ప్రమాదంలో వైట్ కాలర్ జాబ్స్.. బిల్‌గేట్స్ హెచ్చరిక
ABN , Publish Date - Jan 21 , 2026 | 09:35 PM
ఏఐ కారణంగా ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ప్రొడక్టివిటీ పెరిగిందని, లాజిస్టిక్స్, కాల్ సెంటర్స్‌లో ఏఐ లోయర్ స్కిల్ రోల్స్‌ను రీప్లేస్ చేస్తోందని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడనున్నాయని ఆయన హెచ్చరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడనున్నాయని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ హెచ్చరించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల సందర్భంగా ఆయన భారత్‌కు చెందిన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఏఐకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊహించిన దానికంటే వేగంగా జాబ్ మార్కెట్ రూపాన్ని మార్చబోతోందని అన్నారు. రానున్న నాలుగైదు సంవత్సరాలలో వైట్ కాలర్, బ్లూ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడనున్నాయని ఆయన వెల్లడించారు.
ఏఐ కారణంగా వ్యాధుల నివారణలో కీలక పురోగతి లభిస్తుందని, విద్యలో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఏఐపై సరైన నియంత్రణ లేకపోతే ఉద్యోగ వ్యవస్థలు, నియామక విధానాలు, ఆర్థిక సమానత్వంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘ది ఇయర్ అహెడ్’ లేఖలోనూ బిల్ గేట్స్ ఇవే విషయాలను చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఏఐ ప్రభావం పెద్దగా కనిపించలేదని, కానీ.. అతి త్వరలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు.
ఏఐ కారణంగా ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ప్రొడక్టివిటీ పెరిగిందని, లాజిస్టిక్స్, కాల్ సెంటర్స్‌లో ఏఐ లోయర్ స్కిల్ రోల్స్‌ను రీప్లేస్ చేస్తోందని అన్నారు. ఈ మార్పుపై సరైన విధంగా స్పందించకపోతే.. సంపద, అవకాశాలు కొద్దిమంది చేతుల్లోకి మాత్రమే వెళ్లిపోతాయని చెప్పారు. అసమానతలు తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే సమిష్టి విధానాలు, అంతర్జాతీయ సహకారం అవసరమని తెలిపారు. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో భారత్–అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి ఒక స్థిరమైన ఆధారంగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
8 యుద్ధాలను ఆపాం.. దావోస్‌లో ట్రంప్ పాతపాట
విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం.. బాధితులను స్టేషన్‌కు పిలిస్తే అధికారులదే బాధ్యత