అప్పు ఉచ్చులో 14 ఏళ్ల బానిస బతుకు
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:14 AM
ఇప్పుడు ఏ సంవత్సరం నడుస్తోంది? ఈ రోజు తేదీ ఎంత? అధికారులు అడిగిన ఈ చిన్న ప్రశ్నలకు కూడా వారిలో కొందరి దగ్గర జవాబు లేదు
అప్పు ఉచ్చులో 14 ఏళ్ల బానిస బతుకు
కమలాపూర్ సిమెంట్ ఇటుకల కేంద్రంలో నిర్బంధ వెట్టిచాకిరి
నెల్లూరు జిల్లా నుంచి తీసుకొచ్చిన
దళిత కుటుంబాల నరకయాతన
మాట వినకపోతే చితకబాదిన యజమాని
భర్త ఊరెళ్తే భార్యకు మరొకరితో వివాహం
సిమ్ కార్డులు లాక్కుని బయటి ప్రపంచంతో సంబంధం తెంపి..
వారమంతా పనిచేస్తే కుటుంబానికి రూ.600
ఏళ్లుగా చాకిరి చేసినా తీరని అప్పు
ఏ సంవత్సరమో తెలియని దయనీయ స్థితి
ఎన్జీవో ఫిర్యాదు.. రంగంలోకి అధికారులు
బాలకార్మికులు సహా 8 కుటుంబాలకు విముక్తి
కమలాపూర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇప్పుడు ఏ సంవత్సరం నడుస్తోంది? ఈ రోజు తేదీ ఎంత? అధికారులు అడిగిన ఈ చిన్న ప్రశ్నలకు కూడా వారిలో కొందరి దగ్గర జవాబు లేదు. పద్నాలుగేళ్లుగా ఇటుకల కేంద్రమే వారికి లోకం. ఫోన్ లేదు.. ఊరితో సంబంధం లేదు.. చేతికి కూలీ డబ్బులు లేవు. ఎంత చాకిరి చేసినా అప్పు మాత్రం తీరదు. మాట ఎదురు చెబితే బెల్టు దెబ్బలు. సినిమాల్లో మాత్రమే చూసే ఈ దారుణ వెట్టిచాకిరి హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నుంచి తీసుకొచ్చిన 8 దళిత కుటుంబాలను ఓ సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రం యజమాని అప్పుల పేరుతో బందీలుగా ఉంచి చాకిరి చేయిస్తున్నాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారుల బృందం గురువారం ఆ కుటుంబాలకు విముక్తి కల్పించింది. దశాబ్దాల క్రితం గ్రామాల్లో దొరల గడీల్లో కనిపించిన వెట్టిచాకిరి నేటి సమాజంలోనూ కొనసాగుతుండటం విస్మయం కలిగిస్తోంది.
అప్పు ఇచ్చి.. ఊరు దాటించి
అధికారులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఆర్మూర్ శివ సుమారు 15 ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం కమలాపూర్ వచ్చాడు. రెండు చోట్ల భూమిని లీజుకు తీసుకుని సిమెంట్ ఇటుకలు, సిమెంట్ రింగుల తయారీ మొదలుపెట్టాడు. పనికి కూలీలు అవసరం కావడంతో తన సొంతూరిలోని అమాయక దళిత కుటుంబాలను ఎంచుకున్నాడు. 14 ఏళ్ల కిందట 8 కుటుంబాలకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చి కమలాపూర్‌కు తీసుకొచ్చాడు. అప్పటి నుంచి అరకొర కూలీ ఇస్తూ చాకిరి చేయిస్తున్నాడు. వారమం తా పనిచేస్తే ఒక్కో కుటుంబానికి రూ.600 మాత్రమే ఇస్తున్నాడు. ఏళ్ల తరబడి పనిచేసినా అప్పు తీరకపోగా, ఇంకా పెరిగిందని బాధితులు వాపోయారు. ప్రస్తుతం అక్కడ 9 మంది పురుషులు, ఏడుగురు మహిళలు, ఇద్దరు బాలకార్మికులు పనిచేస్తున్నారు. వారితో పాటు మరో 8 మంది చిన్నారులు ఉంటున్నారు. ఊరికి వెళ్తామని అడిగితే యజమాని భార్యలను పని దగ్గరే ఉంచుకుని, భర్తలను మాత్రమే పంపేవాడని బాధితులు చెప్పారు. భర్త తిరిగి రావడానికి భార్యలే హామీ. ఈ వేధింపులు భరించలేక ఒకసారి ఓ కూలీ సొంతూరికి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో అతని భార్యకు యజమాని మరొకరితో పెళ్లి చేశాడని బాధితులు అధికారుల ఎదుట చెప్పారు. ఎవరూ ఊరితో మాట్లాడకుండా అందరి సిమ్ కార్డులను తన దగ్గరే ఉంచుకున్నాడని, మాట వినకపోతే బెల్టులతో కొట్టి చిత్రహింసలు పెట్టేవాడని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పు తీరలేదనే సాకుతో కూలి ఇవ్వకుండా శారీరకంగా, మానసికంగా వేధించేవాడని అధికారుల ముందు రోదించారు.
రేషన్ బియ్యం కూడా దక్కనివ్వలేదు..
కూలీల్లో కొందరికి యజమానే కమలాపూర్ చిరునామాతో ఆధార్, రేషన్ కార్డులు ఇప్పించాడు. కానీ, ఆ కార్డులపై వచ్చే రేషన్ బియ్యం కూడా వారికి సరిగా ఇవ్వలేదని బాధితులు తెలిపారు. అంతేకాదు.. కార్మికులు కనీస వసతుల్లేని పూరి గుడిసెల్లో ఉంటున్నారని అధికారులు గుర్తించారు. వారిలో కొందరికి ఇప్పుడు ఏ సంవత్సరమో, ఏ తేదీయో కూడా తెలియని దయనీయ స్థితి ఉందని వారు చెప్పారు. ఏళ్ల తరబడి బయటి ప్రపంచానికి దూరంగా బతికారని తెలిపారు. కార్మికులను సంఘటనా స్థలం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి, ఆ తర్వాత ఆర్డీవో ఆదేశాలతో కమలాపూర్‌లోని ఓ కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. వారికి ధ్రువపత్రాలు ఇచ్చి సొంతూళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెట్టిచాకిరిపై విచారణ జరుపుతున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా కార్మికశాఖ సహాయాధికారి షర్ఫోద్దీన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి సునీత, చైల్డ్ హెల్ప్ లైన్ అధికారి జయవర్ధన్, కమలాపూర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ నవీన్, తహసీల్దార్ సురేష్‌కుమార్, ఆర్‌ఐ ఫజీల్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు రేణుక, రమాదేవి, జీపీవో శిరీషారెడ్డి, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్