Share News

బిల్ గేట్స్ హెచ్చరిక.. మరో 20 ఏళ్లల్లో..

ABN , Publish Date - Oct 25 , 2026 | 08:13 PM

రాబోయే 20 ఏళ్లల్లో కృత్రిమ మేధ కారణంగా జాబ్ మార్కెట్‌లో పెను మార్పులు సంభవించనున్నాయని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు.

బిల్ గేట్స్ హెచ్చరిక.. మరో 20 ఏళ్లల్లో..
Bill Gates on AI transition Period

ఇంటర్నెట్ డెస్క్: రాబోయే 20 ఏళ్లల్లో కృత్రిమ మేధ కారణంగా జాబ్ మార్కెట్‌లో పెను మార్పులు సంభవించనున్నాయని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు. ఈ సంధి కాలంలో సమాజం, వర్కర్లు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారని చెప్పారు. ఆ తరువాతే సమాజానికి అవసరమైన అసలైన సంపదను ఏఐ సృష్టిస్తుందని అన్నారు.

ఏఐతో సమాజం సుసంపన్నమయ్యే లోపు కొందరు విజేతలుగా మారితే మరికొందరు విఫలమైన వారిగా మిగిలిపోతారని అన్నారు. వ్యాపారాలు, పరిశ్రమల్లో వచ్చే మార్పుల కారణంగా ప్రజలు పలు సవాళ్లను ఎదుర్కొంటారని అన్నారు. డీకోడర్ పాడ్‌కాస్ట్‌లో గేట్స్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.


కార్యాలయాల్లో ఉద్యోగాల భవిష్యత్తుపై ఆయన పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఏఐ వ్యవస్థలు మెరుగయ్యే కొద్దీ టెలిఫోన్ సేల్స్, కస్టమర్ సపోర్టు, అకౌంటింగ్ జాబ్స్ కనుమరుగవుతాయని గేట్స్ తెలిపారు. ఈ పనులను మరింత కచ్చితత్వంతో తక్కువ ధరకు ఏఐ చక్కబెట్టేస్తుందని ఆయన అన్నారు.

ఉద్యోగాల కోతలు కేవలం కార్యాలయాలకే పరిమితం కావని గేట్స్ హెచ్చరించారు. శారీరక శ్రమ అవసరమైన పనులను హ్యూమనాయిడ్ రోబోలు (మనుషులను పోలినట్టు ఉండే రోబోలు) పూర్తి చేస్తాయని చెప్పారు. ఇది పరిశ్రమల్లో పలు కీలక మార్పులకు కారణం అవుతుందని అన్నారు. ఏఐ, రోబోటిక్స్ అభివృద్ధికి భారీ స్థాయిలో బ్రేకులు వేయని పక్షంలో యంత్రాలు అనేక పనులు చక్కబెట్టే స్థితి వస్తుందని చెప్పారు. సర్జరీలు, వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం వంటివి కూడా రోబోలు చేసే స్థితి వస్తుందని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు ముప్పు ఉంది: మైక్రోసాఫ్ట్ ఏఐ నిపుణుడు నికొలస్ బట్స్

వచ్చే ఏడాది జనవరి నుంచీ సిమ్ బైండింగ్ అమలు.. ఫోన్‌లో సిమ్ లేకపోతే..

Updated Date - Oct 25 , 2026 | 08:24 PM