖాస్తులు వస్తే.. వాటిలో 9,00,566 దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం దరఖాస్తుల్లో తహసీల్దార్ నుంచి ఆర్డీవో లాగిన్‌కు పంపినవి 6,65,249. ఇందులో ఆమోదించిన సర్వే నంబర్లు కేవలం 162. తిరస్కరించిన సర్వే నంబర్లు 4,06,991. ఇందులో చాలా వరకు అఫిడవిట్ ఇవ్వకపోవడం వల్ల తిరస్కరించినవేనని రైతులు ఆరోపిస్తున్నారు. అఫిడవిట్ నిబంధనను మినహాయిస్తే సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ఆటంకం తొలగినట్టేనని రెవెన్యూ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:
పిల్లాడి వెంటపడ్డ వీధి కుక్కలు.. తర్వాత ఏం జరిగిందంటే..
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనపై కసరత్తు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఇప్పటివరకు ఎంతమంది దర్శించుకున్నారంటే..