NASA: అంతరిక్ష చరిత్రలో మొదటిసారి వైద్య అత్యవసర పరిస్థితి..
ABN , Publish Date - Jan 15 , 2026 | 08:43 PM
అంతరిక్ష కేంద్రం చరిత్రలో మొదటిసారిగా ఒక వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా నాసా తన మిషన్‌ను ముందుగానే ముగించి, నాలుగుగురు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తిరిగి తీసుకొచ్చింది. జనవరి 7న ఒక వ్యోమగామికి తీవ్రమైన వైద్య సమస్య ఏర్పడటంతో ఈ పనికి పూనుకుంది.
వాషింగ్టన్, జనవరి 15: అంతరిక్ష కేంద్రం (ISS) చరిత్రలో మొదటిసారిగా ఒక వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా NASA Crew-11 మిషన్‌ను ముందుగానే ముగించి, నాలుగురు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తిరిగి తీసుకొచ్చింది. అమెరికా (NASA)కు చెందిన జెనా కార్డ్‌మాన్, మైక్ ఫింకే, జపాన్ (JAXA)కు చెందిన కిమియాయుయి, రష్యా (Roscosmos)కు చెందిన ఒలెగ్ ప్లాటోనోవ్ ఈ నలుగురు వ్యోమగాములు గత ఆగస్టులో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ ఎండెవర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ISSకు చేరుకున్నారు.
అయితే, మార్చి 2026 వరకు ఉండాల్సిన మిషన్‌ను ఒక నెల ముందుగానే ముగించారు. జనవరి 7న ఒక వ్యోమగామికి తీవ్రమైన వైద్య సమస్య ఏర్పడటంతో జనవరి 8న ప్లాన్ చేసిన స్పేస్‌వాక్‌ను రద్దు చేశారు. NASA ఆ సమస్య వివరాలు (ఏ వ్యోమగామికి జరిగింది, ఏమి సమస్య అనేది) గోప్యంగా ఉంచింది. కానీ ఆ వ్యక్తి బాగానే ఉన్నారని, వైద్య పరీక్షలు అవసరమని తెలిపింది.
ఇది అత్యవసర ఎవాక్యుయేషన్ కాదు, కానీ మిషన్‌ను ముందుగా ముగించి నాలుగురినీ తిరిగి తీసుకొచ్చారు (క్యాప్సూల్ ఒక్కటే ఉండటంతో) జనవరి 15 (గురువారం) తెల్లవారుజామున కాలిఫోర్నియా తీరం సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ చేశారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ ఎండెవర్ క్యాప్సూల్ ద్వారా తిరిగి వచ్చారు.
NASA అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మాన్ దీనిపై మాట్లాడుతూ, 'నలుగురూ సురక్షితంగా ఉన్నారు. మంచి మానసిక స్థితిలో ఉన్నారు' అని తెలిపారు. సాన్ డియాగోలోని ఆసుపత్రిలో వీరికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ISSలో 25 ఏళ్ల చరిత్రలో ఇలాంటి మెడికల్ ఎవాక్యుయేషన్ ఇదే మొదటిది.
ఇప్పుడు ISSలో మిగిలిన వ్యోమగాములు కొనసాగుతున్న మిషన్‌ను నిర్వహిస్తున్నారు. తదుపరి క్రూ ఫిబ్రవరి మధ్యలో లాంచ్ అవుతుంది. ఈ ఘటన అంతరిక్షంలో వైద్య సమస్యలు ఎదురైనప్పుడు తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురాగలిగే NASA, స్పేస్‌ఎక్స్ సామర్థ్యాన్ని చూపించినట్లైంది.
ఇవీ చదవండి:
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..
మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు