Share News

‘వైభవం’గా బోణీ

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:31 AM

ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో వహ్వా అనిపించాయి. కానీ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాత్రం అత్యంత పేలవ ఆటతీరుతో నిరాశపర్చింది.

‘వైభవం’గా బోణీ

  • 15 బంతుల్లోనే సూర్యవంశీ హాఫ్‌ సెంచరీ

  • చెన్నైపై రాజస్థాన్‌ ఘన విజయం

గువాహటి: ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో వహ్వా అనిపించాయి. కానీ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాత్రం అత్యంత పేలవ ఆటతీరుతో నిరాశపర్చింది. ఏ విభాగంలోనూ ఆకట్టుకోలేకపోయిన సీఎస్‌కేపై అటు రాజస్థాన్‌ రాయల్స్‌ పూర్తి ఆధిపత్యం చూపింది. బౌలర్ల సమష్టి రాణింపునకు తోడు.. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 52) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీంతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రియాన్‌ పరాగ్‌ సేన 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ముందుగా చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఒవర్టన్‌ (43), కార్తీక్‌ శర్మ (18), సర్ఫరాజ్‌ (17) మాత్రమే రాణించారు. ఆర్చర్‌, బర్గర్‌, జడేజాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో రాజస్థాన్‌ 12.1 ఓవర్లలో 2 వికెట్లకు 128 పరుగులు చేసి నెగ్గింది. జైస్వాల్‌ (38 నాటౌట్‌), జురెల్‌ (18), పరాగ్‌ (14 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. అన్షుల్‌కు రెండు వికెట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా బర్గర్‌ నిలిచాడు.

ఆరంభం నుంచే బాదుడు: చెన్నై బ్యాటర్లు కష్టాలు పడిన చోట 15 ఏళ్ల టీనేజర్‌ వైభవ్‌ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. దీంతో రాజస్థాన్‌ ఛేదనను తుఫాన్‌ వేగంతో ఆరంభించింది. ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్‌ అవుట్‌ నుంచి తప్పించుకున్న వైభవ్‌ బౌలర్‌ ఎవరైనా ఎడాపెడా షాట్లు బాదేస్తూ హోరెత్తించాడు. మరో ఓపెనర్‌ జైస్వాల్‌ ఆచితూచి ఆడినా.. వైభవ్‌ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఓవర్‌లో 4,6 రాబట్టిన అతను ఐదో ఓవర్‌లో 4,4,6 బాదాడు. ఇక నూర్‌ అహ్మద్‌ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో 15 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఈ దూకుడు కారణంగా జట్టు పవర్‌ప్లేలో 74 పరుగులు సాధించడంతో ఫలితం ఖరారైపోయింది. వైభవ్‌ను అన్షుల్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 38 బంతుల్లో 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్‌ జురెల్‌ ఉన్నకాసేపు జోరు చూపాడు. అతడిని కూడా అన్షుల్‌ అవుట్‌ చేశాక.. జైస్వాల్‌, కెప్టెన్‌ పరాగ్‌ ఎలాంటి ఇబ్బందీ లేకుండా మరో 47 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించారు.


ఒవర్టన్‌ ఒక్కడే: మ్యాచ్‌ ఆరంభానికి ముందు వర్షం కురవడంతో రాజస్థాన్‌ టాస్‌ గెలవగానే ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తమ కెప్టెన్‌ నిర్ణయాన్ని రాయల్స్‌ బౌలర్లు వమ్ము చేయలేదు. పిచ్‌ నుంచి తోడ్పాటు లభించడంతో సీఎస్‌కే బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పదునైన బంతులతో వణికించారు. దీంతో టపటపా వికెట్లు కోల్పోయిన చెన్నై.. పరుగుల కోసం చెమటోడ్చింది. చివర్లో ఒవర్టన్‌ పోరాటం కాస్త పరువు కాపాడింది. ముఖ్యంగా పేసర్లు బర్గర్‌, ఆర్చర్‌ కచ్చితమైన బంతులతో ఆరంభంలోనే దెబ్బతీశారు. వారి జోరుకు ఎల్లో జెర్సీలో తొలి మ్యాచ్‌ ఆడిన ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (6)కు నిరాశే ఎదురైంది. రెండో ఓవర్‌లోనే సంజూను బర్గర్‌ బౌల్డ్‌ చేయగా, తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్‌ రుతురాజ్‌ (6)ను ఆర్చర్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇక, ఆయుష్‌ మాత్రే (0), షార్ట్‌ (2) చకచకా పెవిలియన్‌కు చేరడంతో పవర్‌ప్లేలోనే జట్టు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సర్ఫరాజ్‌, కార్తీక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆత్మవిశ్వాసంతో కనిపించిన సర్ఫరాజ్‌ రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఎనిమిదో ఓవర్‌లో జడేజా సీఎస్‌కే వెన్నువిరిచాడు. సర్ఫరాజ్‌తో పాటు హిట్టర్‌ శివమ్‌ దూబే (6)ను పెవిలియన్‌కు చేర్చాడు. కాసేపటికే కుదురుకున్న కార్తీక్‌ను పేసర్‌ బ్రిజేష్‌ ఎల్బీగా అవుట్‌ చేయడంతో 74/7 స్కోరుతో చెన్నై కష్టాల్లో పడింది. దీంతో జట్టు స్కోరు వంద దాటడం కష్టమే అనిపించింది. కానీ ఎనిమిదో నెంబర్‌ బ్యాటర్‌ ఒవర్టన్‌ పట్టుదలతో క్రీజులో నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడాడు. అతడికి అన్షుల్‌ (7 నాటౌ ట్‌) నుంచి సహకారం లభించగా.. స్కోరు 120 దాటింది. చివరి వికెట్‌కు ఈ జోడీ అత్యధికంగా 33 రన్స్‌ అందించడం విశేషం.

1 277 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్‌లో చెన్నై జట్టు ధోనీ, రైనా లేకుండా బరిలోకి దిగడం ఇదే తొలిసారి.

2 రాజస్థాన్‌ తరఫున రెండో ఫాస్టెస్ట్‌ (15 బంతుల్లో) ఫిఫ్టీ పూర్తి చేసిన వైభవ్‌. జైస్వాల్‌ (13) ముందున్నాడు.

Updated Date - Mar 31 , 2026 | 01:31 AM