వడివడిగా ఆదిలాబాద్ విమానాశ్రయ అడుగులు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం
ABN , Publish Date - Sep 20 , 2026 | 09:47 PM
తెలంగాణలో ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ప్రాజెక్టును వేగవంతం చేసే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (JUA) నిర్మాణ ప్రాజెక్టును వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రక్షణ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు రెండూ ఈ ప్రాజెక్టు సమన్వయం కోసం నోడల్ అధికారులను నియమించడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆయన సూచించారు.
ప్రాజెక్టు పరిధి, మౌలిక వసతులు
ఈ ప్రాజెక్ట్ కింద రక్షణ శాఖ ఆధ్వర్యంలో ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విజిటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ డిస్పర్సల్స్, వెదర్ షెల్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లు, ఆపరేషనల్ కాంప్లెక్స్ నిర్మిస్టారు. అంతేకాక, రక్షణ సిబ్బందికి కావాల్సిన శిక్షణ కేంద్రాలు, మెయింటెనెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తారు. డిఫెన్స్ సిబ్బంది కోసం సింగిల్, మ్యారీడ్ అకామడేషన్ క్వార్టర్లు, క్రీడలు, వినోద రంగానికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించబోతున్నారు.
ఇక, పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నేతృత్వంలో పౌర విమానాల రాకపోకలకు అనుగుణంగా సివిల్ టెర్మినల్ ఏర్పాటు చేస్తారు. విమానాల నిర్వహణ కోసం 'మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్' (MRO) సదుపాయం అభివృద్ధి చేయబోతున్నారు.
సివిల్ ఇంజినీరింగ్ సదుపాయాలు
ప్రాజెక్టుకు అవసరమైన నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర ప్రత్యేక ఇంజినీరింగ్ వ్యవస్థల నిర్మాణాలు చేపడతారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత మంత్రిత్వ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం కుదిరితే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగవంతమై, ప్రాంతీయ రవాణా, రక్షణ వ్యవస్థలకు పెద్ద పీట వేసినట్లవుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
గల్ఫ్ దేశాలలో వినాయక చవితి, నిమజ్జన వేడుకలు
సౌదీ అరేబియాలో వైభవంగా తెలుగు భాషా దినోత్సవం