Share News

వర్షాకాలం.. మొబైల్ ఫోన్ తడిస్తే వెంటనే ఏం చేయాలో తెలుసా?

ABN , Publish Date - Aug 05 , 2026 | 07:13 PM

వర్షాకాలంలో బయటకు వెళ్లినప్పుడు మొబైల్ ఫోన్ తడవడం లేదా నీటిలో పడిపోవడం సాధారణమే. అయితే, తడిసిన మొబైల్‌ను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వర్షాకాలం.. మొబైల్ ఫోన్ తడిస్తే వెంటనే ఏం చేయాలో తెలుసా?
Smartphone Water Damage

ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలంలో బయటకు వెళ్లినప్పుడు మనతో పాటు మొబైల్ ఫోన్ కూడా తడిచే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ నీటిలో పడిపోవచ్చు కూడా. ఇలాంటి సమయంలో చాలామంది ఫోన్ పాడైపోతుందేమో, రిపేర్‌కు భారీ ఖర్చు అవుతుందేమోనని ఆందోళన చెందుతారు. అయితే సరైన సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్‌కు పెద్ద నష్టం జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది.


వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి

ఫోన్ తడిసిన వెంటనే పవర్ ఆఫ్ చేయాలి. తడిగా ఉన్న సమయంలో ఫోన్ ఆన్‌లో ఉంటే షార్ట్ సర్క్యూట్ జరిగి మదర్‌బోర్డ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

సిమ్, మెమరీ కార్డులు తీసేయండి

ఫోన్‌ను ఆఫ్ చేసిన తర్వాత సిమ్ ట్రే, సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ ఉంటే వాటిని బయటకు తీసేయండి. ఇలా చేయడం వల్ల ఫోన్ లోపల ఉన్న తేమ త్వరగా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.

పొడి గుడ్డతో శుభ్రంగా తుడవండి

శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా టిష్యూ పేపర్‌తో ఫోన్ బయట భాగాన్ని మెల్లగా తుడవండి. అయితే ఫోన్‌ను ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్ లేదా అధిక వేడి ఉపయోగించకండి. వేడి గాలి ఫోన్‌లోని సున్నితమైన భాగాలను దెబ్బతీయవచ్చు.

తేమను తొలగించేందుకు బియ్యంలో ఉంచండి

ఫోన్‌ను పొడి బియ్యం ఉన్న డబ్బాలో పూర్తిగా ముంచి కనీసం 24 నుంచి 48 గంటల పాటు అలాగే ఉంచండి. బియ్యం తేమను పీల్చుకునే గుణం కలిగి ఉండటంతో ఫోన్‌లోని తేమ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మధ్యలో పదేపదే బయటకు తీసి చూడకండి.


వెంటనే ఛార్జింగ్ పెట్టవద్దు

ఫోన్ తడిసిన వెంటనే ఛార్జర్‌కు కనెక్ట్ చేయకండి. తేమ పూర్తిగా తొలగకముందే ఛార్జింగ్ పెడితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. కనీసం రెండు రోజుల తర్వాత మాత్రమే ఛార్జింగ్ గురించి ఆలోచించడం మంచిది.

48–72 గంటల వరకు ఫోన్ ఆన్ చేయకండి

ఫోన్‌ను పదేపదే ఆన్ చేసి పనిచేస్తుందా లేదా అని పరీక్షించకండి. కనీసం 48 నుంచి 72 గంటలు పూర్తిగా ఆఫ్‌లో ఉంచిన తర్వాత మాత్రమే ఆన్ చేయండి. దీంతో లోపల ఉన్న తేమ పూర్తిగా ఆరిపోయే అవకాశం ఉంటుంది.

ఇంకా సమస్య ఉంటే సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి

72 గంటల తర్వాత కూడా ఫోన్ సరిగా పనిచేయకపోతే ఇంట్లోనే తెరవడానికి ప్రయత్నించకుండా అధికారిక సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం ఉత్తమం.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

రాయలసీమ రాగి ముద్ద ఆరోగ్యానికి వరం.. పిల్లలు, పెద్దలకు ఎన్నో ప్రయోజనాలు

ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజ్.. ‘కోస్టల్ కర్ణాటక’ టూర్ వివరాలు ఇవే

Updated Date - Aug 05 , 2026 | 07:16 PM