Share News

షాహిద్ అఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ..

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:30 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కేవలం 23 పరుగులే చేసినప్పటికీ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

షాహిద్ అఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ..
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కేవలం 23 పరుగులే చేసినప్పటికీ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డుపైనా రోహిత్ కన్నేశాడు (Rohit Sharma Record).


న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో రోహిత్ శర్మ 28 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ రెండు సిక్సర్లతోనే రోహిత్ రికార్డు బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు షాహిద్ అఫ్రిది పేరిట ఉండేది. అఫ్రిది 38 వన్డేల్లో 50 సిక్సర్లు కొట్టాడు. అయితే రోహిత్ తన 36వ మ్యాచ్‌లోనే 51 సిక్సర్లతో అతడిని అధిగమించాడు. దీంతో న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ అగ్రస్థానానికి చేరుకున్నాడు (Shahid Afridi Record break).


వన్డేల్లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచేందుకు రోహిత్ శర్మకు మరో అవకాశం ఉంది (Rohit Sharma Sixes). ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ 87 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో వన్డేకు ముందు రోహిత్ ఖాతాలో 83 సిక్సర్లు ఉన్నాయి. తాజా మ్యాచ్‌లో మరో రెండు బాదడంతో అతడి సంఖ్య 85కు చేరింది. గేల్ రికార్డును అధిగమించాలంటే రోహిత్ మరో మూడు సిక్సర్లు కొట్టాలి.


ఇవి కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..


అమెరికా దాడుల భయం.. ఇరాన్‌లో అయోడిన్ మాత్రలు పంచుతున్నారా..

Updated Date - Nov 07 , 2026 | 05:30 PM