ఆదిలాబాద్ అభివృద్ధికే.. తొలి ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Jun 01 , 2026 | 07:41 PM
ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. ఆదిలాబాద్ గిరిజన తండాల అభివృద్ధి, మహిళా సాధికారతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు..
ఆదిలాబాద్, జూన్ 01: ఆదిలాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం అంకితభావంతో పనిచేస్తున్నామని తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నేరుగా ముఖాముఖి నిర్వహించి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతీరుపై ఆరా తీశారు. తండాల్లోని అర్హులైన గిరిజనులందరికీ సొంత ఇళ్లు కేటాయిస్తామని భరోసా ఇవ్వడంతో పాటు, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను సీఎం ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యలను లబ్ధిదారులు సీఎం దృష్టికి తీసుకురాగా, స్పందించిన ఆయన యుద్ధప్రాతిపదికన ఈ సమస్యలను పరిష్కరించాలని అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్‌ను గట్టిగా ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వంలో ఆదిలాబాద్‌కే తొలి ప్రాధాన్యం అని చెప్పాం. ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనతో పాటు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నాం. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి.. మేం అమలు చేస్తున్న వినూత్న పథకాలే నిదర్శనం. ఆదివాసీ తండాల్లో అధికంగా ఇళ్లు కేటాయిస్తున్నాం. తండాల్లో ఉన్న అందరికీ ఇళ్లు కేటాయిస్తాం. వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులు చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. మహిళా సంఘాలు రూ.10 లక్షల రుణ సౌకర్యం కల్పించాం’ అని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
‘దురంధర్’తో పడిపోయిన ఇమేజీ.. దాడులకు ప్లాన్ చేస్తున్న డీ-కంపెనీ
ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించిన టీఎంసీ