Share News

గల్ఫ్ దేశాలలో వినాయక చవితి, నిమజ్జన వేడుకలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 10:28 AM

వినాయక చవితి వేళ గల్ఫ్ అరబ్బు దేశాలలోని తెలుగు ప్రవాసీయులు భక్తి పారవశ్యంలో పరవశిస్తున్నారు.

గల్ఫ్ దేశాలలో వినాయక చవితి, నిమజ్జన వేడుకలు
Vinayaka Chaturthi Celebrations in Gulf

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: వినాయక చవితి వేళ గల్ఫ్ అరబ్బు దేశాలలోని తెలుగు ప్రవాసీయులు భక్తి పారవశ్యంలో పరవశిస్తున్నారు. భారతదేశం తరహాలో కాకుండా అత్యధికులు ఒకటి, రెండు రోజులకే నిమజ్జనం చేస్తుండగా దుబాయిలో కొన్ని చోట్ల మాత్రం 9,11 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. గల్ఫ్‌లో సెలవు దినాలైన శుక్ర, శనివారాలలో నిమజ్జనం చేయగా దుబాయిలో ఆదివారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాధ్, దమ్మాం నగరాల్లో వందలాది మంది భక్తులు పూజల అనంతరం నిమజ్జనం చేశారు. దమ్మాంలో తెలుగు ప్రవాసీ ప్రముఖుడు తేజ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి కార్యక్రమానికి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. రియాధ్ నగరంలో మరో ప్రముఖుడు రంజీత్ చెట్లూరి నేతృత్వంలో తెలుగు కుటుంబాలు వినమ్రంగా విఘ్నేశ్వరుడికి పూజలు చేశాయి.

3.jpg


దుబాయిలోని వివిధ లేబర్ క్యాంపులు, అపార్టుమెంట్లలో ప్రతిష్ఠించిన గణేశుడికి పూజల అనంతరం శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సాయంత్రం నిమజ్జనం చేయగా తెలుగు ప్రవాసీయులు భారీ సంఖ్యలో సందర్శించిన రాస్ అల్ ఖైమాలోని మైత్రీ ఫాం (కేసరి)లోని వినాయకుణ్ణి ఆదివారం నిమజ్జనం చేయనున్నారు. జబల్ అలీలోని హిందూ మందిరంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి మాత్రం పూజలు కొనసాగుతున్నాయి.

​ఒమాన్‌లో శ్రీ కృష్ణ, శివ మందిరాలలో గుజరాతీలు,కన్నడీయులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో తెలుగు ప్రవాసీయులు ఎక్కువ సంఖ్యలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ​మస్కట్‌లోని బర్కా, వాదీ కబీర్, మోబిల్ల, అజిబా, మిస్ఫా మున్సిపాల్టీలలో పని చేసే తెలుగు కార్మికులు తమ తమ క్యాంపులలో శుక్రవారం వినాయక చవితి ఉత్సవాలను జరుపుకున్నారు.


Bahrain.jpg

బహ్రెయిన్‌లో వినాయక చవితి ఉత్సవాలు ఈసారి గతం కంటే రెట్టింపు ఉత్సాహంతో జరిగాయి. తెలుగు కళా సమితి, పద్మశాలీ సంఘాలతో పాటూ అహ్మద్ మన్సూర్, అబ్దుల్లా నాస్, పెప్సీ, యం.సి.సి. గ్రూప్, మ్యాజిక్ షైన్, స్టార్ గ్రూప్ క్యాంపులలో తెలుగు ప్రవాసీయులు వైభవంగా జరుపుకున్నారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈసారి కువైత్, ఖతర్ దేశాల్లో వినాయక చవితి ఉత్సవాల ఆర్భాటం తగ్గింది.

ఈ వార్తలనూ చదవండి:

తెలుగు నవలా రచయితలకు సిరికోన సాహితీ అకాడమీ ఆహ్వానం..

మేరీల్యాండ్‌లో విద్యార్థులకు తానా చేయూత.. బ్యాక్‌ప్యాక్‌లు, విద్యా సామగ్రి పంపిణీ

Updated Date - Sep 20 , 2026 | 10:34 AM