పరువు కోసం.. పేగు బంధాన్నే తెంచాడు
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:35 AM
మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సిన కూతురిని కుటుంబ పరువు పేరుతో కన్నతండ్రే హతమార్చాడు.
పరువు కోసం.. పేగు బంధాన్నే తెంచాడు
ప్రేమించిందని కన్నకూతురిని కడతేర్చిన తండ్రి
ఆదిలాబాద్ జిల్లా ఉమ్రిలో ఘటన.. నిందితుడి అరెస్టు
ఉట్నూర్/నార్నూర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సిన కూతురిని కుటుంబ పరువు పేరుతో కన్నతండ్రే హతమార్చాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో జరిగిన ఈ పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉట్నూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రుత్విక్ సాయి వివరాలు వెల్లడించారు. ఆడే కళ్యాణి(18)కి కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారు. అయితే ఆమె మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు తెలియడంతో తండ్రి కైలాస్ ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ నెల 24న తెల్లవారుజామున కుమార్తె ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపాడు. తర్వాత మెడకు చున్నీ కట్టి ఇంటి దూలానికి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఉదయం 9 గంటల్లోపే మృతదేహాన్ని దహనం చేశాడు. కళ్యాణి మృతిపై అనుమానంతో ఉమ్రి పంచాయతీ కార్యదర్శి భమని రాజన్న ఈ నెల 25న ఫిర్యాదు చేయడంతో నార్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.