Share News

17 అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:23 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అనధికార నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మంగళవారం ఒక్క రోజే 17 అనధికార కట్టడాలను కూల్చేశారు.

17 అక్రమ నిర్మాణాల కూల్చివేత

  • ఒకేరోజు హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌,

  • కూకట్‌పల్లి జోన్‌లో అధికారుల చర్యలు

  • 11 భవనాలకు యూసీ నోటీసులు

  • క్షేత్రస్థాయిలో 54 అక్రమ నిర్మాణాల గుర్తింపు

  • గ్రేటర్‌ వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌.. సర్వేకు ఆదేశాలు

  • అక్రమ కట్టడాలను ఆదిలోనే గుర్తించి కూల్చేందుకు నిర్ణయం

  • సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షతో కదిలిన యంత్రాంగం

  • అంజయ్యనగర్‌ ఘటనలో కాంట్రాక్టర్‌ ఖాజామియా అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్ట్టు 25 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అనధికార నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మంగళవారం ఒక్క రోజే 17 అనధికార కట్టడాలను కూల్చేశారు. అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలి, ఇద్దరు దుర్మరణం చెందడంతో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశిస్తూ.., పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే దుస్థితి తలెత్తుతుంటే ఏం చేస్తున్నారని సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను నిలదీసినట్టు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ) కమిషనర్లు క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, కూల్చివేసేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో శేరిలింగంపల్లి జోన్‌లో 7, కూకట్‌పల్లి జోన్‌లో 2, కుత్బుల్లాపూర్‌ జోన్‌లో 8 అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు చేపట్టినట్లు సీఎంసీ అధికారులు తెలిపారు. అదేవిధంగా మరో 11 అక్రమ నిర్మాణాలకు సంబంధించి యూసీ (అనాథరైజ్డ్‌ కన్‌స్ట్రక్షన్‌) పేరిట నోటీసులు జారీ చేశారు. ఇక ఫిర్యాదులు, ప్రజావాణి వినతులు, అధికారుల క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా.. మూడు జోన్లలో ఇప్పటి వరకు మొత్తం 54 అనధికార నిర్మాణాలను గుర్తించారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో.. సర్కిళ్ల వారీగా అక్రమ కట్టడాల గుర్తింపునకు స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టనున్నట్టు ఓ అధికారి తెలిపారు. అనుమతుల్లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ దశలోఉన్నవాటిని తక్షణం గుర్తించి, నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే.. వినియోగంలో ఉన్న ఇళ్లు.. కేసుల్లో ఉన్న అక్రమ నిర్మాణాలపై కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించారు.


కాంట్రాక్టర్‌ అరెస్ట్‌..

అంజయ్యనగర్‌లో ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బిల్డర్‌ సాజిద్‌ను అరెస్ట్‌ చేయగా.. పరారీలో ఉన్న మరో నిందితుడు, కాంట్రాక్టర్‌ మహ్మద్‌ ఖాజామియాను మంగళవారం కుత్బుల్లాపూర్‌ కైసర్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు. తగిన భద్రతా చర్యలు తీసుకోకుండా నాసిరకం సామగ్రితో అతడు భవనం నిర్మించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటన జరిగిన రోజు భవనంలో పగుళ్లు రావడం, నేల కుంగిపోవడాన్ని ఖాజామియా గుర్తించినప్పటికీ.. స్థానికులను అప్రమత్తం చేయకుండా, అక్కడి నుంచి పరారైనట్టు దర్యాప్తులో వెల్లడైంది.

ఆక్రమణలకు నిలయాలు.. అంజయ్యనగర్‌, సిద్దిక్‌ నగర్‌

నాలుగు దశాబ్దాల క్రితం దట్టమైన అడవి. కానీ, నేడు ఐటీ కారిడార్‌ విస్తరణతో రూ.కోట్ల విలువైన రియల్‌ ఎస్టేట్‌కు అడ్డాగా.. ఆక్రమణలకు, అక్రమ కట్టడాలకు కేంద్రాలుగా మరాయి. అవే గచ్చిబౌలి రెవెన్యూ సర్వే నంబర్‌ 134, 135 పరిధిలోని అంజయ్యనగర్‌, సిద్దిక్‌ నగర్‌ ప్రాంతాలు. ఈ రెండు సర్వే నంబర్ల పరిధిలో సుమారు 50-60 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. ముఖ్యంగా ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా హాస్టళ్లు పెద్ద ఎత్తున వెలిశాయి. దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం వచ్చిన సుమారు 50వేల మందికి పైగా ఇక్కడి హాస్టళ్లలో ఉంటున్నారు. 1978-80 ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయానికి చెందిన క్లాస్‌-4 ఉద్యోగులకు ఈ రెండు సర్వే నంబర్ల పరిధిలో 2వేల ఇళ్లను నిర్మించి ఇచ్చింది. సచివాలయానికి బాగా దూరంగా ఉండటంతో ఉద్యోగులు ఈ ఇళ్లల్లో నివసించేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో ఆ ఇళ్లన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. ఆ తర్వాత నగరానికి ఉపాధి కోసం వచ్చిన వలసజీవులు అంజయ్యనగర్‌, సిద్దిక్‌ నగర్‌లో ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవించారు. కాలక్రమంలో వారు ఖాళీగా ఉన్న ఇళ్లను ఆక్రమించుకున్నారు. తర్వాత అవి క్రమంగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. 1990-94 మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లోని ఖాళీ జాగాలకు సంబంధించి 1,600 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కొందరు స్థానిక నాయకులు కుమ్మక్కై, బినామీ పేర్లతో వీటిని కాజేసి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి.


ఇప్పుడు కేవలం 10-15 శాతమే అసలైన లబ్ధిదారులు మిగలగా, మిగతా స్థలాలన్నీ నోటరీల ద్వారా చేతులు మారిపోయాయి. 2000 సంవత్సరం తర్వాత ఐటీ రంగం విస్తరణతో హాస్టళ్లు, అద్దె ఇళ్లకు ఇక్కడ డిమాండ్‌ పెరిగింది. దీంతో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి అంతస్తుల మీద అంతస్తులు నిర్మించారు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాల, హాస్టళ్ల వెనుక భాగం నుంచి సిద్దిక్‌నగర్‌ వైపు వెళ్లే ఈ సహజ సిద్ధమైన నాలా మార్గాన్ని పూర్తిగా మూసి, అక్రమంగా బహుళ అంతస్తులు నిర్మించడమే తాజా విపత్తులకు ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. 50-60 గజాల చిన్న విస్తీర్ణంలోనే కనీస సెట్‌బ్యాక్‌లు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ఏడంతస్తుల దాకా నిర్మిస్తుండడంతో, నేలకుంగి భవనాలు కూలిపోతున్నాయి.

టీఎన్‌జీవో కాలనీలోనూ అవే పరిస్థితులు..

ఐటీ కారిడార్‌ పరిధిలోనే ఉన్న గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీ, పరిసర ప్రాంతాల్లోనూ అచ్చంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. 50, 60, 80 గజాల అతి తక్కువ స్థలాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా, సెట్‌బ్యాక్‌ నిబంధనలు పాటించకుండా జీప్లస్‌5, జీప్లస్‌7 అంతస్తుల దాకా భవనాలు, హాస్టళ్లు నిర్మిస్తున్నారు. కిందిస్థాయి సిబ్బందికి భారీగా ముడుపులు అందుతుండడంతో ఫిర్యాదులు చేసినా.. అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్కింగ్‌ స్థలాల్లో కూడా వంటగదులు ఏర్పాటు చేయడం, చిన్న గదులు నిర్మించి అద్దెకు ఇస్తుండడంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో అంబులెన్స్‌లు, ఫైరింజన్లు కూడా రాలేని విధంగా కాలనీల రోడ్లు ఇరుకుగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిపోక, నిత్యం మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేసి వదిలేయడం కాకుండా.. నిత్యం తనిఖీలు చేపట్టి, నాసిరకం, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Aug 26 , 2026 | 05:27 AM