మీ మొబైల్ ఫోన్ హీటెక్కుతోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:28 PM
ఎండాకాలంలో మనుషులే కాదు, మనం వాడే గ్యాడ్జెట్లు కూడా హీటెక్కిపోతుంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వేసవి ఉష్ణోగ్రతలకు తోడు, అధికంగా వాడకం వల్ల త్వరగా వేడెక్కుతుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: భానుడి భగభగలకు మనుషులే కాదు, మనం వాడే గ్యాడ్జెట్లు కూడా హీటెక్కిపోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వేసవి ఉష్ణోగ్రతలకు తోడు, అధికంగా వాడకం వల్ల త్వరగా వేడెక్కుతుంటాయి. మొబైల్ ఫోన్ విపరీతంగా వేడెక్కితే బ్యాటరీ లైఫ్ తగ్గడమే కాదు, కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వేసవి కాలంలో మీ ఫోన్ చల్లగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.. అవేంటో చూద్దాం.
1. ఎండ తగిలే చోట ఫోన్ ఉంచకండి:
చాలామంది కార్లలో ప్రయాణించేటప్పుడు డాష్ బోర్డుపై లేదా కిటికీల దగ్గర ఫోన్ పెడుతుంటారు. నేరుగా సూర్యరశ్మి తగిలితే ఫోన్ బాడీ త్వరగా హీట్ అవుతుంది. సాధ్యమైనంత వరకు ఫోన్‌ను గాలి ఆడే చోట, నీడలో ఉంచడానికి ప్రయత్నించండి.
2. ఛార్జింగ్ సమయంలో ‘బ్యాక్ కవర్’ తీయండి:
ఫోన్ చార్జింగ్ అవుతున్నప్పుడు సహజంగానే కొంత వేడి విడుదలవుతుంది. వేసవిలో బయట ఉష్ణోగ్రత్త ఎక్కువగా ఉండటం వల్ల ఈ వేడి బయటకు పోలేక లోపలే ఉండిపోతుంది. ఇంట్లో ఎక్కువ సేపు గేమ్స్ ఆడుతున్నా, వీడియోలు చూస్తున్నా బ్యాక్ కేసు తీసివేయడ మంచింది. ముఖ్యంగా మందపాటి ప్లాస్టీక్ లేదా రబ్బర్ కవర్లు వాడేవారు, ఛార్జింగ్ పెట్టేటప్పుడు వాటిని తొలగించడం ఉత్తమం.
3.‘స్క్రీన్ బ్రైట్‌నెస్’పై నిఘా:
ఎండలో స్క్రీన్ సరిగ్గా కనిపించడం లేదని బ్రైట్‌నెస్‌ను పూర్తిస్థాయిలో పెంచుతుంటారు. దీనివల్ల బ్యాటరీపై ఒత్తిడి పెరిగి ఫోన్ వేడెక్కుతుంది. దీనికి బదులుగా‘ఆటో బ్రైట్‌నెస్’ ఆప్షన్‌ను ఎంచుకోవడం లేదా అవసరమైనప్పుడు మాత్రమే పెంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల కళ్లకు హాయిని కలిగించడమే కాదు.. వేడెక్కకుండా ఉంటుంది.
4. అవసరమైన యాప్స్ వద్దు:
వైఫై, బ్లూటూత్, జిపిఎస్ (Location) వంటి ఫీచర్లు అవసరం లేనప్పుడు ఆన్ చేసి ఉంచడం వల్ల బ్యాక్ గ్రౌండ్‌లో ప్రాసెసర్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అలా ఎక్కువ సేపు ఉంటే ఫోన్ హీట్ ఎక్కుతుంది. అందుకే వాడని యాప్స్ వెంటనే క్లోజ్ చేయడం మంచిది.
5. చార్జింగ్ సమయంలో జాగ్రత్తలు:
ఫోన్ ఛార్జింగ్ సాధ్యమైనంత వరకు ఓపెన్ ప్లేస్‌లో పెట్టాలి. ఫోన్‌ను ఎప్పుడైనా చదునైన, చల్లటి ప్లేస్‌లో పెట్టి ఛార్జ్ చేసుకోవాలి. వేసవి కాలంలో వైర్‌లెస్ ఛార్జర్ ఉపయోగించకపోవడం చాలా మంచిది. ఫోన్ వేడిగా ఉందని చాలా మంది ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల లోపల తేమ చేరి ఫోన్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు గేమ్స్ ఆడటం, మాట్లాడటం, వీడియోలు చూడటం లాంటివి అస్సలు చేయకండి. మీ ఫోన్ తరుచూ వేడెక్కిపోతుంటే వెంటనే ఆపి కొద్ది సేపు పక్కన పెట్టండి. సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండటం ద్వారా కూడా ప్రాసెసర్ పనితీరు మెరుగుపరచుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ