ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా బిల్లు!
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:53 AM
పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఆమోదింపజేయాలని భావిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు....
మహిళలకు రిజర్వేషన్‌తోనే 2029 ఎన్నికలు
నియోజకవర్గాల పునర్విభజన లేకుండా కోటా అమలు వీలుకాదు
బిల్లుకు సహకరించాలని ఖర్గే, రాహుల్‌ను కోరుతున్నాం
పునర్విభజన కమిషన్ ఏర్పాటుపై ప్రతిపక్షాలతో చర్చిస్తున్నాం
దేశంలో నక్సలిజం అంతరించినట్లే: కేంద్ర మంత్రి అమిత్‌షా
న్యూఢిల్లీ/కోల్‌కతా, మార్చి 28: పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఆమోదింపజేయాలని భావిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి, 2029 ఎన్నికలకు వెళ్దామనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఓ ఆంగ్ల చానల్ ఇంటర్వ్యూతోపాటు.. శనివారం కోల్‌కతాలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై చార్జిషీటు విడుదల చేసిన సందర్భంగా పలు అంశాలపై అమిత్‌షా మాట్లాడారు. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే వచ్చే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని ఎన్‌డీఏ ప్రభుత్వం భావిస్తుంటే కాంగ్రెస్ అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. ‘నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాకుండా మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయలేం. పునర్విభజన కమిషన్ ఏర్పాటుకు ప్రతిపక్షాలతో ప్రతి రోజూ చర్చిస్తున్నాం. కొన్ని విపక్షాలు, ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలు అందుకు అంగీకరించాయి. కాంగ్రెస్ మాత్రం మే నెలలో చర్చిద్దామని చెబుతోంది. ఇందుకు కారణమేంటో తెలియదు. పునర్విభజన బృహత్తర ప్రక్రియ. రాష్ట్రాలతో చర్చించాల్సి ఉంటుంది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో బహిరంగ విచారణ చేపట్టాల్సి ఉంటుంది’ అని అమిత్‌షా తెలిపారు. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా బిల్లుపై చర్చించి ఆమోదించేందుకు సహకరించాలని ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలైన రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు కోటా కావాలని కాంగ్రెస్ నిజంగా కోరుకుంటే వీలైనంత త్వరగా ‘నారీశక్తి వందన్’ చట్టం అమలుకు చర్చలను వేగరం చేసి సహకరించాలని కోరారు.