Share News

వచ్చే ఏడాది జనవరి నుంచీ సిమ్ బైండింగ్ అమలు.. ఫోన్‌లో సిమ్ లేకపోతే..

ABN , Publish Date - Oct 23 , 2026 | 06:20 PM

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ సిమ్ బైండింగ్‌ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.

వచ్చే ఏడాది జనవరి నుంచీ సిమ్ బైండింగ్ అమలు.. ఫోన్‌లో సిమ్ లేకపోతే..
Sim Binding Mandatory from 1, Jan, 2027

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ సిమ్ బైండింగ్‌ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని టెలీకమ్యూనికేషన్స్ శాఖ ధ్రువీకరించింది. వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్‌ను వినియోగించేందుకు ఆయా ఫోన్‌ల్లో సంబంధిత మొబైల్ సిమ్ కార్డు కూడా ఉండితీరాలి.

ఏమిటీ సిమ్‌బైండింగ్..

సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం, వాట్సాప్‌ అకౌంట్‌కు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ తాలూకు సిమ్ కార్డు కూడా యాప్ ఉన్న ఫోన్‌లో నిరంతరం ఉండాలి. ప్రస్తుతం మెసేజింగ్ యాప్‌లోకి ఒకసారి లాగిన్ అయ్యాక ఫోన్‌లోని సిమ్ కార్డు తొలగించినా కూడా వైఫై ద్వారా మెసేజింగ్ యాప్స్‌ వాడుకునే సౌలభ్యం ఉంది. ఒకసారి ఓటీపీతో వెరిఫై చేశాక యాప్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా వాడుకునే ఛాన్స్ ఉంది. దీంతో, పర్యాటకులతో ఇది అనువు. సిమ్ మార్పుల సందర్భంలో కూడా మేసేజింగ్ యాప్స్ ఎలాంటి ఆటంకాలు లేకుండా వినియోగించుకోవచ్చు.


వచ్చే ఏడాది నుంచి పరిస్థితులు మారనున్నాయి. యూజర్ అకౌంట్‌కు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ తాలూకు సిమ్ కార్డు అదే డివైజ్‌లో ఉన్నదీ లేనిదీ మెసేజింగ్ యాప్స్ చెక్ చేయనున్నాయి. సిమ్ కార్డు ఎల్లవేళలా ఫోన్‌లోనే ఉన్నదీ లేనిదీ చెక్ చేస్తుంటాయి. మరి సిమ్ కార్డు లేని ఫోన్స్‌లో మెసేజింగ్ యాప్స్‌ డిసెంబర్ 31 తరువాత నిలిచిపోతాయా? అన్నది సిమ్ బైండింగ్‌ను ఆయా యాప్ కంపెనీలు ఎలా అమలు చేస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

యూజర్‌ అకౌంట్స్‌, సిమ్ కార్డు లింకింగ్‌ను పూర్తి చేసేందుకు కేంద్రం మాత్రం డిసెంబర్ 31 వరకే మెసేజింగ్ యాప్స్‌కు గడువు విధించింది. ఈ నేపథ్యంలో సిమ్ బైండింగ్ ఫీచర్‌ బీటా వర్షెన్‌ను ఇప్పటికే వాట్సా్ప్ పరీక్షిస్తోంది. యాపిల్ కూడా ఈ దిశగా ఐఓఎస్‌ను అప్‌డేట్ చేసింది.


ఇక వెబ్ మెసేజింగ్ యాప్ అకౌంట్స్‌కు కూడా గతంలో కేంద్రం ఓ నిబంధన తీసుకొచ్చింది. ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అయ్యేలా మార్పులు చేయాలని సంస్థలకు సూచించింది. ఆ తరువాత యూజర్లు మళ్లీ క్యూఆర్ కోడ్‌తో అకౌంట్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈ నిబంధనకు సడలింపులు ఇచ్చారు. సైబర్ నేరాల ముప్పు ఎంతుందనేదాన్ని బట్టి లాగౌట్ చేసేలా కేంద్రం నిబంధనలను మార్చింది.

ఈసిమ్ పరిస్థితి ఏంటి?

ఈసిమ్‌ల పరిస్థితి ఏంటన్నదానిపై ఇంకా క్లారిటీ లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ డివైజ్‌లో మెసేజింగ్ యాప్ వాడితే అందులో సంబంధిత ఈసిమ్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయాల్సి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక వైఫై-ఓన్లీ టాబ్లెట్స్ వాడే వారికి మాత్రం చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వీరితో పాటు విదేశాల్లోని డివైజ్‌ల్లో ఆపరేట్ చేసే మెసేజింగ్ అకౌంట్స్ విషయంలో కూడా చిక్కులు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

యూట్యూబ్‌లో కస్టమ్ ఫీడ్స్ ఫీచర్.. ఇక పూర్తి నియంత్రణ మీ చేతుల్లోనే!

మరో అద్భుతానికి సిద్ధమైన మస్క్

Updated Date - Oct 23 , 2026 | 06:20 PM