ఏఐతో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు.. బిల్ గేట్స్ హెచ్చరిక
ABN , Publish Date - Aug 26 , 2026 | 04:26 PM
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా ఏఐ విషయంలో కీలక హెచ్చరిక చేశారు. ఏఐతో మానవ సమాజానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా ఏఐ విషయంలో కీలక హెచ్చరిక చేశారు. ఏఐతో మానవ సమాజానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. ప్రభుత్వాలు అప్రమత్తంగా లేకపోతే భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు తప్పవని హెచ్చరించారు. ఏఐ నియంత్రణకు అంతర్జాతీయ ఒప్పందాలు ఉండాలని సూచించారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏఐ సాంకేతికత ఊహించని వేగంతో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమై త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని బిల్ గేట్స్ సూచించారు. ఈ సాంకేతికతతో ఎదురవుతున్న ముప్పును ఏఐ కంపెనీలు తక్కువ చేసి చూపుతున్నాయని అన్నారు. ఏఐతో వచ్చే నష్టాలకంటే లాభాలు ఎక్కువగా ఉంటాయని వారు నమ్ముతున్నారని చెప్పారు. ‘ఏఐ ఎంత మెరుగ్గా ఉందో వాళ్లకు తెలుసు. ఒకింత వాళ్లు కూడా ఆందోళనతో ఉన్నారు. కానీ ఈ విషయంలో బహిరంగంగా కామెంట్స్ చేసేందుకు సిద్ధంగా లేరు. ఏఐపై పెట్టుబడులు రాకపోవచ్చన్న భయంతో వారు బయటపడట్లేదు’ అని గేట్స్ చెప్పారు.
మునుపటి సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ఏఐ పూర్తిగా భిన్నమైనదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. మునుపటి సాంకేతిక విప్లవాలతో అంతిమంగా అనేక కొత్త జాబ్స్ అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఏఐ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అతి కొద్ది రంగాలు మాత్రమే మనుషులకు ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాయని హెచ్చరించారు. ఏఐకి ఉన్న కోడింగ్ సామర్థ్యాలు తాను షాకిచ్చాయని వ్యాఖ్యానించారు. ‘కోడింగ్‌లో నేను మెరుగే. అయితే. ఇవి నాకంటే మెరుగ్గా ఉన్నాయని తెలిసి షాకైపోయా అనిపించింది. ప్రభుత్వాలు అప్రమత్తంగా లేకపోతే భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు తప్పవు’ అని గేట్స్ హెచ్చరించారు.
మనుషులపై ఏఐ ప్రభావాన్ని తగ్గించేందుకు గేట్స్ కొత్త పన్నును కూడా ప్రతిపాదించారు. ఏఐని వాడుతూ మనుషులను ఉద్యోగాల నుంచి తొలగించే సంస్థలపై పన్ను విధించాలని అన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఈ ఆదాయంతో ఆదుకోవాలని చెప్పారు. కేర్ గివింగ్ వంటి రంగాల్లో ఉద్యోగాలను మనుషులకు పరిమితం చేయాలని కూడా సూచించారు.
యావత్ మానవాళికే ముప్పు తెచ్చే జీవఆయుధాలను తయారు చేసేందుకు ఏఐని దుర్వినియోగపరిచే ముప్పు ఉందని కూడా గేట్స్ హెచ్చరించారు. ఏఐ వినియోగంపై పరిమితులు విధించేందుకు, నిఘా పెట్టేందుకు అంతర్జాతీయ ఒప్పందాలు ఉండాలని అన్నారు. ఈ విషయాలపై ఆశించిన స్పందన కనిపించకపోవడం తనను షాక్‌కు గురిచేస్తోందని అన్నారు. ప్రపంచనేతల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ‘జనాలకు దుర్వార్తలను చెప్పడం నాకు ఇష్టం ఉండదు. సాంకేతికతతో అంతిమంగా చెడే జరుగుతుందని చెప్పడం నాకు నచ్చదు. కానీ ప్రస్తుతం మనం అదే స్థితికి చేరుకున్నాము’ అని బిల్ గేట్స్ యావత్ ప్రపంచాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
గుడ్ న్యూస్! పిక్సెల్ వాచ్-5లో ఇన్సులీన్ రెసిస్టెన్స్‌ను గుర్తించే ఫీచర్
వాట్సాప్‌లో అదిరిపోయే ఏఐ ఫీచర్లు.. ఏమేం ఉన్నాయంటే.?