Share News

22ఏపై రాద్ధాంతం వెనక కుట్ర?

ABN , Publish Date - Aug 26 , 2026 | 04:11 AM

ప్రజలకు ఎక్కడా ప్రైవేటు ఆస్తుల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 22ఏపై ప్రతిపక్షాల రాద్ధాంతం ప్రజల కోసం కాదని.. కొందరు నాయకులు, పార్టీలు తాము ఆక్రమించిన ప్రభుత్వ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించుకుని, కైవసం చేసుకునే కుట్ర కూడా ఉండవచ్చని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది

22ఏపై రాద్ధాంతం   వెనక కుట్ర?
Telangana cm

  • ప్రతిపక్షాల గొడవ ప్రజల కోసం కాదు!

  • కబ్జా భూములను 22ఏ నుంచి తప్పించేందుకు

  • కొందరు నేతల కుట్ర కావొచ్చు

  • అన్ని జిల్లాల నుంచి 22ఏ జాబితాలు తెప్పించండి

  • మనం ఎన్ని ఎకరాలు పెట్టాం.. గత పాలకులు

  • ఎన్ని ఎకరాలు పెట్టారో లెక్కలు తేలుద్దాం

  • అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి

  • మూసీ రెండో దశ పనులకు, ఓంకారేశ్వర స్వామి

  • ఆలయ నిర్మాణానికి టెండర్లు పిలవండి

  • సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఎక్కడా ప్రైవేటు ఆస్తుల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 22ఏపై ప్రతిపక్షాల రాద్ధాంతం ప్రజల కోసం కాదని.. కొందరు నాయకులు, పార్టీలు తాము ఆక్రమించిన ప్రభుత్వ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించుకుని, కైవసం చేసుకునే కుట్ర కూడా ఉండవచ్చని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని.. అన్ని జిల్లాల నుంచి నిషేధిత భూముల (22ఏ) జాబితాలను తెప్పించాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మంగళవారం ఎంసీహెచ్‌ఆర్‌డీలోనిబోధి పెవిలియన్‌లో ‘మూసీ రివర్‌ ఫ్రంట్‌’ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు, కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి.. అనంతరం 22ఏ అంశంపై రంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్లు నారాయణరెడ్డి, మనూ చౌదరి, సీఎంవో అధికారులతో చర్చించారు. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ చర్చలో 22ఏ వివాదం తలెత్తడానికి దారితీసిన పరిస్థితులు, ప్రతిపక్షాల ఆరోపణలపై ఆరా తీసినట్లు తెలిసింది.


త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు వీలుగా జిల్లాల నుంచి 22ఏ జాబితాలను తెప్పించాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ‘2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ హయాం లో ఎన్ని ఎకరాలు 22ఏ జాబితాలో పెట్టారు. 2023 డిసెంబరు 7 తరువాత ఎన్ని ఎకరాలు ఈ జాబితాలో చేరాయో స్పష్టమైన లెక్కలతో జాబితాలు సిద్ధం చేయాలి’’ అని సూచించినట్టు తెలిసింది. 22ఏపై ప్రతిపక్షాల రాద్ధాంతం వెనుక.. ప్రభుత్వ భూములను దక్కించుకునే కుట్ర ఉండొచ్చని పేర్కొన్నట్టు సమాచారం. ప్రజలను రెచ్చగొట్టి, ఆందోళన రేపి.. 22ఏ జాబితాల నుంచి భూములను తొలగించుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నించే అవకాశం ఉందని, దాన్ని అడ్డుకోవాలని సూచించినట్టు తెలిసింది.


మూసీ భూసేకరణలో చిక్కులు రాకుండా చూడాలి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు రెండు, మూడో దశ పనుల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. రెండో దశ పనులకు త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియలో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, అసైన్డ్‌ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని చెప్పారు. ఇందులో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు. మూసీ అభివృద్ధిలో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపై మున్సిపల్‌ కమిషనర్లు దృష్టిసారించాలని సూచించారు. మంచిరేవుల సమీపంలో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. కొత్వాల్‌గూడ బర్డ్స్‌ పార్క్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు.

ఇవి చదవండి

జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఆసుపత్రిలో.. పక్కనే గర్ల్‌ఫ్రెండ్!

దులీప్ ట్రోఫీ: వికెట్లు తీసిన వైభవ్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్ జట్టు

Updated at - Aug 25 , 2026 | 09:51 PM

Updated Date - Aug 26 , 2026 | 04:36 AM