ఫుట్‌బాల్‌లోకి ఉసేన్ బోల్ట్ రీఎంట్రీ?
ABN , Publish Date - Aug 22 , 2026 | 09:16 PM
ప్రపంచ అథ్లెటిక్స్‌లో తన వేగంతో చరిత్ర సృష్టించిన జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ మరోసారి ఫుట్‌బాల్ మైదానంలో కనిపించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ అథ్లెటిక్స్‌లో తన వేగంతో చరిత్ర సృష్టించిన జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ మరోసారి ఫుట్‌బాల్ మైదానంలో కనిపించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మాంచెస్టర్‌కు చెందిన వైతెన్‌షా వెట్స్ ఎఫ్‌సీ రిజిస్టర్డ్ ఆటగాళ్ల జాబితాలో ఉసేన్ బోల్ట్ పేరు కనిపించింది. 35 ఏళ్లు పైబడిన ఆటగాళ్లతో కూడిన ఈ జట్టులో బోల్ట్ పేరు ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ వెబ్‌సైట్‌లో శుక్రవారం దర్శనమిచ్చింది. అయితే ఈ సీజన్‌లో బోల్ట్ తమ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని వైతెన్‌షా వెట్స్ ఎఫ్‌సీ అధికారికంగా ధ్రువీకరించలేదు. దీంతో బోల్ట్ నిజంగా మైదానంలోకి దిగుతాడా? లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
స్టార్ ఆటగాళ్లతో వెట్స్ జట్టు
వైతెన్‌షా వెట్స్ ఎఫ్‌సీ ఇప్పటికే పలువురు మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఆకర్షించింది. ఇంగ్లండ్ మాజీ స్ట్రైకర్ ఎమిల్ హెస్కీ, మాంచెస్టర్ యునైటెడ్ మాజీ కెప్టెన్ ఆంటోనియో వాలెన్సియా, ప్రీమియర్ లీగ్ ఛాంపియన్లు జోలియన్ లెస్కాట్, డానీ డ్రింక్‌వాటర్ ఈ సీజన్‌లో వెటరన్స్ జట్టు తరఫున ఆడనున్నట్లు సమాచారం. ఇలాంటి మాజీ స్టార్‌లతో కలిసి బోల్ట్ కూడా బరిలోకి దిగితే.. ఈ వెటరన్స్ జట్టు మ్యాచ్‌లపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనడం ఖాయం.
అథ్లెటిక్స్ తర్వాత ఫుట్‌బాల్ వైపు..
ఉసేన్ బోల్ట్ 2017 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ అనంతరం అథ్లెటిక్స్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిన్ననాటి నుంచి తనకు ఇష్టమైన ఫుట్‌బాల్‌పై దృష్టి పెట్టాడు. 2018లో ఆస్ట్రేలియా ఏ-లీగ్ క్లబ్ సెంట్రల్ కోస్ట్ మారినర్స్ తరఫున స్నేహపూర్వక మ్యాచ్‌ల్లో బోల్ట్ రెండు గోల్స్ చేశాడు. అనంతరం ఆ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నప్పటికీ.. కేవలం ఎనిమిది వారాలకే ఆ బంధం ముగిసింది. 2019 ప్రారంభంలో ఫుట్‌బాల్‌కు కూడా బోల్ట్ వీడ్కోలు పలికాడు.
40 ఏళ్ల వయసులో మరోసారి మైదానంలోకి?
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్ప్రింటర్‌గా పేరొందిన బోల్ట్ ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో ఉన్నాడు. 100 మీటర్ల ప్రపంచ రికార్డు ఇప్పటికీ అతడి పేరిటే ఉంది. ఇప్పుడు మాంచెస్టర్‌కు చెందిన వెటరన్స్ జట్టు జాబితాలో అతడి పేరు కనిపించడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. అయితే క్లబ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు బోల్ట్ ఈ సీజన్‌లో ఆడతాడని చెప్పడం తొందరపాటే.
ఇవి కూడా చదవండి:
బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ట్రీసా-గాయత్రి జోడీకి కాంస్యం
అండర్ 20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు