మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్న భారత్
ABN , Publish Date - Sep 02 , 2026 | 09:23 PM
మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ ప్రకటించింది.
స్పోర్ట్స్ డెస్క్: మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ(బుధవారం)ప్రకటించింది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న కారణంగా ఆతిథ్య హక్కులను కోల్పోయింది. ఈక్రమంలో ఈ టోర్నీ నిర్వహించేందుకు భారత్‌కు అవకాశం లభించింది.
వాస్తవానికి టోర్నమెంట్ నిర్వహణకు బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికాలను ఐసీసీ ఆప్షన్లుగా పెట్టుకుంది. అయితే చివరకు ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశంగా భారత్‌ను ఐసీసీ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని ఇవాళ(సెప్టెంబర్ 2) ఐసీసీ బోర్డు ఆమోదించింది. ఇక టోర్నీ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగనుంది. మ్యాచ్‌లు ముంబై, వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఇక టోర్నీలో పాల్గొనే జట్ల అర్హతలను కూడా ఐసీసీ వెల్లడించింది.
కటాఫ్ డేట్ అయిన జులై 6 నాటికి మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీపడనున్నాయి. ఆ విధంగా చూస్తే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ ఈ టోర్నీకి దూరమైంది. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌లో తలపడతాయి.
ఇవి కూడా చదవండి:
నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం: తిలక్ వర్మ
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ .. పడిపోయిన గిల్, బుమ్రా స్థానాలు!