జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఆసుపత్రిలో.. పక్కనే గర్ల్‌ఫ్రెండ్!
ABN , Publish Date - Aug 25 , 2026 | 09:27 PM
ఇటీవల అరెస్టైన ఓ కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగి జైలుకు బదులు ఆసుపత్రి గదిలో గర్ల్‌ఫ్రెండ్‌తో సహా దొరికిపోవడం కలకలానికి దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల అరెస్టైన ఓ కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగి జైలుకు బదులు చికిత్స పేరిట ఆసుపత్రి గదిలో గర్ల్‌ఫ్రెండ్‌తో సహా దొరికిపోవడం కలకలానికి దారి తీసింది. మాండ్యా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఆకస్మిక తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, భూరికార్డుల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ముహమ్మద్ హుస్సేన్‌ను ఇటీవల లోకాయుక్త పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని చట్టవ్యతిరేక అకౌంట్స్‌కు సంబంధించి ఆయనను అరెస్టు చేశారు. అయితే, జైల్లో ఉండాల్సిన ఆయన మాండ్యా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రిలో చేరారు. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఆకస్మిక తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. జడ్జి మొదట తన టీమ్‌తో పాటు హుస్సేన్ ఉంటున్న వార్డుకు వచ్చారు. ఆయన ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులను ఆరా తీశారు. అయితే, ఆయన ఆసుపత్రిలో చేరాల్సినంత అనారోగ్యం ఏదీ లేదని వారు తెలిపారు.
హుస్సేన్ ప్రత్యేక గదిలో ఉంటుండగా అక్కడ ఓ యువతి కూడా కనిపించడంతో విషయం ఊహించని మలుపు తిరిగింది. ఆమె ఎవరిని ప్రశ్నించగా తాను హుస్సేన్ గర్ల్‌ఫ్రెండ్‌నని ఆమె చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అనారోగ్యం లేకపోయినా హుస్సేన్‌ను ఆసుపత్రిలో ఎందుకు చేర్చాల్సి వచ్చిందని జడ్జి జైలు అధికారులు అడిగారు. జైలు డాక్టర్ సూచన మేరకే తాము ఆయనను ఆసుపత్రికి తరలించినట్టు జైలు అధికారులు తెలిపారు. ఈ విషయాలను కోర్టుకు తెలిపారా? అని ప్రశ్నించగా లేదని ఓ అధికారి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. త్వరలో ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని చెప్పినట్టు తెలిసింది.
ఈ క్రమంలో జడ్జి జైలు అధికారులపై సీరియస్ అయినట్టు తెలిసింది. హుస్సేన్ ఆసుపత్రిలో చేరికకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులతో పాటు ఆసుపత్రి వర్గాలను కూడా జడ్జి ఆదేశించారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
సోదరిని చూడ్డానికి ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. తలపై ఊడి పడ్డ సీలింగ్ ఫ్యాన్..
ఆపరేషన్ సిందూర్.. ఆ మిస్టరీకి తెర దించిన మాజీ సీడీఎస్