ఐపీఎల్ 2026: అనుష్కకు కోహ్లీ ప్రత్యేక బహుమతి.. వీడియో వైరల్
ABN , Publish Date - Mar 29 , 2026 | 10:38 AM
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది
స్పోర్ట్స్ డెస్క్: శనివారం ఐపీఎల్ 2026 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఇక తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్.. కెప్టెన్ ఇషాన్ కిషన్ (80) మెరుపు ఇన్నింగ్స్ సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రతాపానికి ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. కేవలం15.4 ఓవర్లలోనే ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. టార్గెట్ ఎంత భారీగా ఉన్నా ఛేజ్ మాస్టర్ క్రీజులో ఉంటే అది సాధ్యమేనని మరోసారి నిరూపితమైంది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది.
అనుష్కకు ఫ్లయింగ్ కిస్
బెంగళూరు విజయం సాధించగానే విరాట్ కోహ్లీ(Virat Kohili) గ్యాలరీలో తన కోసం చీర్ చేస్తున్న భార్య అనుష్క శర్మ వైపు చూస్తూ 'ఫ్లయింగ్ కిస్' ఇచ్చాడు. కోహ్లీ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌కు అనుష్క కూడా ఆలస్యం చేయకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అతడి తరహాలోనే అనుష్క కూడా ఫ్లయింగ్ కిస్ తిరిగి ఇచ్చింది. వీరి రొమాంటిక్ సెలబ్రేషన్ చూసిన ప్రేక్షకులు గట్టిగా కేకలు వేయడంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. వీరి ఫ్లయింగ్ కిస్ సన్నివేశాలను ఆ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ఆర్సీబీ మహిళా కెప్టెన్ స్మృతి మంధాన ఆశ్చర్యంగా చూసింది. ఈ మ్యాచ్ చూసేందుకు మహిళా క్రికెటర్లు శ్రేయాంక పాటిల్, జెమిమా రోడ్రిగ్స్ కూడా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం కోహ్లీ సెలబ్రేషన్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
తొలి రెండు వారాలు ఐపీఎల్‌కు ధోనీ దూరం