సౌదీ అరేబియాలో వైభవంగా తెలుగు భాషా దినోత్సవం
ABN , Publish Date - Sep 20 , 2026 | 10:03 AM
మాతృభూమికి దూరంగా ఎడారి నాట ఉపాధి కోసం వెళ్లిన తెలుగు ప్రవాసీయులు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ - సాటా (యం) ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృభూమికి దూరంగా ఎడారి నాట ఉపాధి కోసం వెళ్లిన తెలుగు ప్రవాసీయులు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ - సాటా (యం) ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు.
రియాధ్ నగరంలో సాటా (యం) వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేషన్ నేతృత్వంలో సాటా (యం) రియాధ్ శాఖ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్, సాటా మహిళా విభాగం నాయకురాలు శర్వాణి విద్యాధరణి అన్నీ తానై చూడమచ్చటగా పండుగ వాతావరణం ఉట్టి పడేలా నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ ఎంబసీ దౌత్యవేత్త ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వదేశానికి దూరంగా ఉన్నా తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు సాటా చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలుగు ప్రజలు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మల్లేషన్ ఉద్బోధించారు. ప్రతి సంవత్సరం తమ సంస్థ నిర్వహిస్తున్న టీబీడీ ప్రాధాన్యాన్ని వివరించారు.
వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రజలు ఒకే వేదికపైకి వచ్చి తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ముదావహమని రియాధ్ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
తెలుగు భాషా దినోత్సవం తెలుగు ప్రజల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడానికి ఉపకరిస్తుందని ఉపాధ్యక్షుడు నూర్ఉద్దీన్ అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు పరస్పరం సహకరించుకోవాలని, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలని, ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన కోరారు.

ప్రతి వ్యవస్థలో మహిళా శక్తి కీలకమని, తెలుగు భాషా దినోత్సవ నిర్వహణలో కూడా మహిళల పాత్ర ప్రముఖమని మహిళా అధ్యక్షురాలు శర్వాణి విద్యాధరిణి వ్యాఖ్యానించారు.
పరాయి గడ్డపై తెలుగుతనం తన్మయత్వం వర్ణనాతీతమని సంఘం ప్రముఖులు కోకిల ఒత్లూరి, లోకేష్ చెప్పారు.
ఈ సందర్భంగా ఖాజా ముజ్మమీలోద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. చిన్నారులు ప్రదర్శించిన వివిధ ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. సౌదీలో ప్రముఖ తెలుగు గాయకుడు అంజద్ హుస్సేన్ ఆలపించిన పాటలు అందరి మనస్సులను దోచుకున్నాయి.
వీరవల్లి యోగేశ్వర రావు, సింగు నరేశ్, షహబాజ్, మిధున సురేశ్, ముదికొండ శంకర్, బూసి మురళి కృష్ణ, శ్రీ చరణ్, పడాల శేఖర్, అస్లాం రోజదార్, రాం రేలంగి, జెద్ధా అధ్యక్షుడు షౌకత్ అలీ, నిహారికలు కార్యక్రమ నిర్వహణనలో కీలక పాత్ర వహించారని మల్లేషన్ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:
తెలుగు నవలా రచయితలకు సిరికోన సాహితీ అకాడమీ ఆహ్వానం..
మేరీల్యాండ్‌లో విద్యార్థులకు తానా చేయూత.. బ్యాక్‌ప్యాక్‌లు, విద్యా సామగ్రి పంపిణీ